Header Ads

ఓటెత్తిన తెలంగాణ - భారీగా పోలింగ్ - ప‌లు చోట్ల దాడులు అరెస్టులు

చైత‌న్యానికి, పోరాటాల‌కు, ఉద్య‌మాల‌కు పురిటిగ‌డ్డ అయిన 29వ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన త‌ర్వాత మొద‌టిసారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 2 కోట్ల‌కు పైగా ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇత‌ర రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ జాతి యావ‌త్తు తెలంగాణపైనే దృష్టి కేంద్రీక‌రించింది. సౌత్ ఇండియాలో కీల‌కంగా మారిన ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ, ఎంఐఎం, సీపీఎం పోటీ చేస్తున్నా ప్ర‌ధానంగా పోటీ రెండు పార్టీల మ‌ధ్యే కొన‌సాగింది. అతిర‌థ‌మ‌హార‌తుల‌తో పాటు సినీరంగానికి చెందిన ప్ర‌ముఖులు, స్ట్పోర్ట్స్ స్టార్స్‌, బిజినెస్ ప‌ర్స‌నాలిటీలు త‌మ విలువైన ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.
రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌జ‌త్ కుమార్ ప‌డిన శ్ర‌మ ఫ‌లించింది. కొన్ని చోట్ల అల్ల‌ర్లు, దాడులు జ‌రిగిన‌ప్ప‌టికీ మొత్తం మీద తెలంగాణ‌లో ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హాకూట‌మి త‌ర‌పున బ‌రిలో నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వంశీచంద‌ర్ రెడ్డిపై ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు రాళ్ల‌తో దాడులకు పాల్ప‌డ్డారు దీంతో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. త‌క్ష‌ణ‌మే నిమ్స్‌కు త‌ర‌లించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల‌లో ఎవీఎంలు మొరాయించారు. ఆ త‌ర్వాత తిరిగి ప‌నిచేశాయి.

ఉద‌యం 9 గంట‌ల లోపు జ‌రిగిన పోలింగ్‌లో 10. 15 శాతం న‌మోదు కాగా 9 నుంచి 11 గంట‌ల లోపు 23.4 శాతం, 11 నుంచి ఒంటి గంట లోపు 47.8 శాతం పోలింగ్ కాగా..ఒంటి గంట నుంచి 3 గంట‌ల లోపు జ‌రిగిన పోలింగ్‌లో 56.17 శాతం, 3 నుంచి 5 గంట‌ల లోపు జ‌రిగిన ఎన్నిక‌ల్లో 67 శాతం న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జాస్వామ్యానికి ఆయువు ప‌ట్టుగా మారిన ఈ ఎల‌క్ష‌న్స్‌లో విలువైన ఓటును ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు వేసేందుకు జ‌నం బారులు తీరారు. టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డి.కె.అరుణ‌, ఎల్‌.ర‌మ‌ణ‌, కోదండ‌రాం రెడ్డి, అస‌దుద్దీన్‌, అక్బ‌రుద్దీన్ ఓవైసీ, జి. వినోద్‌, జి. వివేక్‌, విహెచ్‌, హ‌రీష్ రావు, కేటీఆర్‌, కేసీఆర్‌, క‌విత‌, సంతోష్ రావు, విజ‌య‌శాంతి, లక్ష్మ‌ణ్‌, కిష‌న్ రెడ్డి, మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ ఓటు వేశారు.

సెల‌బ్రెటీలు ఓటు వేసేందుకు పోటీ ప‌డ్డారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, చిరంజీవి, నాగార్జున‌, మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నితిన్‌, అల్లు అర్జున్‌, మంచు ల‌క్ష్మి, మోహ‌న్‌బాబు, పూరీ జ‌గ‌న్నాథ్‌, శ్రీ‌కాంత్‌, కొడుకు భార్య‌తో క‌లిసి ఓటు వేశారు. ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ మొద‌టిసారి త‌న ఓటు హ‌క్కు వినియోగించు కోవ‌డం విశేషం. ప‌ల్లెలలో ఓట్ల పండుగ నెల‌కొన‌గా ప‌ట్ట‌ణాల్లో ఆ సీన్ క‌నిపించ‌లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 76.5 శాతంతో మొద‌టి స్థానంలో ఉండ‌గా 50.86 శాతంతో హైద‌రాబాద్ లాస్ట్‌లో నిలిచింది. ఇక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ వ‌ర‌కు వ‌స్తే..84 శాతంతో న‌ర్సంపేట, 83.9 శాతం డోర్న‌క‌ల్‌, 83 శాతంతో ఆలేరు, 82 శాతంతో ముథోల్‌, 80.5 శాతంతో ఎల్లారెడ్డి, 77 శాతంతో భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌మోదైంది.

ఇక అతి త‌క్కువ శాతం ఓట్ల న‌మోదైన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో యాకుత్‌పూరాలో 33 శాతం, ఉప్ప‌ల్‌లో 43 శాతం, ఎల్‌బీన‌గ‌ర్‌లో 42 శాతం, కుత్బుల్లాపూర్‌లో 44.05 శాతం న‌మోదైంది. ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకార‌ణి గుత్తా జ్వాల‌కు ఈసారి ఓటు వేసేందుకు వెళ్ల‌గా త‌న ఓటు గ‌ల్లంతు కావ‌డంతో ఆమె అవాక్క‌య్యారు. వేల‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట్లు గ‌ల్లంత‌య్యాయి. దీనిపై ఓటు వేయాల‌ని అనుకున్న వారు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. ఉన్న‌తాధికారుల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ భారీ ఏర్పాట్లు చేసింది. అంత‌కంటే ఎక్కువ‌గా ప్ర‌జ‌ల‌ను ఓటు వేయ‌డంపై అద్భుత‌మైన రీతిలో ప్ర‌చారం చేశారు.

ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌జ‌త్‌కుమార్ ప్ర‌క‌టించిన మేర‌కు 137 కోట్లు ప‌ట్టుకున్నామ‌ని వెల్ల‌డించారు. ఇంకా లెక్క‌కు లేన‌న్ని కోట్ల నోట్ల క‌ట్ట‌లు ఎప్పుడో జ‌నంలోకి చేరి పోయాయి. భారీగా నోట్ల పంపిణీ, మ‌ద్యం స‌ర‌ఫ‌రా జ‌రిగిన‌ట్టు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల భోగ‌ట్టా. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు త‌లెత్త‌కుండా పోలీసులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో స‌క్సెస్ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దంప‌తులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు చేసింది. ఏది ఏమైనా తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఓట్ల పండుగ‌లో భాగ‌స్వామ్యుల‌య్యారు. ఈ చైత‌న్యం రేపు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ది. ఇక ఓట్ల పండుగ‌లో ఏ అభ్య‌ర్థుల‌ను వ‌రిస్తుందో ఇంకొద్ది గంట‌ల్లో తేలనుంది.

No comments