Header Ads

వెల్లివిరిసిన చైత‌న్యం - వెలిగేనా ప్ర‌జాస్వామ్యం..?

ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌చ్చే ఎన్నిక‌ల‌ను తేలిగ్గా తీసుకోరాదు. అది భార‌త స‌ర్వస‌త్తాక రాజ్యాంగం ప్ర‌తి భార‌తీయుడికి కల్పించిన గొప్ప అవ‌కాశం. ఓటు వేస్తే మ‌న‌కేం వ‌స్తుంద‌ని అనుకుంటే ఈ దేశం మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది. వేలాది మంది త్యాగాలు, బ‌లిదానాలు, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే వ‌చ్చింది ఈ దేశానికి స్వేచ్ఛ ల‌భించింది. ఆంగ్లేయుల పాల‌న నుండి విముక్తి ల‌భించింది. ఎన్ని యుద్ధాలు..ఎంత‌టి బానిస‌త్వం. శాంతియుతంగా పోరాటం చేసి కోట్లాది మంది భార‌తీయుల‌ను ఏకం చేసి ఇంగ్లండ్ గుండెల్లో నిద్ర పోయిన మ‌హాత్ముడు ఏకంగా తూటాల‌కు బ‌లై పోయాడు.
ఈ దేశం బాగుండాల‌ని కోరుతూ కొన్నేళ్ల పాటు అప్ర‌హ‌తిహతంగా పాలించిన ఇందిరాగాంధీ తూటాల‌కు నేల‌కొరిగారు. అత్యంత భ‌ద్ర‌త క‌లిగిన ప్ర‌ధాని రాజీవ్ గాంధీ మాన‌వ బాంబుల పాల‌య్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో చ‌రిత్ర ఇండియాకున్న‌ది. టెక్నాల‌జీ మారింది. ఎన్నో రంగాల‌లో భార‌త‌దేశం వెలిగి పోతోంది. ప్ర‌పంచానికే ఆద‌ర్శ ప్రాయంగా..అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా విరాజిల్లుతోంది..త‌న చ‌రిత్ర‌ను తానే తిర‌గ రాస్తోంది. ఎక్క‌డికి వెళ్లినా ఈ ప్ర‌పంచంలో స్వేచ్ఛ త‌క్కువ‌. చాలా చోట్ల ఏక‌ఛ‌త్రాధిప‌త్య పాల‌న న‌డుస్తోంది. ఇంకొన్ని చోట్ల రాజ‌రిక పాల‌న ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఆయుధాలు, మాఫియాలు, డాన్‌లు, రాకెట్లు రాజ్య‌మేలుతున్నాయి. ఈ ప్ర‌పంచాన్ని ఎంతో మంది ప్ర‌భావితం చేశారు. వారిలో ఐనిస్టీన్‌, అబ్ర‌హం లింక‌న్‌, స్టాలిన్‌, లెనిన్‌, నెహ్రూ, మురార్జీ, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, చేగువేరా, చావెజ్‌ ..ఒక ఎత్తయితే..కార్ల్ మార్క్స్ మాత్రం ప్ర‌త్యేకం. అద‌న‌పు విలువ సిద్ధాం..మార్క్సిజం సృష్టించినంత చ‌రిత్ర ఎవ్వ‌రూ సృష్టించ‌లేక పోయారు. త‌రాలు గ‌డిచినా మార్క్స్ ఎక్క‌డో ఒక చోట ప్ర‌భ‌విస్తూనే..ప్ర‌భావితం చేస్తూనే ఉన్నారు. అంత‌గా ఆయ‌న పాపుల‌ర్ అయ్యారు. ఆయ‌న రాసిన దాస్ కేపిట‌ల్ ఇప్ప‌టికీ కోట్లాది బాధితుల పాలిట ఆయుధంగా మారింది.

నిత్య చైత‌న్యానికి..బ‌లిదానాల‌కు పెట్టింది పేరు తెలంగాణ‌. 14 ఏళ్ల పాటు ఈ ప్రాంతపు విముక్తి కోసం అలుపెరుగని ఉద్య‌మాల‌ను చేప‌ట్టింది. కేంద్ర స‌ర్కార్‌ను క‌దిలించింది. సంబండ వ‌ర్ణాలు ఒక్క‌టై పోరాడింది. 29వ రాష్ట్రంగా ఏర్ప‌డింది. నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు ప్ర‌తిరూపంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉద్య‌మ సంస్థ నుండి పార్టీగా అవ‌త‌రించింది. నాలుగున్న‌ర ఏళ్ల పాటు దొర‌ల పాల‌న‌ను గుర్తు చేస్తూ ప్ర‌జ‌ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టింది. లెక్క‌లేన‌న్ని సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసింది. ఏ స్వేచ్ఛ కోసమైతే ప్ర‌జ‌లు ఆశించారో దానిపై నీళ్లు చ‌ల్లారు. అప్ర‌క‌టిత నిర్బంధాన్ని విధించారు. ఏ రాష్ట్ర సాధ‌న కోసం సాధ‌నంగా ఉప‌యోగ‌ప‌డిందో ఆ ధ‌ర్నా చౌక్‌లో ఎవ్వ‌రూ ధ‌ర్నాలు,ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్యక్తం చేయ‌కుండా చేశారు. పౌర‌హ‌క్కులకు భంగం వాటిల్లింది ల‌క్ష‌లాది పిల్ల‌లకు ఉద్యోగాలు ఇవ్వ‌కుండా మోసం చేశారు. గ‌నులు, భూముల‌ను కొల్ల‌గొట్టారు. కోట్లు కొల్ల‌గొట్టారు. ఎమ్మెల్యేలు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారారు. ప్ర‌జ‌ల ఆమోదం లేకుండానే తొమ్మిది నెల‌లు ఉండ‌గానే స‌ర్కార్‌ను ర‌ద్దు చేశారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం పాలు చేశారు. కుటుంబ పాల‌న‌ను గుర్తుకు తెచ్చారు. ప‌రిపాల‌న‌కు దేవాల‌యంగా భావించే స‌చివాలయానికి వాస్తు పేరుతో రాకుండా ప‌రిపాల‌న చేసిన వ్య‌క్తిగా ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్ చ‌రిత్ర సృష్టించారు.

ఎన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పినా..ప్ర‌జ‌ల నుంచి పూర్తి వ్య‌తిరేక‌త ఉంద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. చ‌రిత్ర అంటేనే ప్ర‌జ‌లు. వారిని ద‌ద్ద‌మ్మ‌లుగా, మ‌ద్యానికి, నోట్ల క‌ట్ట‌ల‌కు అమ్ముడు పోయే వారిగా, గొర్రెలు, బ‌ర్రెలు, చేప‌లు ఇస్తే చాలు ఓట్లు వేస్తార‌ని అనుకుంటే అది పెద్ద త‌ప్పిద‌మే అవుతుంది. ఏ జ‌న‌మైతే నీరాజ‌నాలు ప‌ట్టారో అదే ప్ర‌జ‌లు త‌మ చైత‌న్యాన్ని ఓట్ల రూపంలో ప్ర‌ద‌ర్శించారు. 70 శాతానికి ద‌గ్గ‌ర‌గా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ విలువైన ఓటు వేశారు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు. టీఆర్ ఎస్ ఒక్క‌టే కాకుండా అన్ని పార్టీలు లెక్క‌లేనంత‌గా డ‌బ్బుల‌ను, మ‌ద్యాన్ని స‌ర‌ఫ‌రా చేశాయి. కానీ ఈసారి ఎన్నిక‌లు మాత్రం అవినీతికి..నీతికి మ‌ధ్య పోరాటంగా జ‌రిగాయి. ఓట‌ర్లు అమ్ముడు పోయి వుండ‌వ‌చ్చు..కానీ ఓట్ల‌ను మాత్రం త‌మ‌కు ఎవ‌రైతే ద‌గ్గ‌రుండి ప‌నిచేస్తారో వారికే ఓటు వేశారు. ఓ నిశ్శ‌బ్ధ విప్ల‌వాన్ని సృష్టించ బోతున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం ఎవ‌రిని కొంప ముంచుతుందో..ఇంకెవ్వ‌రిని గ‌ట్టెక్కిస్తుందో కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే. ఎగ్జిట్ పోల్స్ సంస్థ‌లు, మీడియా సంస్థ‌లు స‌ర్వేల ఫ‌లితాల‌ను ముందస్తుగా ప్ర‌క‌టించినా జ‌నం మాత్రం సుస్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని కోరుకున్నార‌నేది స్ప‌ష్ట‌మైంది.

మోడీ చ‌రిస్మా ప‌నిచేస్తుందా..లేక రాహుల్ గాంధీ , చంద్ర‌బాబు నాయుడుల మంత్రాంగం గ‌ట్టెక్కిస్తుందా..గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ మ‌రోసారి ప‌వ‌ర్‌లోకి వ‌స్తారో వేచి చూడాలి. ఎన్ని డ‌బ్బులు పంచినా..మ‌ద్యాన్ని పారించినా..ప్ర‌లోభాల‌కు గురి చేసినా..వెల్లివిరిసిన ఓట‌ర్ల చైత‌న్యం ప్ర‌జాస్వామ్యాన్ని బ‌తికించార‌ని అనుకోవాల్సి ఉంటుంది.

No comments