Header Ads

దిగంతాల్ని వెలిగించే ధూప‌మ‌దిగో - కిషోర్‌దా అల్విదా

ఈ కాలం వుందే..అదో విచిత్ర‌మైన‌ది..ఎప్పుడు ఏం చేస్తుందో ..ఎవ‌రూ చెప్ప‌లేరు. ప్ర‌కృతి ఓ వైపు..కాలం ఇంకో వైపు మ‌న‌ల్ని ప‌రీక్షిస్తూనే వుంటాయి. ఈ జీవితం అనే ఇరుసుకు ఇవి రెండూ జోడు గుర్రాలు. సుఖ దుఃఖాలు, క‌ష్ట సుఖాలు..క‌న్నీళ్లు..కాసిన్న న‌వ్వులు..అప్పుడప్పుడు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఏకాంతం కొంద‌రికి న‌ర‌క‌మైతే..ఇంకొంద‌రికి త‌మ‌ను తాము తెలుసుకునేందుకు దోహ‌ద ప‌డే మార్గ‌ద‌ర్శి. లైఫ్ అర్థం కావాలంటే కాసింత క‌ళాపోష‌ణ ఉండాలి. లేక పోతే జీవితానికి అర్థం ఏముంటుంద‌ని..?


ఉద‌యం నుండి రాత్రి ప‌డుకునే దాకా ఇదే జీవిత‌మ‌నుకుని త‌నువులు చాలించిన వాళ్లు ఎంద‌రో ఈ లోకంలో. కొంద‌రికి మ‌నీ కావాలి..ఇంకొంద‌రికి హోదా కావాలి. వీరంద‌రి కంటే ఈ ప్ర‌పంచానికి దూరంగా త‌మ‌లో తాము నవ్వుకుంటూ..పాడుకుంటూ..వింటూ..ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ..సంచ‌రిస్తూ..సాగి పోయే వాళ్లు ఇంకొంద‌రు. కోట్లు ఇవ్వ‌లేని ఆనందాన్ని క‌ళ‌లు ఇస్తాయి. పాట ఇచ్చినంత స్వాంత‌న ఏదీ ఇవ్వ‌దు..ఈ వ‌ర‌ల్డ్‌లో. అలాంటి వారిలో సినిరంగాన్ని త‌మ అద్భుత‌మైన గాత్రంతో ఏలిన వారు ఎంద‌రో. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌, త‌మిళ రంగాల‌కు చెందిన వారు త‌మ పాట‌ల‌తో అల‌రిస్తున్నారు. మ‌న‌సు దోచేస్తున్నారు. కానీ 1970 నుండి 1990 వ‌ర‌కు గోల్డెన్ పీరియడ్ గా భావించాల్సి ఉంటుంది. ర‌ఫీ, మ‌న్నాడే, కిషోర్ కుమార్‌, ఎస్పీబీ లాంటి వారు త‌మ గాత్రంతో ల‌క్ష‌లాది మందిని స్పందించేలా చేశారు. బాలీవుడ్ విష‌యానికి వ‌స్తే ..కిషోర్ కుమార్ ..ఆ పేరు చెబితే చాలు గుండె ఉప్పొంగుతుంది. గంతులేస్తుంది. అటూ ఇటూ ప‌రుగులు తీస్తుంది.

అంత‌లా ఆయ‌న ఇష్టుడై పోయారు. ఆ గొంతులో ఏదో మాధుర్యం దాగి ఉంది. మ‌నం ఎప్పుడైనా ఎవ‌రూ లేన‌ప్పుడు హాయిగా..స్వేచ్ఛ‌గా పాడుకుంటే ఎలా ఉంటుందో..కిషోర్ దా కూడా పాడితే అలా ఉంటుంద‌నిపిస్తుంది. మ‌ల్టీ టాలెంటెడ్ పర్స‌నాలిటీ కిషోర్ కుమార్‌ది. ఒక వెలుగు వెలిగారు. న‌వ్వించారు..ఏడ్పించారు..లైఫ్‌ను ఎంజాయ్ చేశారు. చివ‌రకు లోకం వీడారు.కిషోర్ కుమార్ ఇపుడు లేరు. పాట‌ల రూపంలో బ‌తికే ఉన్నారు. మ‌న‌ల్ని వెంటాడుతూనే ఉన్నారు. ఆయ‌న‌ను స్మ‌రించు కోవ‌డం మ‌న ధ‌ర్మం. త‌న గాత్రంతో భార‌తీయ ఆత్మ‌ను వెలిగించిన ఘ‌న‌త ఆయ‌న‌దే. ముంబైలో 1929 ఆగ‌స్టు 4న జ‌న్మించారు. ఆయ‌న అస‌లు పేరు అభాస్ కుమార్ గంగూలీ..సినిమాలోకి వ‌చ్చాక కిషోర్ కుమార్‌గా మారారు. హిందీ సినిమా రంగంలోకి ప్ర‌వేశించిన కిషోర్ కుమార్ ప‌లు రంగాల్లో పేరుగాంచారు. గాయ‌కుడు, న‌టుడు, ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, నిర్మాత , పాట‌ల ర‌చ‌యిత‌, హాస్య ర‌స చ‌క్ర‌వ‌ర్తి కూడా. ఇన్ని క‌ళ‌ల్లో ప్రావీణ్యం ఉన్న‌ప్ప‌టికీ కిషోర్ కుమార్ అంటే గుర్తుకు వ‌చ్చేది గాయ‌కుడిగానే.

మొద‌టి సారిగా హిందీ సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. 1948లో షికారి సినిమాలో చిన్న పాత్ర వేశారు. బాంబే టాకీస్ వారి జిద్దిలో తోట‌మాలి పాత్ర వేశారు. ఆ మూవీలో దేవానంద్‌కు పాడిన పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. 1949లో రిమ్‌జిమ్ సినిమాలో రెండు పాట‌లు, ఎస్‌.డి. బ‌ర్మ‌న్ ఆధ్వ‌ర్యంలో వ‌చ్చిన ప్యార్ లో హీరో రాజ్ క‌పూర్‌కు పాడిన పాట‌లు కిషోర్ కుమార్‌ను గాయ‌కుడిగా నిల‌బెట్టాయి. నౌజ‌వాన్‌, బాజీ , బ‌హార్ సినిమాలలో ఆయ‌న గాత్రం పీక్ స్టేజ్‌కు తీసుకు వెళ్లింది. హేమంత్ కుమార్‌, మ‌న్నాడే, ర‌ఫీ, త‌ల‌త్ మ‌హ‌మ్మ‌ద్‌, జిఎం దురానీ వంటి ఉద్దండులు రాజ్య‌మేళుతున్న కాలంలో కిషోర్ కుమార్ గాత్రం మెల్ల‌గా గుండెల‌ను హ‌త్తుకుంది. ర‌వంత చిలిపిత‌నం జోడించి చిత్ర సంగీతాన్ని స్పీడ్ యుగంలోకి అలా మెల్ల‌గా న‌డిపించుకు వ‌చ్చాడు. అధికార్‌, చ‌ప్‌రే చాప్‌, న్యూఢిల్లీ, భాగ్‌, భాయ్ భాయ్ సినిమాల్లో న‌టుడిగా, మిస్ మాలా, నౌక్రీ, ముసాఫిర్ చిత్రాల‌లో న‌టుడిగా స్థిర‌ప‌డ్డారు. 1958లో చ‌ల్తీకానాం గాడీ చిత్రంతో తారా స్థాయికి చేరుకున్నారు. ఈ చిత్రంలో పాడిన పాట‌లు నేటికీ మారుమోగుతున్నాయి. జిద్దీ సినిమాకు డ‌బ్బింగ్ కూడా చెప్పారు. 1961లో ఝ‌మ్రూ సినిమాకు పాట‌లు రాసి, మ్యూజిక్ అందించారు కిషోర్ దా. కిషోర్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ కింద నిర్మాణం, డైరెక్ష‌న్‌, పాట‌లు రాయ‌డం, న‌టించ‌డం చేశాడు. దూర్ గ‌గ‌న్ కీ ఛావ్ మే, హ‌మ్ దో డాకూ, దూర్ కారాహి, బ‌డ్ తీ కా నామ్ దాడీ, శ‌భాష్ డాడీ చిత్రాలు పేరు తీసుకు వ‌చ్చాయి.

ఎన్నో క‌ళ‌లు క‌ల‌గ‌లిసిన కిషోర్ దా..ద‌ర్జాగా న‌వ్వుతూ..న‌వ్విస్తూ కాలం గ‌డిపారు. ఆయ‌న‌కు న‌లుగురు భార్య‌లు. మ‌ధుబాల‌, లీనా చందావ‌ర్క‌ర్‌. వీరిద్ద‌రూ ఎక్కువ‌గా ప్ర‌భావితం చూపారు. హాల్ క్యా హై జ‌నాబ్ కా అంటూ మంద‌హాసం చేస్తూ స్వ‌రం క‌లిపింది లీనా. అనేక సంద‌ర్భాల‌లో మ‌న‌స్తాపానికి గురైనా చెక్కు చెద‌ర‌లేదు. సినీ ప్ర‌పంచ హంగామాల‌కు, ఆడంబ‌రాల‌కు, విన్యాసాల‌కు దూరంగా ఉండేవారు. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైనా, దుఖఃమైనా తనలోనే ఇముడ్చుకొని, వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తన వరకే పరిమితం చేసుకున్నారు. ప్రజలంతా ఎన్నో బాధల్ని, చికాకులను మరచి పోవడానికి నా సినిమాలు చూస్తారు. నా పాటలు వింటారు. ప్రతి మనిషికీ బాధలు ఉంటాయి. అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి. తనను అభిమానించే వారిని ఎల్లపుడూ నవ్వించాలి. ఆహ్లాదం కల్పించాలి. ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతే గాని మన బాధ వారికి పంచకూడదు. అన్న‌ది కిషోర్ భావ‌న‌. .తోటలో నుండి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏమయింది? ఎన్నో మొగ్గలు పూవులై విరుస్తాయి. వికసిస్తాయి. పరిమళాన్ని వెదజల్లుతాయి ..అని పాడుకున్నారు..

ఆరాధ‌న సినిమాలోని పాట‌లు కిషోర్ కుమార్‌కు మంచి పేరు తీసుకు వ‌చ్చాయి. రాజేష్ ఖన్నాకు బంగారు భవిష్యత్తును చూపాయి. ఈ సినిమా విడుదల తర్వాతనే కిషోర్ కూ స్వర్ణయుగం ప్రారంభమైంది. హిందీ సినీ రంగంలోని సంగీత దర్శకులు అందరూ కిషోర్ తో దాదాపు అందరు హీరోలకూ పాడించారు. కిషోర్ గాన మాధుర్యాన్ని చిరకాలం స్మరించటానికి మనకు అవకాశమిచ్చిన వారిలో ఎస్.డి.బర్మన్ ప్రథములు. ఈయన సంగీత దర్శకత్వంలో వెలువడిన మొత్తం 50 పాటలూ చిత్ర రంగంలో నేపథ్య గానం ఉన్నంత వరకూ నిలిచే యుంటాయి. కిషోర్ నాదం చిరస్మరణీయంగా ఉంటుంది. 1987లో దీపావ‌ళి రోజున ..చల్‌తే చల్‌తే మేరే యే గీత్ యాద్ రఖనా, కభి అల్‌విదా నా కెహనా కభి భూల్‌తమ్‌ జానా అంటూ కిషోర్ దా ఇక సెల‌వంటూ వెళ్లి పోయారు.

No comments