Header Ads

ఆరాధ్య దైవం ఆద‌ర్శ ప్రాయం -అంచ‌నాలు పెంచిన ఎన్టీఆర్ బ‌యో పిక్

కోట్లాది ప్ర‌జ‌ల‌కు ఆరాధ్య దైవంగా ..అద్భుత‌మైన న‌టుడిగా ..పేద‌ల పెన్నిధిగా..బ‌డుగు జీవుల బాంధ‌వుడిగా..విశ్వ‌విఖ్యాత సార్వ‌భౌముడిగా పేరు తెచ్చుకున్న నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర సంచ‌ల‌నాల‌కు తెర తీసింది. తెలుగు వెండి తెర మీద తెలుగు వాడి వేడిని చూపించిన మ‌హా న‌టుడు. త‌న మాటే వేదం..తాను చెప్పిందే శాస‌నం అన్న రీతిలో ఆయ‌న పాల‌న సాగింది. ఎన్టీఆర్ ఆ మూడుక్ష‌రాలు . ఓ ప్ర‌భంజ‌నం..ఓ విస్ఫోట‌నం..ఓ చ‌రిత్ర‌కు సాక్ష్యం. ఇదంతా జ‌రిగిన చ‌రిత్ర‌. ఈ దేశంలో మ‌హాన‌టులు కొంద‌రే ..వారిలో ఎన్టీఆర్ మ‌రుపురాని మ‌నిషిగా..గుర్తుండి పోతారు. ఆయ‌న చూపినంత ప్ర‌భావం ఇంకే నాయ‌కుడు చూపించ‌లేదు. వ్య‌క్తిగా..వ్య‌వ‌స్థ‌గా..తెలుగు దేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడుగా..త‌క్కువ టైంలో కాంగ్రెస్ పార్టీని గ‌ద్దె దించి..తెలుగువారి ఆత్మ‌గౌర‌వాన్ని చాటి చెప్పి..అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త ఎన్టీఆర్‌దే.
సంక్షేమ ప‌థ‌కాలు నాయ‌కుల‌కు కాదు..పేద‌ల‌కు చెందాల‌ని ప‌రిత‌పించిన నాయ‌కుడు. టీడీపీ ఒక సునామిలా ఏపీ రాజకీయాల్లో దూసుకు వ‌చ్చింది. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన వారిని నాయ‌కులుగా చేశాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్టీఆర్ కాలంలోనే రాజ‌కీయ ప‌రంగా పేరు తెచ్చుకున్న వారు కోకొల్ల‌లు. అంత‌లా ఆయ‌న ఆ పార్టీని తీర్చిద్దారు. త‌ద‌నంత‌రం ఎన్నో ప‌రిణామాలు జ‌రిగాయి. ప‌రిటాల ర‌వీంద్ర‌, దేవినేని నెహ్రూ..ఎర్ర‌స‌త్యం లాంటి వాళ్లు త‌మ హ‌వాను కొన‌సాగించారు. అనుకోని ప‌రిస్థితుల్లో తూటాల‌కు బ‌లై పోయారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్ర‌బాబు నాయుడు..ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న కూతురు పురందేశ్వ‌రి దేవి మంచి వ‌క్త‌గా..మ‌రో అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర్‌రావు ..నేత‌గా పేరొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఓ చ‌రిత్ర‌. ఎన్టీఆర్ న‌ట వార‌స‌త్వాన్ని ఆయ‌న కుమారులు, మ‌నుమ‌లు కంటిన్యూ చేస్తున్నారు. వారిలో బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రాం, తార‌క్ లాంటి వాళ్లున్నారు. ఇటీవ‌ల ఆయ‌న కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. ల‌క్ష్మీ పార్వ‌తి రెండో భార్య‌గా ఎన్టీఆర్ చేసుకున్నారు. అప్ప‌ట్లో అది వివాదాస్ప‌ద‌మైంది.

నాదెండ్ల భాస్క‌ర్‌రావు వెన్నుపోటు పొడిచిన స‌మ‌యంలో ఎన్టీఆర్ తీవ్రంగా ఆందోళ‌న‌కు లోన‌య్యారు. ఆ త‌ర్వాత వైస్రాయ్ చ‌రిత్ర అంద‌రికీ తెలిసిందే. రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం..ఎన్టీఆర్‌ను కోట్లాది ప్ర‌జ‌ల్లో దేవుడిగా కొలిచేలా చేశాయి. ఇటు ఏపీలో అటు కేంద్రంలో కూట‌మి క‌ట్టారు. త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌, క‌రుణానిధి, జ‌య‌ల‌లిత ..ఎలాగో తెలుగు వారి ప‌రంగా చూస్తే ఎన్టీఆర్ , వైఎస్ ఆర్ క‌నిపిస్తారు. వీళ్లు ప్ర‌జ‌ల‌ను ప్రేమించారు. ఏదో ఒక కార్య‌క్ర‌మంతో నేటికీ జ‌నంలో నిల‌బ‌డ్డారు. ఎన్టీఆర్ మ‌ర‌ణం ఏపీని శోక‌సంద్రంలో ముంచెత్తింది. ఆ త‌ర్వాత ఎన్నో ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ వ‌ద్దంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. ఎన్టీఆర్ త‌ర్వాత ..కేసీఆర్ త‌నదైన మార్క్‌ను ప్ర‌ద‌ర్శిస్తూ..ప‌రిపాల‌నద‌క్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న ఎన్టీఆర్ కేబినెట్‌లో ప‌నిచేశారు.

ఎన్టీఆర్ జీవితాన్ని బ‌యో చ‌రిత్ర‌గా సినిమా రూపంలో తీసుకు వ‌స్తున్నారు. మొద‌ట్లో ద‌ర్శ‌కుడు తేజ స్టార్ట్ చేశారు. ఎందుక‌నో ఆయ‌న‌ను మార్చేశారు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఆయ‌న స్థానంలో వ‌చ్చారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతోంది. రెండు సినిమాలుగా వ‌స్తున్నాయి. క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు పేరుతో.. ఇప్ప‌టికే మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి స్వ‌ర‌ప‌రిచిన రెండు పాట‌లు అంచ‌నాలు మించి పోయాయి. యూట్యూబ్‌లో సంచ‌ల‌నం రేపాయి. ల‌క్ష‌లాది మంది ఆ మ‌హానాయ‌కుడిని త‌లుచుకుంటూ వింటున్నారు. అంత‌లా మైమ‌రిచి పోయేలా..క‌ల‌కాలం గుర్తుండి పోయేలా పాట‌ల‌ను స్వ‌ర ప‌రిచారు. కీర‌వాణి, కైలాష్ కేర్ పాడిన పాట‌లు ఇప్ప‌టికే రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి.

జాన‌ప‌దం..మెస్మ‌రిజం క‌ల‌గలిపితే వ‌చ్చే ఆ గొంతు కైలాష్‌ది..ఇంకేం ఆయ‌న పాడిన పాట ఇపుడు రింగ్ టోన్లుగా..వీడియోలుగా..దుమ్ము రేపుతున్నాయి. ఎన్టీఆర్ బ‌యో పిక్‌ను ..కుమారుడు బాల‌కృష్ణ‌, సాయి కొర్ర‌పాటి, విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్ న‌టిస్తున్నారు. ఆమ‌ని లక్ష్మీ పార్వ‌తిగా, క‌ళ్యాణ్ రాం హ‌రికృష్ణ‌గా, మోక్ష‌జ్ఞ యంగ్ ఎన్టీఆర్‌గా..పూనం బాజ్వా గార్ల‌పాటి లోకేశ్వ‌రి, రాణా ద‌గ్గుబాటి చంద్ర‌బాబుగా, మంజిమా మోహ‌న్ నారా భువ‌నేశ్వ‌రిగా, భ‌ర‌త్ రెడ్డి ద‌గ్గుబాటిగా, ఖేడ్‌కార్ నాదెండ్ల‌గా, హింమాషి చౌద‌రి పురందేశ్వ‌రిగా, సుమంత్ నాగేశ్వ‌ర్‌రావుగా, మ‌హేష్‌బాబు క్రిష్ణ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

మాల‌వికా నాయ‌ర్ క్రిష్ణ‌కుమారిగా, నిత్యా మీన‌న్ సావిత్రిగా, శాలిని పాండే షావుకారి జాన‌కిగా, యాశు మాశెట్టి ఎస్‌. వ‌ర‌ల‌క్ష్మిగా, హాన్సికా మోట్వానీ జ‌య‌ప్ర‌ద‌గా, పాయ‌ల్ రాజ్‌పుట్ జ‌య‌సుధ‌గా, ర‌కుల్ ప్రీతి సింగ్ శ్రీ‌దేవిగా, కైకాల స‌త్య‌నారాయ‌ణ హెచ్. ఎం. రెడ్డిగా, ముర‌ళి శ‌ర్మ చ‌క్ర‌పాణిగా, సంజ‌య్ రెడ్డి పింగ‌లి నాగేంద్ర‌రావు గా, ర‌వి కిష‌న్ నాగ‌య్య‌గా, వెన్నెల కిషోర్ ..రుక్మానంద‌రావుగా , మిర్చి మాధ‌వి..న‌న్న‌ప‌నేని రాజ‌కుమారిగా న‌టిస్తున్నారు. వీరితో పాటు ఈషా రెబ్బా, పృథ్విరాజ్‌, భానుచంద‌ర్‌, దేవ‌యాని మ‌రికొన్ని పాత్ర‌ల్లో జీవించ‌బోతున్నారు. ఆ మ‌హోన్న‌త న‌టుడు..మాన‌వుడి జీవితం..మ‌హాభిష్క్ర‌మ‌ణం గురించి ..బ‌యోపిక్ ఎలా వుండ‌బోతుందో చూసి తీరాల్సిందే.. అందుకు అలుపెరుగ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్న డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్‌కు అభినంద‌న‌లు చెప్పాల్సిందే. గుండెల్ని పిండేస్తున్న కీర‌వాణికి మ‌రోసారి హ్యాట్సాఫ్‌. ఎన్టీఆర్ న‌టుడే కాదు నాయ‌కుడు కూడా..!

No comments