Header Ads

వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు.!! Real Story.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 60 ఏళ్లకు పైబడిన వాళ్లు 10 కోట్ల మందికి పైగా ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత దేశంలోని కుటుంబ జీవితం గణనీయమైన మార్పులకు లోనైన క్రమంలో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తోంది.
ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల స్థానంలో ఇప్పుడు చిన్న, అతి చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. అనేకమంది భారతీయులు ఇప్పుడు తమ తల్లిదండ్రులు ఉన్న నగరాలలో లేదా దేశాలలో ఉండడం లేదు.

‘‘పిల్లలకు భారం కావడం ఇష్టం లేకే..’’
76 ఏళ్ల సుమతి, ''నేను సరిగా వినలేను, నడవలేను'' అన్నారు. ఆమె వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఆమె మాట కూడా స్పష్టంగా రావడం లేదు. ఆమెకు మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు ఉన్నాయి.

ఆమె తన జీవితంలో ఎక్కువభాగం కుటుంబాన్ని సంరక్షిస్తూ గడిపారు. కానీ ఇప్పుడు తాను వృద్ధాశ్రమంలో ఉండడమే మేలని ఆమె భావిస్తున్నారు.

భారతదేశంలో గత దశాబ్దకాలంగా.. ఇష్టపూర్వకంగానో, బలవంతంగానో వృద్ధాశ్రమాలలో ఉంటున్న వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

''ఇంటికి తిరిగి వెళ్లి అక్కడ నేనేం చేయాలి? నా పిల్లలకు భారం కావడం నాకిష్టం లేదు'' అంటారు సుమతి.

ఐదేళ్ల క్రితం వృద్ధాశ్రమానికి వచ్చిన 80 ఏళ్ల పరమేశ్వర్, రాత్రిళ్లు తనకు నిద్ర పట్టదంటారు.

''కుటుంబం నుంచి సహకారం అందనప్పుడు, ఇలాంటి వృద్ధాశ్రమాలే ఉండడానికి ఇంత చోటు, తినడానికి ఇంత తిండి ఇస్తాయి'' అన్నారాయన.

ఆయన భార్య మూడేళ్ల క్రితం మరణించారు. ఆమె లేకపోవడం తననెంతో కలచివేస్తుందని ఆయన తరచుగా అంటుంటారు.

పరమేశ్వర్‌కు ఇప్పుడు ఎడమ కన్ను కనిపించడం లేదు. కానీ ఆయన ప్రతిరోజూ చాలా ఇష్టంగా దినపత్రికను చదువుతారు. రాజకీయాల గురించి, క్రీడల గురించి మాట్లాడితే ఆయన మొహం వెలిగిపోతుంది.

'అవసరం లేని' మనిషి
93 ఏళ్ల శారద, భర్త మరణించడంతో వృద్ధాశ్రమంలో చేరాల్సి వచ్చింది. మొదట్లో ఆమె ఆరు నెలలు పెద్ద కొడుకు ఇంట్లో, ఆరు నెలలు చిన్నకొడుకు ఇంట్లో ఉండేవారు. వాళ్లు ఎప్పుడైనా సెలవుల్లో బైటికి వెళితే వృద్ధాశ్రమంలో వదిలి వెళ్లేవారు.

కానీ క్రమంగా వాళ్లకు ఆమె ఒక 'అవసరం లేని' మనిషిగా కనిపించడం ప్రారంభించింది. దాంతో ఆమె శాశ్వతంగా వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నారు.

''వృద్ధాశ్రమంలో చేరాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నాకిప్పుడు జీవితంలో ఏమీ కోరికలు లేవు. నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నానంతే'' అని నిర్వేదంగా అన్నారామె.

ఆ వృద్ధాశ్రమంలోని వారంతా ఒకరితో ఒకరు కాలక్షేపం చేస్తుంటారు. కుటుంబ సభ్యుల్లాగే కొంతమంది కలిసిమెలిసి భోంచేస్తారు.

''నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు. అయినా ముసలివాళ్లయాక మనం ఎక్కడో ఓ చోట ఉండాలిగా,'' అన్నారు శారద.

ఆమెకు చదవడమంటే చాలా ఇష్టం. నవలలు, ఆధ్యాత్మిక పుస్తకాలు రెండూ చదువుతారు ఆమె. వాటితో నిత్యం తీరిక లేకుండా కనిపిస్తారు.

''మార్పు అనేది ఒక విశ్వవ్యాప్త నియమం'' అన్నారు 80 ఏళ్ల సత్యనారాయణ్. ఆయన ఐదేళ్ల క్రితం వృద్ధాశ్రమంలో చేరారు. కొత్తవాళ్లతో కలిసి ఉండడానికి ఆయన మొదట కొంచెం ఇబ్బంది పడ్డారు.

తన కుటుంబం ఆయన బాగోగులు చూసుకోకపోవడంతో ఆయన వృద్ధాశ్రమానికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు తాను కుటుంబసభ్యులను కలవడం లేదని ఆయన వెల్లడించారు.

''నువ్వు ఒక్క క్షణంలో కోటీశ్వరుడివి కావచ్చు లేదంటే బిచ్చగాడిగా మారవచ్చు. కానీ జీవితం ఎవరి కోసమూ ఆగదు'' అన్నారాయన.

ఆయనకు శరీరాంగాలు విపరీతంగా వాచిపోయి, నొప్పిపెట్టే బోదవ్యాధి వచ్చింది. దాంతో ఆయన సంరక్షణ చూసుకోవడం తమ వల్ల కాదని కుటుంబసభ్యులు చేతులెత్తేశారు.

ఆయన సంగీతమంటే చాలా ఇష్టం. ఆయన గంటల కొద్దీ తన గదిలోనే రేడియో వింటూ కాలం గడిపేస్తారు.

102 ఏళ్ల సుశీల రోజంతా చేతిలోని జపమాలను తిప్పుతూ, మంత్రాలు పఠిస్తుంటారు. ఆమె పాటలు కూడా పాడతారు. తన చిన్నప్పటి విషయాలు కూడా బాగా గుర్తున్నాయన్న ఆమె.. తన కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడడానికి మాత్రం ఇష్టపడలేదు.

''ఏం కోల్పోయావని బాధపడతావ్? నువ్వు ఈ ప్రపంచంలోకి ఏం తీసుకొచ్చావ్, ఏం తీసుకుపోతావ్?'' అంటారామె.

రెండేళ్ల క్రితం వృద్ధాశ్రమంలో చేరిన 67 ఏళ్ల లక్ష్మి గత జూన్‌లో మరణించారు. ఆమె మృతదేహం కోసం బంధువులు ఎవరూ రాలేదు. దాంతో వృద్ధాశ్రమ నిర్వాహకులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

వృద్ధాశ్రమంలో నివసించేవారు మరణిస్తే వాళ్లంటూ అక్కడ జీవించారనడానికి సాక్ష్యాలు కేవలం ఒక వాచీనో, ఒక రేడియోనో, ఒక ఫోనో మిగిలి ఉంటాయంతే.

No comments