Header Ads

నోరూరించే బిర్యానీ - ప్యార‌డైజ్ కా క‌హానీ

ఇండియాలో బ‌త‌కాలంటే ఎంత కావాలి. రోజుకు క‌నీసం 500 రూపాయ‌లైనా జేబులో ఉండాల్సిందే. పొద్దుటి నుండి రాత్రి ప‌డుకునేంత దాకా ఎన్నో ఖర్చులు. జేబులు గుల్ల‌వుతూనే ఉంటాయి. మీ ద‌గ్గ‌ర 50 రూపాయ‌లుంటే చాలు సుల‌భంగా..సంతోషంగా ఒక దిన‌మంతా కంఫ‌ర్ట్‌గా ఉండొచ్చు. అదెక్క‌డ‌ని అనుకుంటున్నారా..ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారా..అదే హైద‌రాబాద్‌. ఒక‌ప్పుడు వ‌జ్రాలు , ముత్యాలు, గాజుల అమ్మ‌కాల‌కు కేరాఫ్ ఈ న‌గ‌రం. కులీ కుతుబ్ అలీ షా ఏ ముహూర్తాన ఈ అత్య‌ద్భుత‌మైన న‌గ‌రాన్ని క‌ట్టించాడో కానీ ..400 ఏళ్లు దాటినా ఇంకా చెక్కు చెద‌ర‌కుండా నిటారుగా నిల‌బ‌డ్డ‌ది.

ఆనాడే ఈ న‌వాబు ఇత‌ర దేశాల‌తో వ్యాపార లావాదేవీలు నిర్వ‌హించేలా చేశారు. వ్యాపార‌స్తుల‌కు స్వ‌ర్గ‌ధామంగా నిలిచేలా తీర్చిదిద్దారు. ర‌వాణా సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. బ‌స్సులు, రైళ్లు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు క‌లిసి బ‌తికేలా ప‌రిపాల‌న అందించారు. చ‌రిత్రను తిరగ రాశారు. ఇరాన్ నుండి వ‌చ్చిన ఛాయ్ ..బిర్యానీ కోట్లాది జ‌నం గుండెల్ని దోచేసింది. దేశాధ్య‌క్షులు, అధిప‌తులు, సెల‌బ్రెటీలు, స్పోర్స్ ప‌ర్స‌నాలిటీలు, పేదోడు..ధ‌న‌వంతుడు..ఇలా ప్ర‌తి ఒక్క‌రు ఈ వంటకానికి..ఆ పానియానికి ఫిదా అయి పోయారు.స‌మోసాలు..బ‌న్నులు..బ్రెడ్లు..ఛాయ్‌లు తింటూ..తాగుతూ ..బీడీలు ..సిగ‌రెట్లు కాలుస్తూ సుల‌భంగా బ‌తికేయొచ్చు. అందుకే హైద‌రాబాద్ అంటే అంత ఇష్టం ఈ ప్ర‌జ‌ల‌కు. మ‌నం ఎక్క‌డికి వెళ్లినా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ‌. బ‌తుకంతా భారంగా అనిపిస్తుంది. కానీ ఈ అద్భుత భాగ్య‌న‌గ‌రాన్ని చూసే స‌రిక‌ల్లా ఎక్క‌డో మ‌న‌కూ ఈ భూమికి ఏదో తెలియ‌ని అనురాగ‌పు బంధ‌మేదో ఉంద‌ని అనిపిస్తుంది.
ల‌క్ష‌లాది మంది జ‌నం జాత‌ర‌లాగా అల్లుకుని పోయారు ఈ న‌గ‌రాన్ని. పిల్ల‌లు..పెద్ద‌లు..వృద్ధులు..యువ‌తీ యువ‌కులు..అంతా ఒక్క‌టే. కొన్ని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నా..అన్ని కులాలు, మ‌తాలు, జాతుల మ‌ధ్య సంబంధాలు అలాగే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇదీ ఈ స్థలానికి ఉన్న విశిష్ట‌త‌. ఈ హైద‌రాబాద్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌పంచాన్ని త‌న వైపున‌కు తిప్పుకున్న సైబ‌రాబాద్‌. త‌ల‌మానికంగా నిలిచే చార్మినార్‌..లాల్ ద‌ర్వాజా..రాణిగంజ్‌..మాసాబ్ ట్యాంకు, పురానాపూల్‌, జూలాజిక‌ల్ పార్క్‌, అవుట‌ర్ రింగ్ రోడ్లు..ఎగిరే విమానాలు..ఇలా చెప్పుకుంటూ పోతే..కొన్నేళ్లు ప‌డుతుంది. గాజుల గ‌ల‌గ‌ల‌లు..యువ‌తుల న‌వ్వులు..యువ‌కుల కేరింత‌లు..సాల‌ర్ జంగ్ మ్యూజియం..చౌమ‌హ‌ల్లా ప్యాలెస్‌..ఆ ప‌క్క‌నే ప్యాట్రిక్ స‌మాధి..మ‌లినం అంట‌ని ప్రేమ‌కు నిద‌ర్శ‌నం ..ఆ ప‌విత్ర స్థ‌లం. ఇప్ప‌టికీ అపుడే పూసిన గులాబీలు చుట్టూ ప‌రుచుకుని ఉంటాయి. రేకులు..రెమ్మ‌లు రెప‌రెప‌లాడుతూ..ప్రేమ స‌జీవ‌మ‌ని చాటి చెపుతాయి.

హైద‌రాబాద్ అంటే చెక్కు చెద‌ర‌ని చార్మినార్‌తో పాటు ప్యార‌డైజ్ బిర్యానీ, ఇరానీ చాయ్ కూడా. 1953లో సికింద్రాబాద్‌లోని ప్యార‌డైజ్ స‌ర్కిల్‌లో ప్యార‌డైజ్ ఇప్ప‌టికీ ఆకాశంలో న‌క్ష‌త్రంలా వెలుగుతూనే ఉంది. కోట్లాది ప్ర‌జ‌లకు బిర్యానీలోని రుచిని..ఛాయ్‌లో ఉన్న మ‌జాను అంద‌జేస్తోంది. కోట్లాది రూపాయ‌ల వ్యాపారం చేస్తోంది. వంద‌లాది మందికి ఉపాధి చూపిస్తోంది..ప్యార‌డైజ్‌. ఇరాన్ నుండి ఈ బిర్యానీ హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఈ హోట‌ల్‌, రెస్టారెంట్ల‌కు అలీ హ‌మ్మ‌తీ య‌జ‌మానిగా ఉన్నారు. రోజూ వేలాది మంది ప్ర‌యాణికులు ఎంజీబీఎస్ కు వ‌చ్చి వెళుతుంటారు. అక్క‌డ కూడా రెండు చోట్ల ప్యార‌డైజ్ రా ర‌మ్మంటూ ఊరిస్తోంది. శాఖోప‌శాఖ‌లుగా ప్యార‌డైజ్ విస్త‌రించింది. మాసాబ్ ట్యాంక్‌, హైటెక్ సిటీ, ఎన్టీఆర్ గార్డెన్స్‌, కూక‌ట్‌ప‌ల్లి, బేగంపేట‌, బ‌స్టాండ్ కూడ‌ళ్ల వ‌ద్ద బిర్యానీ ఫ్లేవ‌ర్స్‌, ఛాయ్‌లు..స‌మోసాలు..కేకులు, ఐస్ క్రీంలు ల‌భిస్తున్నాయి. త‌క్కువ ధ‌ర‌..నాణ్య‌వంత‌మైన ధ‌ర‌లు..ఏ కాలంలోనైనా స‌రే మ‌రో ఫ్లేవ‌ర్ డ్రింక్ ఉంది..అదే ఫ‌లూదా ..ల‌స్సీ. ఇదో రుచిక‌ర‌మైన పానియంగా పేరుంది. విజిటేబుల్ బిర్యానీ..చికెన్ బిర్యానీ..మ‌ట‌న్ బిర్యానీ..క‌బాబ్స్ కోసం వేలాది మంది హైద‌రాబాదీలు..ఇండియ‌న్స్‌..ప్ర‌వాస భార‌తీయులు..ఇలా ఎంద‌రో వీటి కోసం ఎగ‌బ‌డ‌తారు.

ఈ ప్యార‌డైజ్‌కు ఓ హిస్ట‌రీ వుంది. సికింద్రాబాద్‌లో ప్యార‌డైజ్ టాకీస్ ఉండేది. థియేట‌ర్‌కు అనుబంధంగా స‌మోసా..ఛాయ్‌..బిస్క‌ట్‌లు అమ్మే చిన్న టీ కొట్టు ఉండేది. ఇరాన్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన హుస్సేన్ హిమ్మ‌తీ దీన్ని న‌డిపించారు. మెల్ల‌గా కాల‌గ‌మ‌నంలో టాకీస్ క‌నుమ‌రుగైంది. కానీ హుస్సేనీ టీకొట్టు స్లోగా ఎద‌గ‌టం మొద‌లు పెట్టింది. 10 మందితో ప్రారంభ‌మైన ఈ టీకొట్టు..2014 నాటికి 800 మందికి పైగా ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరుకుంది. ప్యార‌డైజ్ హోట‌ల్‌గా..హుస్సేనీ కొడుకులు అలీ హిమ్మ‌తీ, డాక్ట‌ర్ ఖాజీం హిమ్మ‌తిలు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీస‌కు వ‌చ్చేలా ప్యార‌డైజ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మొత్తం 2.5 లక్షల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ప్యారడైజ్ హోటళ్లు విస్తరించాయి. దేశ, విదేశీ ప్రతినిధుల నోరూరించే ప్యారడైజ్ బిర్యానీ తయారీకి వస్తువుల్ని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటారు. ధావత్ బాస్మతీ బియ్యాన్ని ఢిల్లీ నుంచి, సుగంధ ద్రవ్యాలైన సాఫ్రాన్‌ను కాశ్మీర్, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మాంసం ఉత్పత్తుల్ని మాత్రం హైదరాబాద్‌లోని చెంగిచెర్ల నుంచి, తృణ ధాన్యాలు, గరం మసాలా, ఇతర దినుసులన్నింటినీ బేగంబజార్ నుంచే తెచ్చుకుంటారు. ఇవన్నీ స్థానికంగా లభించేవే. పచ్చి మాంసంతోనే బిర్యానీ వంటకం మొదలు పెడతారు. ఇక్క‌డి నుంచే దుబాయ్, ముంబై, చెన్నై నగరాలకు విమానాల్లో బిర్యానీ పార్శిల్స్ వెళ్తుంటాయి.

న‌గ‌ర‌ వాసులు మాత్రమే రుచి చూసిన ప్యారడైజ్ బిర్యానీని ఇతర జిల్లాలు, మెట్రో నగరాలకు సైతం అందించడానికి ప్యారడైజ్ ప్రణాళికలు వేస్తోంది. విజయవాడ, విశాఖపట్నం జిల్లా ల్లోను, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనూ ప్యారడైజ్ హోటళ్లు ఏర్పాటు కానున్నాయి. ఏ నగరంలో మొదట ప్రారంభించాలి? అక్కడ అనువైన ప్రాంతమేది? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఆయా ప్రాంతాల ప్రజల ఆదరణ, అవసరాలను బట్టి బ్రాండ్ అంబాసిడర్ ను కూడా ఎంపిక చేసుకుంటారు. ప్యా రడైజ్ హోటళ్లలో పనిచేసే వారంతా హోటల్ మేనేజ్‌మెంట్‌లలో శిక్షణ పూర్తి చేసిన వారే. ఎక్కడో కోర్సులు పూర్తి చేసిన వారికి కాకుండా తామే సొంతగా శిక్షణ ఇవ్వటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం ‘ప్యారడైజ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయనున్నారు. నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు ‘ప్యారడైజ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్’ను ప్రారంభించనున్నారు. శిక్షణానంతరం తమ బ్రాంచీల్లో ఉద్యోగులుగా నియమించుకుంటారు.

క‌పిల్‌దేవ్‌, గ‌వాస్క‌ర్‌, కోహ్లి, స‌చిన్‌, షారూఖ్‌, అమీర్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌, రాహుల్ గాంధీ, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ్యోతిరాదిత్య సింధియా, ప్రియాద‌త్‌, మాధురీదీక్షిత్‌, స‌చిన్ పైల‌ట్‌, మిలింద్ దేవ్‌రా, పురందేశ్వ‌రి, సానియా మీర్జా, వైఎస్ ఆర్‌, మ‌ర్రి చెన్నారెడ్డి, ఎం.ఎఫ్ హుస్సేన్‌, గురుమూర్తి, రోడా మిస్త్రి, పీజేఆర్‌..రెహ‌మాన్‌, మ‌హేష్ బాబు, ఇలా చాలా మంది సెల‌బ్రెటీలు సంద‌ర్శించిన వారే. గ‌తంలో ఒక‌సారి అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. నాణ్య‌త బాగా లేద‌నే నెపంతో మూసి వేశారు. కొన్ని రోజులు అయ్యాక మ‌ళ్లీ ప్యార‌డైజ్ త‌న ప్రాభ‌వాన్ని చూపిస్తోంది. ప్యార‌డైజ్ అంటే బిర్యానీ, ఛాయ్ కానే కాదు..అది భాగ్య‌న‌గ‌రానికే త‌ల‌మానికం. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల బ్రాండ్‌. తెలంగాణ ప్రాంతానికి ద‌క్కిన ఆత్మగౌర‌వం. భిన్న జాతుల స‌మ్మేళ‌నం..సంస్కృతికి ప్ర‌తిబింబం..ఈ ద‌మ్ బిర్యానీ..ఛాయ్‌.

No comments