Header Ads

మోడీకి షాకిచ్చిన ఉర్జిత్ ప‌టేల్ - ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా

భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఆయువుప‌ట్టుగా వున్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి ఉర్జిత్ ప‌టేల్ రాజీనామా చేశారు. ఇండియ‌న్ ప్రైంమినిష్ట‌ర్ న‌రేంద్ర మోడీకి అనుకోని షాక్ ఇచ్చారు. ఈ నిర్ణ‌యం వెలువ‌డిన వెంట‌నే స్టాక్ మార్కెట్ ఒక్క‌సారిగా కుదుపుల‌కు లోనైంది. 1963లో రాజ‌స్థాన్ రాష్ట్రంలో జ‌న్మించిన ఉర్జిత్ ప‌టేల్ ..ప్ర‌పంచంలో అత్యుత్త‌మ‌మైన ఆర్థిక‌వేత్త‌ల‌లో ఒక‌రుగా పేరొందారు. ఆర్బీఐకి డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. మోడీకి అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా ..ఆర్థిక స‌ల‌హాదారుగా చాలా కాలం పాటు ప‌నిచేశారు. ఉన్న‌ట్టుండి త‌న ప‌ద‌వికి రిజైన్ చేస్తున్న‌ట్లు బాంబు పేల్చారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యానే తాను ప‌ద‌వి నుండి త‌ప్పుకున్న‌ట్లు రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. కానీ దాని వెనుక ప్ర‌భుత్వ ప‌రంగా కోలుకోలేని వ‌త్తిళ్లు ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు.

ఉర్జిత్ ప‌టేల్ నిర్వ‌హించిన ప‌ద‌వి అత్యున్న‌త‌మైన‌ది. మొత్తం భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ దీని కంట్రోల్‌లోనే ఉంటుంది. బ్యాంకుల‌కు అంబుడ్స్‌మెన్‌గా..కేంద్ర ప్ర‌భుత్వానికి వాచ్‌డాగ్‌లాగా ఆర్బీఐ ప‌నిచేస్తుంది. ఆర్బీఐ తీసుకునే ఏ నిర్ణ‌య‌మైనా అది 100 కోట్ల మంది ప్ర‌జ‌ల జీవితాల‌పై ప్ర‌భావితం చేస్తుంది. ఈ స‌మ‌యంలో ఇలాంటి నిర్ణ‌యం కోలుకోలేని షాక్‌కు గురి చేసేలా చేసింది. గ‌తంలో ఈ అత్యున్న‌త‌మైన ప‌ద‌విని సుబ్బారావు, ర‌ఘురాం రాజ‌న్‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వహించారు. ఎప్పుడైతే మోడీ అధికారంలోకి వ‌చ్చారో అప్ప‌టి నుండి ఆర్థిక రంగంలో ఒడిదుడుకులు లోన‌య్యాయి. ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన ఆర్థిక‌వేత్త‌ల‌లో రాజ‌న్‌కు పేరుంది. కానీ మోడీ ఆయ‌న‌ను విశ్వ‌సించ‌లేదు. త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన ..త‌న రాష్ట్రానికే చెందిన ఆర్థిక వేత్త ఉర్జిత్ ప‌టేల్‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

నోట్ల ర‌ద్దు విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి మోడీ తీసుకున్న నిర్ణ‌యం ఉర్జీత్ ప‌ద‌వీ కాలంలోనే జ‌రిగింది. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంద‌రు ఆక‌లి కేక‌ల‌తో త‌మ డ‌బ్బుల‌ను తీసుకునేందుకు బారులు తీరి నిల‌బ‌డ్డారు. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ఇండియాకు స్వ‌తంత్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఆర్బీఐ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ వ‌స్తోంది. దాని ఆధీనంలోని బ్యాంకుల‌న్నీ విశిష్ట మైన సేవ‌లు అందించాయి. కానీ మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ..ఆర్బీఐపై ఉన్న విశ్వాసం కోల్పోయేలా చేసింది. పీఎం తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యానికి ఉర్జిత్ గుడ్డిగా ఆమోదం తెలిపారన్న విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నారు. ఇప్ప‌టికే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్లు అత్య‌ధికులు దేశాన్ని విడిచి వెళ్ల‌డం ఎన్నో అనుమానాల‌కు తావిస్తోంది. నీర‌వ్ మోడీ, విజ‌య్ మాల్యా లాంటి ఆర్థిక నేర‌గాళ్లు ప్ర‌జా ధ‌నాన్ని లూటీ చేశారు. ప్ర‌జ‌ల‌కు తెలియ చేయ‌కుండానే నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తినా గ‌వ‌ర్న‌ర్ స్థానంలో ఉన్న ఉర్జిత్ ప‌టేల్ చూసీ చూడ‌న‌ట్లు గా వ్య‌వ‌హరించార‌న్న అప‌వాదును మూట‌గ‌ట్టుకున్నారు. రెపో రేట్ స్థిరంగా ఉండేలా ర‌ఘురాం రాజ‌న్ చూస్తూ వ‌చ్చారు. ఉర్జిత్ వ‌చ్చాక ఆక‌స్మిక నిర్ణ‌యాలు తీసుకోవ‌డం..వాటి గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌క పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సుబ్బారావు, ర‌ఘురాంలు మోడీ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌లుచ‌న‌వుతుంద‌ని..న‌మ్మ‌కం కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని హెచ్చ‌రించారు. అయినా మోడీ ఒప్పుకోలేదు. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌, స‌భ్యుల‌కు,విత్త‌మంత్రికి తెలియ‌కుండానే అర్ధ‌రాత్రి ప్ర‌క‌టించారు.

రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వ‌ద్ద లెక్క‌లేనంత నిధులున్నాయి. ఆస్తులు ఉన్నాయి. వీటిలో కొంత మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వ ప‌రం చేయాల‌ని మోడీ కోరిన‌ట్లు స‌మాచారం. దీనిని ఇవ్వ‌డానికి కుద‌ర‌దంటూ..గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్ స్ప‌ష్టం చేసినా ప‌ట్టించుకోలేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. గ‌త న‌వంబ‌ర్ నెల‌లో జ‌రిగిన అత్యున్న‌త స్థాయి స‌మావేశంలోనే తాను త‌న ప‌ద‌వికి రిజైన్ చేస్తున్న‌ట్లు ఆక‌స్మికంగా ఉర్జిత్ ప‌టేల్ ప్ర‌క‌టించ‌గా ..దానిని మోడీ ఒప్పుకోలేదు. ఒక‌వేళ ఆమోదిస్తే..అది దేశంలో జ‌రుగుతున్న ప‌లు ప్రాంతాల్లోని ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపిస్తుంద‌ని..విప‌క్షాల‌కు అది ఆయుధంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించిన క‌మ‌ల‌నాథులు ఆయ‌న‌కు నో చెప్పిన‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి. ఒకే ఒక్క నిర్ణ‌యం దెబ్బ‌కు ఇండియ‌న్ మార్కెట్‌లో అపుడే కుదుపులు ప్రారంభ‌మ‌య్యాయి. ప్ర‌జ‌ల ఆస్తుల‌కు ర‌క్ష‌ణాత్మ‌క‌మైన సంస్థ‌గా ఉన్న ఆర్బీఐ అత్యున్న‌త ప‌ద‌వికి రిజైన్ చేయ‌డం కోట్లాది ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేలా చేసింది. మోడీ అనుచ‌రుడిగా..న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా..ఆర్థిక స‌ల‌హాదారుగా..అత్యున్న‌త‌మైన ఆర్థిక సంస్త‌కు బాధ్యునిగా విధులు నిర్వ‌హించిన ఈ ఎకాన‌మిస్ట్ ఉన్న‌ట్టుండి త‌ప్పుకోవ‌డం యుద్ధం నుంచి విశ్ర‌మించ‌డం లాంటిదే. ఇది ఎంత మాత్రం క్ష‌మార్హం కాదు.

రేపు ఏం జ‌రుగ‌బోతోంద‌న‌ని సామాన్య ప్ర‌జానీకం ఆందోళ‌న చెందుతోంది. ఇప్ప‌టికే కోట్ల‌ది ప్ర‌జాధ‌నాన్ని లూటీ చేశారు. బ్యాంకులు కుదేల‌య్యాయి. నోట్లు అంద‌ని ప‌రిస్తితి దాపురించింది. ఈ ప‌రిస్తితుల్లో ఆదుకోవాల్సిన సంస్థ‌, వ్య‌వ‌స్థ‌లు చేతులెత్తేస్తే ఇక వంద కోట్ల ప్ర‌జ‌ల‌కు పూచీ ఎవ‌రిస్తారో వేచి చూడాలి..!

No comments