Header Ads

రామ‌కృష్ణ‌..కెవ్వు కేక - న‌ట‌న‌లో అదుర్స్

త‌రం మారింది. అభిరుచులు మారాయి. టెక్నాల‌జీ పెరిగింది. తెలుగు సినిమా కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఒక‌ప్పుడు అవే ముఖాలు..అవే టైటిల్స్‌..పాత డైలాగులు..క‌థ‌లు అవే..అంతా పాత‌ద‌న‌మే. ఎంతో చ‌రిత్ర క‌లిగిన తెలంగాణ ప్రాంతానికి స‌రైన ప్ర‌యారిటీ ద‌క్క‌లే. అదేమిటో తెలంగాణ ఉద్య‌మం ఏనాడు స్టార్ట్ అయ్యిందో..రాష్ట్రం ఏర్ప‌డ్డాక‌...ఎంద‌రో అవ‌కాశాల కోసం ఎదురు చూశారు. కేవ‌లం కొన్ని కుటుంబాల‌కే ప‌రిమిత‌మై పోయిన టాలీవుడ్ పై ఈ ప్రాంతపు బిడ్డ‌లు త‌మ గొంతుల‌ను స‌వ‌రించారు. త‌మ క‌లాల‌కు ప‌దును పెట్టారు. యువ‌తీయ‌వ‌కులు అన్ని ఫార్మాట్‌లలో దుమ్ము రేపుతున్నారు. ద‌ర్శ‌కులుగా, ర‌చ‌యిత‌లుగా, గాయ‌నీ గాయ‌కులుగా, కొరియో గ్ర‌ఫీలుగా, న‌టీ న‌టులుగా..ఇలా ప్ర‌తి రంగంలో త‌మ‌దైన ముద్ర క‌న‌బరుస్తున్నారు. త‌మ ఐడెంటిటీ కోల్పోకుండా క్రియేటివిటీతో ఆక‌ట్టుకుంటున్నారు.
సినిమా అన్న‌ది కోట్ల వ్యాపారంతో కూడుకున్న‌ది. ఇదో మాయాజాలం..ఒక‌ర‌కంగా మ‌ట్కా, జూదం లాంటిదే. పాట‌ల ర‌చ‌యిత‌ల్లో చంద్ర‌బోస్‌, అశోక్ తేజ‌, డైరెక్ట‌ర్ల‌లో వంశీ, హ‌రీష్ శంక‌ర్‌, సందీప్ రెడ్డి వంగా, త‌రుణ్ బాస్క‌ర్ లాంటి వాళ్లు ఎందరో టాలెంట్‌కు ప‌దును పెడుతున్నారు. ఇంకొంద‌రు పోర‌గాళ్లు స్వ‌చ్ఛ‌మైన యాస బాస‌తో న‌వ్విస్తూనే క‌న్నీళ్లు తెప్పిస్తున్నారు. యూట్యూబ్ పుణ్య‌మా అని అవ‌కాశాలు రాని వారంతా అద్భుత‌మైన కాన్సెప్ట్‌ల‌తో వీడియోలు రూపొందిస్తూ..షార్ట్ ఫిల్మ్‌ల‌ను తీస్తూ అప్‌లోడ్ చేస్తున్నారు. ల‌క్ష‌ల్లో లైక్‌లు..ఒక్కోసారి కోటి కూడా దాటి రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. బిత్తిరి స‌త్తి, ఈర్ల న‌ర‌సింహ సుద్దులు, మంగ్లీ ..ప్ర‌యోక్త‌గా ప్రారంభించి..పాట‌గ‌త్తెగా ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది.

ప్ర‌తి ఒక్క‌రు బ‌తుక‌మ్మ పాట‌లు పాడుతూ త‌మ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొంద‌రు హీరోల‌కే ప‌రిమిత‌మై పోయిన తెలుగు సినిమాలో ఉన్న‌ట్లుండి విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక సునామీలా ముందుకు వ‌చ్చాడు. రియ‌ల్ మేన‌రిజంతో ..హైద‌రాబాద్ మాట‌ల‌తో ..యంగ్ అండ్ ఎన‌ర్జ‌టిక్ ప‌ర్స‌నాలిటీతో ..హీరోగా స‌క్సెస్ అయ్యాడు. త‌రుణ్ బాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లి చూపులు అత‌డిలోని టాలెంట్ ఆక‌ట్టుకుంది. సందీప్‌రెడ్డి వంగా డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మూవీగా రికార్డులు తిర‌గ రాసింది.అందులో మ‌నోడు హీరో. ఆ త‌ర్వాత నోటా, గీత గోవిందం, టాక్సీవాలా మూవీలు భారీగా వ‌సూలు చేశాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ తో పాటు రాహుల్ రామ‌కృష్ణ ఠ‌క్కున మెరిశాడు. ఈ పోర‌గాడు వృత్తి రీత్యా జ‌ర్న‌లిస్టు..ఆ త‌ర్వాత సైన్మా ల‌ఘు చిత్రం తీసి..డైరెక్ట‌ర్ కంట్లో ప‌డ్డాడు. ఇంకేం తెలంగాణ ప్ర‌తి ఇంట్లో ఒక‌డిగా ఉండి పోయాడు. ఎక్క‌డికి వెళ్లినా ఆ రాహుల్ గాడు ఏడిరా అంటే..ఇంకో చోట రామ‌కృష్ణ ఉన్న‌డా లేడా అన్న టాపిక్‌..అంత‌లా మ‌నోడు క‌నెక్ట్ అయిపోయిండు.

1991 జ‌న‌వ‌రి ఒక‌టిన హైద‌రాబాద్‌లో జ‌న్మించిన రాహుల్ రామ‌కృష్ణ‌కు ఇపుడు 27 ఏళ్లు. మ‌నోడి సినీ కెరీర్ గాడిలో ప‌డింది. సైడ్ కేర‌క్ట‌ర్‌కు ప్రాణం పోస్తున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన గీత గోవిందం సినిమాలో హీరోకు సూచ‌న‌లు ఇచ్చే ఫ్రెండ్ కేరెక్ట‌ర్‌లో ఇర‌గ దీసిండు. తండ్రి యోగా గురు, ఓ మేగ‌జైన్‌కు త‌న త‌ల్లి అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా ఉన్నారు. మెకానిక‌ల్ ఇంజ‌నీర్‌గా చ‌దువుతూ ఉండ‌గానే మూడో ఏడాదిలో డిస్ కంటిన్యూ చేశాడు. ఈవెనింగ్ డైలీ దిన‌ప‌త్రిక‌లో జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేశాడు. ఎవ‌రైనా ఇత‌ర ప్రాంతాల నుండి హైద‌రాబాద్‌కు వ‌స్తే వారికి స‌పోర్ట్ చేసే ప‌నికి కుదిరాడు. హిందూస్తాన్ టైమ్స్ ..అఫిలియేటెడ్ వెబ్ సైట్‌లో మూవీస్ రివ్యూస్ రాశాడు రామ‌కృష్ణ‌. పాట‌లు రాశాడు. స్క్రిప్ట్ రైటర్‌..టెలివిజ‌న్‌లో కుక్ షో ను ప్ర‌యోక్త‌గా నిర్వ‌హించాడు. త‌రుణ్ బాస్క‌ర్ తీసిన సైన్మా షార్ట్ ఫిల్మ్‌లో రాహుల్ న‌టించాడు. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమాతో పాటు అర్జున్ రెడ్డిలో ఇర‌గ దీసిండు. మ‌హేష్ బాబు సినిమా భ‌ర‌త్ అనే నేనులో, స‌మ్మోహ‌నం, అమెజాన్ వెబ్ సిరీస్ గ్యాంగ్‌స్ట‌ర్ లో న‌టించాడు.

జ‌ర్న‌లిస్టు నుండి యాక్ట‌ర్‌గా ఎదిగిన రాహుల్ రామ‌కృష్ణ ఇపుడు అన్ని వ‌ర్గాల ప్ర‌క్షేకుల‌కు న‌చ్చిన న‌టుడు. అచ్చ‌మైన ఈ ప్రాంత‌పు భాష‌తో అల‌రిస్తున్న‌డు. ఇలాగే న‌టించాలి..ఇలాగే న‌వ్వించాలి. జీవిత‌మంటే కాసిన్ని క‌న్నీళ్లు..కావాల్సినంత న‌వ్వులు..క‌దూ..!

No comments