Header Ads

జ‌నం ఆర్తిగీతం..గోరేటి గానం.!!

గోరేటి వెంక‌న్న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. లోక‌మంతా పాటై ప్ర‌వ‌హించిన వాడు. పాటే త‌న వ్యాప‌క‌మంటూ .పాటే త‌న జీవిత‌మంటూ పాటే తానైన‌వాడు. పాట కోసం ప‌రుగులు తీస్తున్న వేళ‌..త‌న చుట్టూ పాటే తిరిగేలా చేసుకున్న‌వాడు . ప‌రిచ‌యం అక్క‌ర‌లేని వ్య‌క్తి ఆయ‌న‌. ప‌క్షులు..కిల‌కిలా రావాలు..బ‌య‌ళ్లు..పొలాలు..గ‌ట్లు..తుమ్మెద‌లు.గువ్వ పిట్లు..నీళ్లు..క‌న్నీళ్లు..మ‌ట్టితో మ‌మేక‌మై పోయిన బ‌తుకు ఆయ‌న‌ది. జ‌నం బాధ‌ల‌కు ప‌ల్ల‌విగా మారిపోయి..ప్ర‌జ‌ల క‌న్నీళ్ల‌కు కొత్త అర్థం చెప్పిన వాడు..అన్నింటా తానే అయి గుండె లోతుల్లో గ‌డ్డ క‌ట్టుకు పోయిన గాత్రానికి కొత్త సొబ‌గుల‌ను అద్దిన‌వాడు ఎంక‌న్న‌. ఎంత చెప్పినా ఊట బావి లాంటిది ఆయ‌న పాట‌.
క‌ర‌వుకు కొండ గుర్తుగా మారి పోయిన ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా తెల‌క‌ప‌ల్లి మండ‌లం గౌరారం వెక‌న్న‌ది. గోర‌టి న‌ర‌సింహ‌. ఈర‌మ్మ త‌ల్లిదండ్రులు. పేద కుటుంబం. కుల వృత్తులు విధ్వంస‌మ‌వుతున్న వేళ వాటిని న‌మ్ముకుని జీవిస్తున్న చ‌రిత్ర త‌న‌ది అంటారాయ‌న‌. నా గోస‌కు..నా బాధ‌కు ..నా పాట‌కు ప్రాణం పోసుకున్న‌ది ఇక్క‌డే. క‌ళ్ల‌ళ్లో క‌న్నీళ్లు..ఒక్కో నీటి చుక్క రాలి పోతున్న‌ది. నా ప‌ల్లె నాలోకి చేరి పోయింది. నేను ఇవాళ పాట క‌డుతున్నా..పాడుతున్నానంటే నా ప‌ల్లే కార‌ణం. ఒక‌ప్పుడు ఎట్లా ఉండేది నా ప‌ల్లె. ప‌చ్చ ప‌చ్చ‌ని పంట‌ల‌తో అల‌రారేది. వాగుల్లో నీళ్లు నిండేవి. నాకు తెలివి వ‌చ్చింది ర‌ఘుప‌తిపేట‌లోనే.

మా ఊరికి ర‌ఘుప‌తిపేట‌కు మ‌ధ్య అందాల దుందుభి న‌ది ఉండేది. ఏటిలో ఆట‌లాడుకునే వాళ్లం. గిల‌క రాళ్ల‌ను ఏరుకునే వాళ్లం. ఎంత బావుండేదో ఆ ప‌ల్లె. స్వ‌చ్చ‌మైన గాలి శ‌రీరాన్ని తాకుతుంటే..క‌ల్లు ముంతల‌ను చేతిలోకి తీసుకున్న‌ట్టుగా ఉండేది. చాలాసార్లు ఎండిపోయిన దుందుభిని చూసి చ‌లించి పోయా. క‌న్నీంటి ప‌ర్యంత‌మ‌య్యా. అందుకే త‌ట్టుకోలేక వాగు ఎండి పాయెరో..పెద వాగు ఎండిపాయెరో అంటూ పాట క‌ట్టిన .

ప్ర‌జ‌లు ఆ పాట‌తో లీన‌మ‌య్యారు. మా ఊరికి రెండు కిలోమీట‌ర్ల దూరంలో గాజులోని గ‌డ్డ ఉంట‌ది. ల‌చ్చ‌మ్మ దేవ‌త ఉంట‌ది. చుట్టు ముట్టు ఏమీ ఉండ‌దు. దాని ప‌క్క‌న పొద‌లుంట‌వి. వీట‌న్నింటిని నాలోకి చేర్చుకున్న‌. అందుకే నా ప‌ల్లె అందాలు చూసితే క‌నువిందు..అనే పాట రాసిన‌. ఈ పాట ప్రాణం పోసుకున్న‌ది . అక్క‌డే ఎర్ర భూమి..ఇసుక భూమి క‌లిసే వుంట‌వి. ఎప్పుడూ నాకు స్ఫూర్తినిచ్చేది ఇదే. న‌క్క‌లు, తోడేళ్లు తిరుగాడుతుంట‌వి. గువ్వ‌లు గుడ్లు పెట్టిన గుర్తులుంట‌వి. ఎండా కాలం..వానా కాలం అంతా అక్క‌డే ఉండి పోవాల‌ని అనిపిస్తుంది. మేక‌ల పోర‌లు హాయిగా ఆడుకుంటూ కాసేటోళ్లు. పెబ్బ‌ర్లు, అనుములు, కందులు, బుడ్డ‌లు , జొన్న‌లు ఇవ్వ‌న్నీ పండేవి. భ‌ద్ర‌య్య బావి. ఇది
నాకు కొండ‌గుర్తు. వేస‌వి కాలంలో ఏప విత్తులు ఏరుకొని వ‌చ్చేటోన్ని . పండ్లు రాలుతుంటే చూసేటోన్ని.

స‌ల్ల‌టి గాలి సోకేది. సుర్రుమ‌నేది. ..గువ్వ పిట్ట‌లు న‌వ్వేవి. మా ప‌ల్లెకు ఉత్త‌రాన రామ‌గిరి గుట్ట ఉండేది. ఇది నాకిష్ట‌మైన తావు. ఇవ‌న్నీ నా పాట‌కు ప్ర‌తిరూపాలు. అందుకే నా మూలాలు నా పాట‌ల్లో, గానంలో ప్ర‌తిఫ‌లిస్తుంట‌వి. ఏదో పోగొట్టుకున్న‌ట్లు..ఇంకేదో న‌న్ను ఆవ‌హిస్తున్న‌ట్టుగా అనిపిస్తుంది. పాట పాడుతుంటే . అందుకే నేను ఏడుస్తా. న‌వ్వుతా..గెంతుతా ..ఎగురుతా..పీర్ల పండుగ వ‌స్తే పండ‌గే. అందుకే త‌రుక‌ల పోర‌లు యాడికి పోయిరి. పెట్రోలు మురికిల మురిక‌య్యిండ్రా..అని ప‌ల్లే క‌న్నీరు పెడుతుందో క‌నిపించ‌ని కుట్ర‌ల‌..నా త‌ల్లీ బందీ అయిపోయిందో.. అంటూ గానం చేసిన‌. నిండుగా న‌వ్వేటి..నోరారా పిలిచేటి..క‌డుపు నిండా తిండి దొరికేటి ఆ ప‌ల్లె కావాలి. అందుకే ఇరుకైనా..క‌ష్ట‌మైనా..వెట్టిగా మారినా..దోపిడీకి లోనైనా ఎందుకో ప‌ల్లెలోకి చేరిపోయాల‌ని అనిపిస్తుంది.

దుఖఃంలో ఉన్నంత ఆనందం సంతోషంలో ఎక్క‌డ దొరుకుతుంది.. ప్ర‌పంచీక‌ర‌ణ నా త‌ల్లి అయిన ప‌ల్లె బోసి పోయింది. విగ‌త‌జీవులైన మ‌నుషులు..ఇప్ప‌టికైనా అప్పుడే బావుండేది. గాలి, నీరు, వెలుతురు స్వ‌చ్ఛంగా ఉండేవి. పాల పిట్ట‌ల న‌వ్వుల్లా వుండేవి. గాలి, నీరు , వెలుతురు స్వ‌చ్ఛంగా ఉండేవి. పాల పిట్ట‌ల న‌వ్వులా ఉండేది. గుబురు కొమ్మ‌ల్లా ఆడేవి. ల‌గ‌దూడ‌ల శ‌బ్ధాలు, ప‌శువుల గెట్టెల చ‌ప్పుళ్లు వినిపించేవి హృద్యంగా. అందుకే నా పాట‌ల‌న్నీ గువ్వ పిట్ట‌లా అల్లుకుపోత‌వి అంటారు వెంక‌న్న‌.

పాట‌కు ప‌రిమితులంటూ ఉండ‌వు. అవి ఒక‌రు విధించుకున్నవి మాత్ర‌మే. నాకు తెలిసి నిబ‌ద్ధ‌త‌, నేప‌థ్యం వుంటుంది. ఇలా రాయాలి..ఇక్క‌డే ఆపేయాలి..అని అనుకుంటే ఏదీ ప‌రిపూర్న‌మైన అర్థాన్నివ్వ‌దు. క‌ళ స‌జీవం. క‌ళ అజ‌రామ‌రం. బ‌తుకును ప్ర‌తిఫ‌లింప చేసేందుకు క‌ళ ప్ర‌య‌త్నం చేయాలి. క‌ళ‌లో జీవితం తొణిక‌స‌లాడాలి. స‌మ‌స్త జ‌నం బాధ‌ల‌తో ఇబ్బందుల‌తో క‌న్నీళ్ల‌తో స‌హ‌వాసం చేస్తుంటే ప‌రిమితంగా ఎలా రాస్తాం. అందుకే స్వేచ్ఛ‌లేని చోట క‌ళ బ‌తుక‌దు. పాట‌కు ప‌రిమితి ఉండ‌రాదు..ఉండ కూడ‌దు కూడా. నా వ‌ర‌కు నేను ఏనాడూ ప‌రిమితులు విధించు కోలేదు. నన్ను ఆలోచ‌న‌లు ఆవ‌హించిన‌ప్పుడు న‌ను పాట మొద‌లు పెడ‌తా. పాటైనా ఇంకే క‌ళ అయినా మ‌నిషిని ఆపాద‌మ‌స్త‌క‌మంతా ఆవిష్క‌రించాలి. బ‌తుకు మాయా మ‌ర్మాన్ని వెలికి తీయాలి. అపుడు పాట ఊపిరిని బిగ‌ప‌ట్టేలా చేస్తుంది. చైత‌న్యానికి ఇది ఒక వాహ‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

న‌చ్చిన‌పాటంటే..ఏమ‌ని చెప్పాలి..ఎన్న‌ని చెప్పాలి. ఆడిపాడిన జ్ఞాప‌కాలను ప‌దిలంగా ఉండేలా రాసిన‌వి ఎన్నో పాట‌లున్న‌వి. వాటిల్లో అన్నీ న‌చ్చిన‌వే..కానీ మీర‌న్న‌ట్టు న‌న్ను క‌దిలించింది..ఈ మ‌ధ్య కాలంలోనే నేను రాసిన ..వాగు ఎండి పాయెరో ..పెద వాగు ఎండి పాయెరో..సంతా మాఊరి సంతా..క‌ల్లు పై..తెలంగాణ చ‌రిత్ర‌..కంప‌తారు చెట్లు కొట్టి..సేతాన మేడుందిరా..సేల‌న్నీ బీడాయెరా..అన్న పాట కూడా..నా క‌న్న‌త‌ల్లి మీద రాసిన‌. అందుకోర గుత్పందుకో..ఈ దొంగ‌ల త‌రిమేటందుకు..గుగ్గూ గూసింత‌..కాసిందిర పులిసింత‌..నా ప‌ల్లెకెన్ని అందాలో..వ‌ల‌స‌లు, ఆత్మ‌హ‌త్య‌లు , ఆక‌లి చావులు, దాడులు, దౌర్జ‌న్యాలు, అత్యాచారాలు, బాల కార్మికులు, బ‌తుకును పారేసుకున్న వాళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే వంద‌లు..వేల పాట‌లు రాసా. మ‌న‌సును క‌దిలించే ప్ర‌తి పాటా గొప్ప‌దే. ఇందులో ఎక్కువ త‌క్కువ‌లంటూ వుండ‌వు. పేద‌లే నా పాట‌కు ప‌ల్ల‌వులు..వ‌స్తువులు కూడా.

అప్పుడెప్పుడో నా గొంతుపై కొంత ప్ర‌యోగం జ‌రిగింద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. చాలా ఏళ్ల కింద‌ట నా గొంతు బొంగురు పోయిన మాట వాస్త‌వం. మందులు వాడా, చిన్న ఆప‌రేష‌న్ చేయించుకున్నా. నా గొంతులోని జీర నాకు ఇష్ట‌మైన‌ది. అదే న‌న్ను బ‌తికిస్తోంది. నా శ్వాస‌. నా శ‌రీరం అంతా మాన‌వ‌త్వాన్ని అందుకోవాల‌ని, ప్ర‌తి ఒక్క‌రు సంతోషంగా ఉండాల‌న్న‌దే నా లక్ష్యం. ఈర్ష్యా విద్వేషాల‌కు నేను అతీతుడిని. మ‌నిషిని మ‌నిషి చంప‌డం. ద్వేషించ‌డాన్ని నేను నిర్ద్వందంగా వ్య‌తిరేకిస్తా. ప్ర‌తి ఒక్క‌రిలో మ‌లినం అంట‌ని న‌వ్వులు చూడాల‌న్న‌దే నా త‌ప‌న‌.

ఏ రాజ‌కీయ నేప‌థ్యం ఉండాల్సిన ప‌నిలేదు. ఎవ‌రి స‌హ‌కారం లేకుండానే యోగులు, బైరాగులు, తాత్వికులు ఎన్ని రాయ‌లేద‌ని. పోత‌న‌, వేమ‌న‌, పోతులూరి వీర‌బ్రహ్మం వీళ్లంతా సామాన్యులే. వీరికి ఏ నేప‌ధ్యం ఉంద‌ని..కాలం మారినా..త‌రాలు దొర్లిపోయినా క‌న్నీళ్ల బాధ అంతా ఒక్క‌టే. రాణించ‌డం అనే దానిని ఒప్పుకోను. ఎంద‌రో మ‌హానుభావులు. ఈ ప్రాంతాన్ని సుసంప‌న్నం చేశారు. అద్భుత‌మైన క‌ళారూపాలు ఇక్క‌డ ప్రాణం పోసుకున్నాయి. నా నేలంత విధ్వంస‌మైన నేల ప్ర‌పంచంలో ఎక్క‌డా లేదు. రోజూ వేలాది మంది ప్ర‌జ‌లు జానెడు పొట్ట నింపుకునేందుకు వ‌ల‌స పోత‌రు. క‌న్న బిడ్డ‌ల‌ను విడిచి పోత‌రు.

ఎంత ధైర్యం ఉండాల‌. అందుకే రాసిన వ‌ల‌స పోయిన డ‌బ్బుల‌తో పేద‌లు వ‌డ్డి క‌డుత‌ర అని. జ‌నంతో స‌మ్మిళిత‌మైతే ..న్యాయం కోసం..ధ‌ర్మం కోసం ..నీతి నిజాయితీ, నిబ‌ద్ద‌త‌తో ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డితే ఎన్నైనా రాయ‌వ‌చ్చు. పండ‌గ సాయ‌న్న స్ఫూర్తి, సుబ్బారావు పాణిగ్ర‌హి, సుద్దాల హ‌న్మంతు, గ‌ద్ద‌ర‌న్న ..ఇలా వేలాది మంది ఈ జ‌నం గురించా రాసిండ్రు..పాడిండ్రు. ఏదో ఒక నేప‌థ్యం లేక‌పోతే బ‌త‌క‌డం క‌ష్ట‌మ‌వుతుంది అనుకోవ‌డం భ్ర‌మ త‌ప్ప మ‌రోటి కాదు. తెలంగాణ‌తో పాటు రాయ‌ల‌సీమ కూడా క‌ర‌వుకు లోనైంది. ఎక్క‌డ దుఖఃం, ఎక్క‌డ బాధుందో అక్క‌డ నా పాట గొంతెత్తి పాడుతుంది. సినిమాల‌కు పాట‌లు రాసిన‌. అవి పాపుల‌ర్ అయ్యాయి. ఇది యాధృశ్చింగా జ‌రిగింది.

నేను రాసిన ప‌ల్లె క‌న్నీరు పాట‌..టీడీపీ స‌ర్కార్ ఓట‌మి పాల‌య్యేందుకు తోడ్ప‌డింద‌న్న వార్త ఇప్ప‌టికీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వాడుకుంది. పీపుల్స్ ఎన్‌కౌంటర్‌, శ్రీ‌రాముల‌య్య‌, బ‌తుక‌మ్మ లాంటి ఎన్నో సినిమాల‌కు పాట‌లు రాశా. చాలా మంది వాడుకుంటున్నారు..ఎవ‌రినీ కంట్రోల్ చేయ‌లేం. ప్ర‌చారం ..పొగ‌డ్త అనేవి క‌ళాకారుల‌ను నాశ‌నం చేస్త‌వి. ఒక ప‌ట్టాన నిలువ‌నీయ‌వు. అందుకే నేను వాటికి దూరంగా వుంటా. న‌న్ను నేను ప్ర‌తిక్ష‌ణం ప‌రిశీలించుకుంటూ..వెళుతుంటా.

నాలోకి నేను చూసుకుంటే ఏముంది. వైరాగ్యంలో గానం చేస్తే పండు వెన్నెల హృద‌యాన్ని ముద్దాడిన‌ట్టుగా ఉంటుంది. నేను ఎక్క‌డికి వెళ్లినా ప‌ల్లె క‌న్నీరు పెడుతుందో నంటూ పాట పాడ‌మంట‌రు..ఆడ‌మంట‌రు..రాయ‌టం..చ‌ద‌వ‌డం నా దిన‌చ‌ర్య‌. ప్ర‌కృతి లేకుండా నేను లేను. ప్ర‌జ‌లు బాధ‌ల నుండి విముక్తి చెందేంత దాకా నా పాట‌ల ప్ర‌స్థానం కొన‌సాగుతూనే సాగుతుంది. నేను బాధ‌ప‌డుతూ వుంటే బ‌తుకు ఎట్లా గ‌డుస్తుంది అంటారు అమాయ‌కంగా వెంక‌న్న‌. ఎంత సంపాదించినా ఆర‌డుగుల నేల అయితే కావాలి క‌దా. ఏదీ శాశ్వ‌తం కాదు. బ‌తుకు మ‌ర్మం తెలిస్తే ఇవ్వ‌న్నీ పైపై మెరుగులేన‌ని అర్థ‌మ‌వుతుంది. ఒదిగి ఉండ‌డం నాకిష్టం. నేర్చుకోవ‌డం నా ధ‌ర్మం. కొన ఊపిరి ఉన్నంత దాకా క‌ళాకారుడిగానే ప్ర‌యాణం చేస్తుంటా..ప్ర‌కృతిలోనే లీన‌మైపోయి సాగిపోవ‌డ‌మే నాకు కిష్టం అంటున్నారు గోరేటి వెంక‌న్న‌.

No comments