Header Ads

రాజ‌స్తాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ల‌లో హ‌స్తం హ‌వా -మిజోరంలో ఎంఎన్ ఎఫ్ - ఎంపీలో నువ్వా నేనా

దేశంలో రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించి సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మోడీ , రాహుల్ గాంధీలు ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. రాజ‌స్థాన్‌లో కంటిన్యూ గెలుస్తూ ప‌వ‌ర్‌లో ఉన్న క‌మ‌లానికి ప్ర‌జ‌లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్టారు. అధికారంలోకి వ‌చ్చేందుకు కావాల్సిన స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఇచ్చారు. అక్క‌డ స‌చిన్ పైలట్‌ను ఇప్ప‌టికే రాహుల్ గాంధీ ముఖ్య‌మంత్రిగా గ‌తంలోనే ప్ర‌క‌టించారు. ఆయ‌న త‌న‌పై ఉన్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నారు.
మిజోరంలో కాంగ్రెస్ త‌న అధికారాన్ని కోల్పోయింది. ఇక్క‌డ ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన మిజో నేష‌న‌ల్ ఫ్రంట్ ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేందుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. ప‌దేళ్ల పాటు లాల్ త‌న్హావ్లా పాలించారు. ఆయ‌న ప్ర‌భావంతో గ‌ట్టెక్కుతామ‌ని హై క‌మాండ్ భావించింది. ఏకంగా ఆయ‌నే ఓట‌మి పాల‌య్యారు. పార్టీని నిండునా ముంచారు. 24 సీట్ల‌ను ఎంఎన్ ఎఫ్ అభ్య‌ర్థులు గెలువ‌గా కాంగ్రెస్ పార్టీ 5 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. ఇత‌రులు ఎనిమిది చోట్ల గెలిస్తే బీజేపీ ఒక్క సీటుతో స‌రిపెట్టుకుంది.

ఈశాన్య భార‌తంలోని అసోం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, మేఘాల‌య‌, నాగాలండ్‌, త్రిపుర రాష్ట్రాల‌ను ఒక్కొక్క‌టిగా హ‌స్తం కోల్పోయింది. వీటిని బీజేపీ ఇత‌ర మిత్ర‌ప‌క్షాల పార్టీలు చేజిక్కించుకున్నాయి. వీటిలో ఉన్న ఒకే ఒక్క మిజోరంను కూడా కాంగ్రెస్ పోగొట్టుకుంది. 40 స్థానాల్లో ఎంఎన్ ఎఫ్ స‌ర్కార్‌ను ఏర్పాటు చేయ‌బోతోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో , ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో స్ప‌ష్ట‌మైన మెజారీటీతో ప్ర‌భుత్వాన్ని ఫాం చేయ‌బోతోంది కాంగ్రెస్ పార్టీ. ఎంపీలో మేజిక్ ఫిగ‌ర్ చేరుకునేందుకు ఇంకా కొన్ని సీట్లు కావాల్సి ఉంది. ఇక్క‌డ ఇండిపెండెంట్లు కీల‌కం కాబోతున్నారు. సెమీఫైన‌ల్‌గా భావించిన ఈ ఎన్నిక‌లు ఓ ర‌కంగా బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చాయ‌నే చెప్పాలి.

కాంగ్రెస్ శిబిరంలో కొత్త జోష్ నెల‌కొన‌గా ..ఆ పార్టీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పోటీ చేసిన తెలంగాణ‌లో మాత్రం క‌నీస మార్కును దాట లేక పోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. హైక‌మాండ్ ఎంతో ప‌క‌డ్బందీగా ప్లాన్ అమ‌లు చేసినా..సీట్ల‌ను గెల‌వ‌లేక చ‌తికిల ప‌డింది. ఓ వైపు మ‌హాకూట‌మి ఏర్ప‌డినా..క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కుతుందా లేదా అన్న స్థాయికి సీట్లు ప‌డిపోయాయి. భారీ ఎత్తున ఓటు బ్యాంకు ఉంద‌ని అనుకున్న టీడీపీ కేవ‌లం రెండు సీట్ల‌తోనే స‌రిపెట్టుకుంది. చంద్ర‌బాబు మంత్రాంగం జ‌రిపినా ప‌వ‌ర్ ద‌రిదాపుల్లోకి రాలేక పోయింది. కారు జోరు -కూట‌మి బేజారు -తెలంగాణ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ..సాహోరే అంటూ కారు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. జాతీయ స్థాయి ఛాన‌ళ్లు, స‌ర్వే సంస్థ‌ల స‌ర్వేలను, ముంద‌స్తు ఎన్నిక‌ల పోల్స్ ప‌ల్స్‌ను బ్రేక్ చేస్తూ రికార్డు స్థాయిలో గులాబీ ద‌ళ‌ప‌తి చెప్పిన‌ట్లు భారీ ఆధిక్యంతో స్వంతంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. సిద్ధిపేట‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి త‌న్నీరు హ‌రీష్ రావు రికార్డు స్థాయిలో భారీ మెజారిటీతో టీజేఎస్ అభ్య‌ర్థిని భ‌వానీరెడ్డిపై ల‌క్షా 18 వేల 671 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఇక్క‌డ హ‌రీష్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్క‌డ పోటీ చేసిన అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. మంత్రుల్లో ఊహించ‌ని రీతిలో జూప‌ల్లి కృష్ణారావు , ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, చందూలాల్‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావులతో పాటు స్పీక‌ర్‌ మ‌ధుసూద‌నాచారి ఓట‌మి పాల‌య్యారు.

కారు స్పీడ్‌కు మ‌హాకూట‌మి అడ్ర‌స్ లేకుండా పోయింది. చావు త‌ప్పి క‌న్ను లొట్ట పోయింద‌న్న చందంగా కొన్ని సీట్ల‌లో గెలుపొంది ప‌రువు కాపాడుకుంది. అతిర‌థ మ‌హార‌థులు, సీఎం రేసులో ఉన్నార‌ని భావించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ప‌రాజ‌యం పాల‌య్యారు. జానారెడ్డి, జీవ‌న్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ‌, చిన్నారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, కొండా సురేఖ‌, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సంప‌త్ కుమార్‌, స‌ర్వే స‌త్య‌నారాయ‌ణలు ఓట‌మి చెందారు. మంత్రుల వ‌ర‌కు వ‌స్తే హ‌రీష్‌రావు, కేటీఆర్‌, ప‌ద్మారావు, జోగురామ‌న్న‌, ఈటెల రాజేంద‌ర్‌, ల‌క్ష్మారెడ్డి గెలుపొందారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో గులాబీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. రేవంత్‌రెడ్డి 9500 ఓట్ల తేడాతో ఓట‌మి చెంద‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లుగ చేసింది. గ‌జ్వేల్‌లో సీఎం కేసీఆర్ గెలుపొందారు. అనూహ్యంగా బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్ల‌ను గెలుచుకోలేక చ‌తికిల ప‌డింది. కారు జోరుకు ..ఆ పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌న్‌, కిష‌న్ రెడ్డి, రాజా సింగ్‌లు ఓట‌మి పాల‌య్యారు.

త‌న‌ను టార్గెట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రు ఓట‌మి పాలు చేశారు గులాబీ బాస్‌. ఇక త‌న‌కు ఎదురే లేకుండా కోలుకో లేకుండా దెబ్బ కొట్టారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, భట్టి విక్ర‌మార్క‌లు గెలుపొంది ప‌రువు కాపాడారు. ఖ‌మ్మం జిల్లాలో మ‌హాకూట‌మి అభ్య‌ర్థులు త‌మ ప్ర‌భావం చూప‌గా..మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, మెద‌క్‌, న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌, నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాల‌లో గులాబీ క్యాండిడేట్స్ విజ‌యం సాధించారు. సారు..కారు..కేసీఆర్ అంటూ జ‌నం గులాబీ బాస్‌ను తీవ్రంగా న‌మ్మారు. ఆయ‌న వ‌ల్ల‌నే త‌మ‌కు పెన్ష‌న్లు, సంక్షేమ ప‌థ‌కాలు వ‌స్తున్నాయ‌ని ప్ర‌గాఢంగా విశ్వ‌సించారు. ఆఖ‌రులో అమ‌లైన రైతు బంధు ప‌థ‌కం మిగ‌తా పార్టీల అభ్య‌ర్థులు ఓట‌మి పాల‌య్యేలా చేశాయి. కొన్ని చోట్ల హోరా హోరీగా పోటీ జర‌గ‌గా ..చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వార్ వన్ సైడ్ గా మారింది. కోలుకోలేని దెబ్బ తీసింది. ఎంఐఎం ఆరు చోట్ల ..బీజేపీ రెండుతో స‌రిపెట్టుకుంది.

No comments