Header Ads

యుద్ధం ముగిసింది..ఫ‌లిత‌మే మిగిలింది - అంతటా టెన్ష‌న్ టెన్ష‌న్

దేశం యావ‌త్తు దృష్టి సారించిన 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర ప‌డింది. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం సాగింది. అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఆయ‌న మంత్రి వ‌ర్గం మూకుమ్మ‌డిగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 6వ తేదీన ప్ర‌జ‌లు ఎన్నుకున్న తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల స‌మ‌రానికి తెర తీశారు. ఈ విష‌యాన్ని ఉమ్మ‌డి రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు విష‌యాన్ని తెలియ చేస్తూ కాపీని అంద‌జేశారు. దీంతో తొమ్మిది నెల‌లు ఉండ‌గానే ఈ స‌ర్కార్ రద్దు నిర్ణ‌యానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యేంత వ‌ర‌కు ఇపుడున్న స‌ర్కారే ఆప‌ద్ధ‌ర్మంగా నిర్వ‌హిస్తార‌ని గెజిట్‌లో పేర్కొన్నారు.
ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌జ‌త్ కుమార్ న‌వంబ‌ర్ 12న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ డిక్లేర్ చేశారు. డిసెంబ‌ర్ 5 సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ప్ర‌చారం నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇచ్చారు. శాంతి భ‌ద్ర‌త విష‌యంలో పూర్తి అధికారాలు క‌ట్ట‌బెడుతూ గ‌వ‌ర్న‌ర్ ప‌ర్మిష‌న్ ఇచ్చారు. డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి జోషి ఎప్ప‌టిక‌పుడు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తూ వ‌చ్చారు.

భారీ ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు స‌జావుగా నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్తి చేసింది. ఓట‌ర్లు ప్ర‌లోభాల‌కు లోను కాకుండా ప్ర‌తి ఒక్క‌రు ఓటు హ‌క్కు వినియోగించు కోవాల‌ని క‌మిష‌న‌ర్ ర‌జ‌త్ కుమార్ పిలుపునిచ్చారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌రిశీల‌కులు ప‌లుమార్లు తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. లా అండ్ ఆర్డ‌ర్‌, ఎన్నిక‌ల సిబ్బంది, రాజ‌కీయ పార్టీలు, మేధావుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఎక్క‌డా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు త‌లెత్త‌కుండా ఉండేందుకు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో..దాని ప‌రిధిలోని పోలింగ్ బూత్‌ల ద‌గ్గ‌ర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా జిల్లా కేంద్రాల కార్యాల‌యాల నుండి ప‌ర్య‌వేక్షించేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. మీడియా సెంట‌ర్ల ద్వారా స‌మాచారాన్ని చేర‌వేసింది. క‌లెక్ట‌ర్ల‌కు స‌ర్వాధికారాలు అప్ప‌గిస్తూనే వారిపై ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ప‌ర్య‌వేక్ష‌కులుగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌ను నియ‌మించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. విక‌లాంగులు, వృద్ధులు, చంటి పిల్ల‌ల త‌ల్లుల కోసం ప్ర‌త్యేక ఏర్పాటు చేసింది ఎన్నిక‌ల క‌మిష‌న్‌. 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో 1821 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ప్ర‌ధాన పార్టీల మ‌ధ్యే ర‌స‌వ‌త్త‌ర పోటీ నెల‌కొంది. ఎన్న‌డూ లేనంత‌గా ఈ ఎన్నిక‌లు యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పింప చేస్తున్నాయి. మొత్తం 2 కోట్ల 89 ల‌క్ష‌ల 789 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును ఈనెల 7న వినియోగించు కోనున్నారు. వీరిలో అత్య‌ధికంగా మ‌హిళా ఓట‌ర్లే ఉన్నారు. వీరే అభ్య‌ర్తుల విజ‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 32 వేల 815 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 279 కేంద్ర బ‌ల‌గాలు, వేలాది మంది పోలీసులు విధులు నిర్వ‌హిస్తున్నారు.

అధికార టీ ఆర్ ఎస్ పార్టీ ముంద‌స్తుగా అన్ని పార్టీల కంటే ముందస్తుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ.. గులాబీ బాస్ కేసీఆర్ టికెట్ల‌ను ప్ర‌క‌టించారు. ఇద్ద‌రు ముగ్గురు త‌ప్ప అంద‌రికీ సిట్టింగ్‌ల‌కే చాన్స్ ఇచ్చారు. కొంగ‌ర్ క‌లాన్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. అదే వేదిక‌గా ఎన్నిక స‌మ‌రానికి సై అన్నారు. ఊహిచ‌ని రీతిలో టీడీపీ , కాంగ్రెస్‌, తెలంగాణ జ‌న‌స‌మితి, ఇంటి పార్టీ, సీపీఐ మ‌హాకూట‌మిగా ఏర్పాట‌య్యాయి. 95 సీట్ల‌లో కాంగ్రెస్‌, 13 సీట్ల‌లో టీడీపీ, 8 చోట్ల టీజేఎస్‌, ఒక చోట ఇంటి పార్టీ , 3 చోట్ల సీపీఐ అభ్య‌ర్థులు రంగంలోకి దిగారు. బీజేపీ, బీఎస్‌పీ, బీఎల్ ఎఫ్‌, ఎంఐఎం, సీపీఎం పార్టీలు బ‌రిలో నిలిచాయి.

ఎన్నిక‌ల ప్ర‌చారం ఎన్న‌డూ లేనంత‌గా సాగింది. అతిర‌థ మ‌హార‌థులు ఎలాగైనా స‌రే ప‌వ‌ర్‌లోకి రావాల‌ని ప్ర‌చారాన్ని ఠారెత్తించారు. కాంగ్రెస్ పార్టీ నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కుంతియా, గులాం న‌బీ ఆజాద్‌, చంద్ర‌బాబు నాయుడు, నారాయ‌ణ‌, కోదండ‌రాం, చాడ వెంక‌ట్ రెడ్డి, చెరుకు సుధాక‌ర్ తో పాటు ఎంఆర్‌పీఎస్ సంపూర్ణ మ‌ద్ధతు ఇచ్చింది. మంద‌కృష్ణ మాదిగ‌తో పాటు ప్ర‌జా యుద్ధ నౌక గ‌ద్ద‌ర్ కూడా రాహుల్‌తో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొన్నారు. జైపాల్ రెడ్డి, వీహెచ్‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, దాసోజు శ్ర‌వ‌న్‌, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు స్టార్ క్యాంపెయిన‌ర్స్ మ‌హ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్‌, ఖుష్బూ, న‌గ్మా, విజ‌య‌శాంతిలు పాల్గొన్నారు. బీజేపీ నుండి ప్ర‌ధాని మోదీ, యుపీ సీఎం ఆదిత్యానాథ్‌, హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌, ప‌రిపూర్నానంద స్వామి, పార్టీ అధినేత అమిత్ షా, స్మృతి ఇరానీ క్యాంపెయిన్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

బీఎస్పీ అధినేత్రి మాయావ‌తితో పాటు నారాయణ, సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డిలు ప్ర‌చారంలో పాల్గొన్నారు. గులాబీ బాస్ 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. రాహుల్‌, బాబు, బాల‌కృష్ణ‌లు రోడ్ షోలు నిర్వ‌హించారు. పోలింగ్ ప్ర‌చారం ముగిసే రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న‌ల్ల‌గొండ జిల్లా కోదాడ స‌భ‌లో చంద్ర‌బాబుతో క‌లిసి పాల్గొన‌గా..గులాబీ బాస్ తాను పోటీ చేస్తున్న గ‌జ్వేల్ స‌భ‌లో ప్ర‌సంగించారు.

ఎంఐఎం నుండి అస‌దుద్దీన్ ఓవైసీ, అక్బ‌రుద్దీన్ ఓవైసీలు విస్తృతంగా ప‌ర్య‌టించారు. సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప‌లు సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. కేసులు, అరెస్టుల దాకా వెళ్లాయి. చివ‌ర‌కు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. టికెట్లు అమ్ముకున్నారంటూ ర‌చ‌నా రెడ్డి కామెంట్స్ చేశారు.టీజేఎస్ ఆమెను పార్టీ నుండి స‌స్పెండ్ చేసింది. కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న జ‌గ్గారెడ్డితో పాటు గ‌జ్వేల్ అభ్య‌ర్థి ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డిని, కోడంగ‌ల్‌లో అర్ధ‌రాత్రి రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. కోర్టు జోక్యం చేసుకోవ‌డంతో ఆయ‌న‌ను విడుద‌ల చేశారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ముంద‌స్తు స‌ర్వేలు సంచ‌ల‌నం రేపాయి. 119 సీట్ల‌లో 100 సీట్ల‌కు పైగా గెలుచుకుంటామ‌ని..తిరిగి త‌మ‌దే అధికారం అని ..ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేది తామేన‌ని జోస్యం చెప్పారు. న్యూస్ ఛానల్స్‌, న్యూస్ ఏజెన్సీలు ముంద‌స్తు స‌ర్వేలు ప్ర‌క‌టించాయి. ఇదంతా ఒక ఎత్త‌యితే మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ..మ‌హాకూట‌మికే ఎక్కువ‌గా వేవ్ ఉంద‌ని ప్ర‌క‌టించారు. నాలుగు జిల్లాల‌లో కాంగ్రెస్‌, మ‌హాకూట‌మి ముందంజ‌లో ఉంటే..మూడు జిల్లాల‌లో అధికార పార్టీకి ఎడ్జ్ ఉంద‌ని..మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొన‌సాగ‌నుంద‌ని వెల్ల‌డించారు.

స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఎక్కువ మంది గెలుస్తార‌ని ..స‌ర్కార్‌ను ప్ర‌భావితం చేయ‌నున్నార‌ని తెలిపారు. హంగ్ ప్ర‌స‌క్తే లేద‌ని వార్ ఒన్ సైడేనంటూ కుండ బద్ద‌లు కొట్టారు. దీనిని బ‌క్వాస్ స‌ర్వేగా కేసీఆర్‌, కేటీఆర్, హ‌రీష్ కొట్టి పారేశారు. మొత్తంగా చూస్తే 7న ముగిసి ఈనెల 11న మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌క‌టించేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌జ‌త్ కుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మొత్తం మీద తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చార యుద్దం ముగిసింది..ఇక ఫ‌లితమే మిగిలింది. ఏవ‌రు ప‌వ‌ర్‌లోకి వ‌స్తారో..ఎవ‌రు రికార్డుల‌ను తిర‌గ రాస్తారో ..ఎవ‌రు గెలుపు వాకిళ్ల‌ను త‌లుపు త‌డ‌తారో అనేది వేచి చూడాల్సిందే.

No comments