పెళ్లి చేసుకోవడం కోసం ఆ యువతి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. తరువాత ఏమైందో తెలుసా..?

నేటి తరుణంలో వివాహం చేసుకోవడం అనేది యువతీ యువకులకు ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. కెరీర్‌ తోపాటు లైఫ్‌లో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు.. అని చాలా మంది అనుకుంటూ ఆలస్యం చేస్తున్నారు. దీంతో టైం వచ్చే సరికి తమకు నచ్చిన వధువు, వరుడు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది పెళ్లికాకుండా అలాగే ఉండిపోతున్నారు. మరోవైపు మాట్రిమోనియల్‌లో అప్లై చేద్దామంటే వారు ఫీజు వసూలు చేస్తారు కానీ.. మనకు సరిపోయే వధూవరులను మాత్రం చూపించరు. అయితే ఇవన్నీ ఇబ్బందులు పడడం ఎందుకు అనుకుంది ఆ యువతి. అంతే.. పెళ్లి చేసుకోవడం కోసం ఒక వినూత్న ప్రయోగం చేసింది. అదేమిటంటే…

ఆమె పేరు జ్యోతి కె.జి. కేరళలోని మళప్పురం జిల్లాలో నివాసం ఉంటోంది. అయితే ఈమె పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ మ్యాట్రిమోనియల్‌ సైట్ల జోలికి వెళ్లకుండా ఓ వినూత్న ప్రయోగం చేసింది. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే చెప్పవచ్చని, కులం, మతం పట్టింపులేదని, తనకు తల్లిదండ్రులు లేరని, బీఎస్‌సీ ఫ్యాషన్‌ టెక్నాలజీ చదివానని, తన వయస్సు 28 సంవత్సరాలని, తన సోదరుడు ముంబైలో పనిచేస్తున్నాడని, సోదరి చదువుకుంటుందని తెలియజేస్తూ తన అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌లతో సహా ఓ పోస్టును ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది.

జ్యోతి అలా తన వివరాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగానే ఆ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. కేవలం కొన్ని గంటల్లోనే 6వేల షేర్లు, 10వేల లైక్‌లు వచ్చాయి. ఆమె ఇలా చేయడంపై చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు. ఈ క్రమంలో జ్యోతిని ఇలా చేయడంపై వివరణ అడగ్గా.. ఫేస్‌బుక్‌లో చాలా మంది తెలిసిన వారుంటారని, కావల్సిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకునేందుకు అది సరైన వేదికని, అలాంటప్పుడు మ్యాట్రిమోనియల్‌ సైట్లలో డబ్బులు ఖర్చుపెట్టి మరీ వధూవరులను ఎంచుకోవడం అవసరం లేదని ఆమె చెబుతోంది. అసలు పెళ్లి చేసుకోవాలనుకునే వారి కోసం ఫేస్‌బుక్‌లో మ్యాట్రిమోనీ సెక్షన్‌ పెడితే బాగుంటుందని ఆమె అభిప్రాయపడింది.

అయితే ఫేస్‌బుక్‌లో ఇలా పెళ్లి కోసం పోస్టు పెట్టడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలా ఓ యువకుడు చేశాడు. కేరళకు చెందిన రంజిత్‌ అనే వ్యక్తి గతంలో ఫేస్‌బుక్‌లో ఇలా అచ్చం జ్యోతి పెట్టినట్టుగానే తన పెళ్లి కోసం ఓ పోస్టు పెట్టాడు. దీంతో అనేక మంది స్పందించారు. చివరకు అతను గురువాయూర్‌కు చెందిన సరిగమ అనే యువతిని అదే నెలలో పెళ్లి చేసుకున్నాడు. మరిప్పుడు జ్యోతికి కూడా బాగానే స్పందన వచ్చింది. ఇక ఆమె ఎవర్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా.. ఆమె చేసిన ఈ ప్రయత్నం భలే విచిత్రంగా ఉంది కదా..!

Reply