Header Ads

సోనియా పుణ్యం..తెలంగాణ రాష్ట్రం

కాంగ్రెస్ పార్టీకి వందేళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉన్న‌ది. ఈ దేశానికి ఓ రూపు తీసుకు వ‌చ్చి..దిశా నిర్దేశ‌నం చేసిన ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావ‌డానికి నానా తంటాలు ప‌డుతోంది. ఎంద‌రో లీడ‌ర్లుగా..చిర‌స్మ‌ర‌ణీయ‌మైన వ్య‌క్తులుగా ఆ పార్టీ నుండి వ‌చ్చిన వారే. హైక‌మాండ్ క‌నుస‌న్న‌ల‌లో వుంటూ న‌మ్మకంగా ప‌ని చేసిన వారికి అత్యున్న‌త‌మైన ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన వ‌నిత‌గా శ్రీ‌మ‌తి సోనియాగాంధీకి పేరుంది. దివంగ‌త పీవీ న‌ర‌సింహారావు హ‌యాంలో ఆమె ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు. త‌ద‌నంత‌రం మ‌న్మోహ‌న్ సింగ్ కాలంలోను ఒడిదుడుల‌కు లోన‌య్యారు. భ‌ర్త‌ను కోల్పోయిన ఆమె ఎంతో సంయ‌మ‌నం పాటిస్తూ పిల్ల‌ల‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఉండేలా తీర్చిదిద్దారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు తావీయ‌కుండా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం పార్టీని కాపాడుకుంటూ..న‌డిపిస్తూ వ‌చ్చారు.
వ‌య‌సు రీత్యా ..ఆరోగ్య ప‌రంగా స‌మ‌స్య‌లు ఎదురు కావ‌డం..ప‌ని భారం పెర‌గ‌డంతో కొడుకు రాహుల్ గాంధీకి పార్టీ ప‌గ్గాలు ద‌క్కేలా చేశారు. వ్య‌క్తిగ‌తంగా విద్యాధికురాలు. ఓ వైపు కొడుకు ఇంకో వైపు కూతురు ఇద్ద‌రిని కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నారు. మొద‌ట్లో కొంత త‌డ‌బాటుకు లోనైన‌ప్ప‌టికీ ..రాను రాను పుంజుకున్నారు. ఈ దేశ సంస్కృతి, సాంప్ర‌దాయాలు, స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకోవ‌డం ప్రారంభించారు. ఎక్క‌డికి వెళ్లినా ఆప్రాంతానికి ఉన్న ప్రాశ‌స్త్యం..చ‌రిత్ర గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ పార్టీకి చెందిన ఎంపీలు, రాజ్య‌స‌భ స‌భ్యులు వ‌ద్ద‌న్నా సోనియా గాంధీ ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌ను విభిజించేందుకు ఒప్పుకున్నారు. ఒక‌వేళ ఆమె ఒప్పుకోక పోయి వుండి వుంటే..ఇవాళ తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డి ఉండేది కాదు.

విద్యార్థుల బ‌లిదానాలు, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు..ఆందోళ‌న‌లు, పోరాటాలు, స‌మ్మెలు, నిర‌స‌న‌లు చూసిన ఆమె చ‌లించి పోయారు. అన్ని పార్టీలు ఒక వైపు కాంగ్రెస్ పార్టీ ఒక వైపు..ఒక యుద్ద వాతావ‌ర‌ణం..ఒక ఉద్విగ్న స‌మ‌యం..అలాంటి ప‌రిస్థితుల్లో ఆమెకు తెలంగాణ ఏ ర‌కంగా న‌ష్టాల పాలైందో..ఏ ర‌కంగా దోపిడీకి గురైందో..అభివృద్ధికి నోచుకోలేదో బెస్ట్ పార్ల‌మెంటేరియ‌న్‌గా పేరున్న సూదిని జైపాల్ రెడ్డి వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.ఆమె అసాధార‌ణ‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రం ఏర్పాటుకు స‌మ్మ‌తిని తెలియ చేస్తూ ..ఏర్ప‌డేలా చేసింది. ఇది విస్మ‌రించ‌లేని చ‌రిత్ర‌. ఆ స‌మ‌యంలో ఇప్ప‌టి ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేవ‌త‌గా కొలిచారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం సోనియా గాంధీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. నాలుగున్న‌ర ఏళ్ల త‌ర్వాత తిరిగి తెలంగాణ‌లో అడుగు పెట్టారు . చేవెళ్ల‌లో జ‌రిగిన భారీ బహిరంగ స‌భ‌లో ఆమె ప్ర‌సంగించారు.

నేను ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌డం బాధ క‌లిగిస్తోంద‌న్నారు. కేసీఆర్ కుటుంబ, నియంతృత్వ పాల‌న‌పై నిప్పులు చెరిగారు. బ‌ద్ధ శ‌త్రువులైన టీడీపితో పొత్తు పెట్టుకునేలా చేశారు. వెనుక వుండి మంత్రాంగం న‌డిపిస్తున్నారు. ఎలాగైనా స‌రే తెలంగాణ‌కు న‌మ్మ‌కాన్ని క‌లిగించే విధంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు అందుకున్న ఆమెకు రెండు సార్లు ప్ర‌ధాన‌మంత్రి అయ్యే అవ‌కాశం వ‌చ్చింది. అయినా చెక్కు చెద‌ర‌లేదు. ప‌ద‌వుల‌కు దూరంగా వున్నారు. ప్ర‌చారాన్ని కోరుకోలేదు. సిస్ట‌మాటిక్‌గా ప‌నిచేసుకుంటూ వెళుతున్నారు. అమేధీ నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఆమె ఎలాంటి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌లేదు

తెలంగాణ‌కు స్వేచ్ఛ ల‌భించేలా చేసిన ఘ‌న‌త సోనియాదే. ఆమె లేక‌పోతే ఈ తెలంగాణ వ‌చ్చేది కాదు. 72 ఏళ్లు దాటినా తాను ఇచ్చిన ఈ రాష్ట్రంపై ప్రేమ కోల్పోలేదు. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌లు ఆమెకు రుణ‌ప‌డి ఉన్నారు. ఫోర్ట్స్ ప‌త్రిక ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన మ‌హిళ‌ల్లో మూడో స్థానంలో సోనియా నిలిచారు.

No comments