Header Ads

స‌ర్వేల మాయాజాలం - ఎవ‌రికి ద‌క్కేనో విజ‌యం

ఇండియా మొత్తం ఉత్కంఠ‌కు తెర లేపిన తెలంగాణ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌రు నాడి తెలుసుకునేందుకు మీడియా ఛానల్స్‌, స‌ర్వే సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి. ఒక‌దాని కంటే మ‌రొక‌టి పొంత‌న లేకుండా త‌మ వివ‌రాలు వెల్ల‌డించాయి. కొన్ని మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటూ ప్ర‌క‌టించాయి. ఛానల్స్‌, స‌ర్వే సంస్థ‌ల‌కు భిన్నంగా మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మాత్రం ప్ర‌జాకూట‌మే ప‌వ‌ర్‌లోకి వ‌స్తుంద‌ని ..త‌న అంచ‌నాలు త‌ప్ప‌వ‌ని జోస్యం చెప్పారు. టైమ్స్‌ నౌ - సీఎన్ ఎక్స్ స‌ర్వే ప్ర‌కారం అధికారం టీఆర్ ఎస్‌దేన‌ని ప్ర‌క‌టించింది. అధికార పార్టీ 66 సీట్లుకు ప‌రిమితం కాగా..మ‌హాకూట‌మి 37 సీట్లు, 7 ఎంఐఎం, 9 ఇత‌ర పార్టీలు, ఇండిపెండెంట్లు గెలుస్తార‌ని తెలిపింది. ఇండియా టుడే - యాక్సిస్ స‌ర్వే ప్ర‌కారం టీఆర్ఎస్ కు 79 నుండి 91 సీట్లు చేజిక్కించుకుంటుంద‌ని మ‌హాకూట‌మి 21 నుంచి 33 సీట్లే వ‌స్తాయ‌ని, ఎంఐఎం 3 , ఇత‌రులు 7 సీట్ల‌లో గెలుస్తార‌ని వెల్ల‌డించింది.
రిప‌బ్లిక్ - సీ ఓట‌ర్ స‌ర్వే మాత్రం కొంత డిఫ‌రెంట్ వివ‌రాలు ప్ర‌క‌టించింది. అధికార పార్టీకి 48 నుంచి 60 సీట్లు రావ‌చ్చ‌ని..మ‌హాకూట‌మి 47 నుంచి 59 సీట్లు గెలువ‌బోతోంద‌ని, బీజేపీ 5 సీట్లు, ఇత‌రులు 13 సీట్ల‌తో స‌రిపెట్టుకుంటాయ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. రిప‌బ్లిక్ - జ‌న్ కీ బాత్ స‌ర్వే ప్ర‌కారం టీఆర్ ఎస్‌కు 50 నుండి 65 సీట్లు, మ‌హాకూట‌మి 38 నుండి 52 సీట్లు, బీజేపీ 4 నుండి 7 సీట్లు, ఇత‌రులు 10 నుండి 17 సీట్లు ద‌క్కించుకోనున్నాయ‌ని తెలిపింది. న్యూస్ ఎక్స్ స‌ర్వే ప్ర‌కారం టీఆర్ఎస్ 57 సీట్ల‌కు ప‌రిమితం కాగా మ‌హాకూట‌మి 46 సీట్లు బీజేపీ 6 సీట్లు , ఎంఐఎం , ఇండిపెండెంట్లు 10 సీట్లలో విజ‌యం సాధించ‌బోతున్నార‌ని జోస్యం చెప్పింది. జాతీయ స‌ర్వేల‌న్నీ గులాబీ ద‌ళం తిరిగి ప‌వ‌ర్‌లోకి వ‌స్తుంద‌ని క్యూ క‌డితే ..మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మాత్రం ఊహించ‌ని రీతిలో త‌న స‌ర్వే వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఏయే ప్రాతిప‌దిక‌న ఈ స‌ర్వే చెప‌ట్ట‌డం జ‌రిగిందో ఆయ‌న కూలంకుషంగా వివ‌రించారు. ఇటీవ‌ల చెప్పిన‌ట్లు 60 శాతంకు పైగా ఓట్ల శాతం పెరిగితే మాత్రం కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ, ఇంటిపార్టీ క‌లిసి పోటీ చేసిన ప్ర‌జాకూట‌మి విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపారు.

తాను గ‌తంలో చెప్పిన దానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని..ఇందులో ఎలాంటి మార్పు లేద‌ని ల‌గ‌డ‌పాటి స్ప‌ష్టం చేశారు. ఇక ప్ర‌క‌టించ‌బోయే ఫ‌లితాల్లో క‌చ్చితంగా మ‌హాకూట‌మిదే గెలుపు త‌థ్య‌మ‌న్నారు. అనూహ్యంగా టీడీపీ ఓట్ల శాతం పెరిగింద‌ని అది పోటీ చేసిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని వెల్ల‌డించారు. తెలంగాణ‌లో ఓట‌రు నాడి హ‌స్తానికి చిక్కింద‌ని చెప్పారు. ఆగ‌ష్టు 28 నుంచి వంద అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో స‌ర్వే చేశామ‌ని..వేల శాంపుల్స్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నామ‌ని తెలిపారు. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 68.5 శాతం న‌మోదు కాగా..ఈసారి జరిగిన ఎన్నిక‌ల్లో 67 శాతం న‌మోదైంది..ఇంకొంచెం పెరుగ‌తుంద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ర‌జ‌త్‌కుమార్ వెల్ల‌డించారు. ప్ర‌జాకూట‌మికి 65 సీట్లు వ‌స్తాయ‌ని అద‌నంగా మ‌రో 10 సీట్లు గెలుచుకుంటుంద‌ని..

టీఆర్ ఎస్ 25 నుండి 45 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌న్నారు. బీజేపీ 5 నుండి 9 సీట్ల‌లో..ఎంఐఎం 6 నుంచి 7 సీట్ల‌లో ..ఇత‌రులు 5 నుంచి 9 సీట్ల‌లో పాగా వేయ‌బోతున్నార‌ని ప్ర‌క‌టించారు. ఖ‌మ్మం జిల్లాలో సీపీఎం, బీఎల్ ఎఫ్‌కు ఒక్కో సీటు కైవ‌సం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయ‌ని తెలిపారు. 9 సీట్ల‌కు పైగా టీడీపీ అభ్య‌ర్థులు గెల‌వ‌బోతున్నార‌ని జోస్యం చెప్పారు. అధిక శాతం మీడియా సంస్థ‌లు, స‌ర్వే కంపెనీలు కేసీఆర్‌కు జై కొడితే ..ల‌గ‌డ‌పాటి ఒక్క‌రు మాత్రం బాబు, రాహుల్‌ల‌కు జై కొట్టారు. మొత్తం మీద కొద్ది గంట‌ల్లో ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

No comments