Header Ads

అన్న‌దాత‌ల ఆగ్ర‌హం - ప‌ట్టించుకోని కేంద్రం.!!

ఈ దేశం ఎటుపోతోంది. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ..చెమ‌ట చుక్క‌లు చిందించి..పంట‌లు పండించి..అన్నం పెట్టే అన్న‌దాత‌లు రోడ్ల పాల‌య్యారు. కోట్లు కొల్ల‌గొట్టి బ్యాంకుల‌కు బురిడీ కొట్టించి..దేశం దాటిపోతున్న వారికి వెన్నుద‌న్నుగా నిలిచే మోడీ స‌ర్కార్ పంట‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంలో ఉదాసీన వైఖ‌రి క‌న‌బ‌రుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇదే దుస్థితి నెల‌కొంది. ప‌రిస్థితుల్లో మార్పు రాలేదు. వేలాది మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. పెట్టుబ‌డి పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్రల‌లో రైతులు ఆందోళ‌న‌బాట ప‌ట్టారు. ధ‌ర్నాలు, రాస్తారోకోలు, నిర‌స‌న చేప‌ట్టారు.
అయినా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. త‌మ స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోక పోవ‌డంతో హ‌స్తిన బాట ప‌ట్టారు. రైళ్లు ఎక్క‌లేదు..బ‌స్సులు ఎక్క‌లేదు..ఏ వాహ‌నాన్ని ఆశ్ర‌యించ‌లేదు..స‌ద్దులు క‌ట్టుకుని న‌డుచుకుంటూ హ‌స్తిన బాట ప‌ట్టారు. చాయ్ పే చ‌ర్చ పేరుతో ..విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న మోడీ రైతుల గురించి ఒక్క‌మాట మాట్లాడ‌లేదు.

మిడ్‌నైట్ మార్చ్ పేరుతో వేలాది మంది ఇండియాలోని ప‌లు ప్రాంతాల నుండి రైతులంతా ఏక‌మై కిసాన్ ఘాట్ వ‌ద్ద‌కు భారీ ర్యాలీ చేప‌ట్టారు. వారిపై పోలీసులు లాఠీఛార్జి జ‌రిపారు. చ‌ర్చ‌లు జ‌రిపేందుకు హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. రైతుల ర్యాలీ ఎరుపెక్కింది. రుణ‌మాఫీ అమ‌లు చేయాల‌ని, పంట‌ల‌కు మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్పించాల‌ని ప్ర‌ధాన డిమాండ్‌తో ఢిల్లీకి త‌ర‌లి వ‌చ్చారు. వీరు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు 21 పార్టీలు మ‌ద్ధ‌తు ప‌లికాయి. భిన్న ధృవాలైన పార్టీలు ఒకే వేదిక‌పై వీరి కోసం త‌ర‌లి వ‌చ్చారు. రైతు బీమా ఫ్రాడ్‌గా ఆరోపించారు. 40 వేల మందికి పైగా రైతులు హాజ‌ర‌య్యారు.

నాలుగున్న‌ర ఏళ్ల‌లో ఎన్న‌డూ లేనంత‌గా వ్య‌వ‌సాయ రంగం సంక్షోభానికి గురైంద‌ని, మ‌ద్ధ‌తు ధ‌ర లేక రైతులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నా ప‌ట్టించుకున్న పాపాన పోలేదంటూ విప‌క్షాలు ధ్వ‌జ‌మెత్తాయి. దేశం న‌లువైపుల నుండి వ‌చ్చిన రైతులు పార్ల‌మెంట్ వ‌ర‌కు ర్యాలీ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పోలీసులు ఒప్పుకోక పోవ‌డంతో జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ స‌భ చేప‌ట్టారు. బీజేపీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న రైతు వ్య‌తిరేక విధానాల‌పై నిప్పులు చెరిగారు. 15 మంది పారిశ్రామిక‌వేత్త‌లు తీసుకున్న రుణాల‌ను మాఫీ చేసిన మోడీ..రైతుల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు రాహుల్ గాంధీ. కేంద్ర స‌ర్కార్ అమ‌లు చేస్తున్న రైతు బీమా ప‌థ‌కం పూర్తిగా మోస పూరిత‌మైన‌ది. రైతుల అకౌంట్ల నుంచి డ‌బ్బుల‌ను అక్ర‌మంగా లాగేసుకుంటున్నార‌ని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిప‌డ్డారు.

బీమా యోజ‌న కాదు..బీజేపీ ధోకా యోజ‌న అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అభివృద్ధి రేటు దారుణంగా ప‌డిపోయింద‌ని సీపీఎం నేత సీతారం ఏచూరి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ‌ర‌ద్ యాద‌వ్, ఫ‌రూక్ అబ్దుల్లా, శ‌ర‌ద్ ప‌వార్ , సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి, ఇత‌ర నాయ‌కులు కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. అయోధ్య మాకొద్దు ..రుణ‌మాఫీ చేయండి చాలంటూ రైతులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కిసాన్ సంఘ‌ర్ష్ కో ఆర్డినేష‌న్ క‌మిటీ ఈ ర్యాలీకి నేతృత్వం వ‌హించింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు పాల‌గుమ్మి సాయినాథ్ మాట్లాడుతూ ..రైతులకు మ‌ద్ధ‌తు ప‌ల‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

మొత్తం మీద దేశ వ్యాప్తంగా ఒకే వేదిక‌పైకి వ‌చ్చిన అన్న‌దాతులు ఏక‌మై త‌మ న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల సాధ‌న కోసం ఆందోళ‌న బాట చేప‌ట్ట‌డం పాల‌కుల‌కు క‌నువిప్పు కావాలి. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 70 ఏళ్ల‌వుతున్నా నేటికీ అన్నం పెట్టే అన్న‌దాత‌ల బ‌తుకుల్లో మార్పు రాక‌పోవ‌డం, పండించే పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించ‌డం దారుణం. ఇక‌నైనా పాల‌కులు మానుకోవాలి..లేక‌పోతే ప్ర‌భుత్వాలు కూలిపోవ‌డం ఖాయం.

No comments