Header Ads

మాతృభాష‌లో మాట్లాడ‌లేమా ..? ఒక విశ్లేషణ

దేనినైనా నేర్చు కోవాలంటే ముందుగా మాతృభాష‌పై మ‌మ‌కారం పెంచుకోవాలి. దానిపై ప‌ట్టు వుండాలి. వేరే భాష‌లు నేర్చుకోవాల‌నుకున్నా లేదా ఎక్క‌డికైనా వెళ్లాల‌న్నా ప‌లు భాష‌లు రావాల్సిన ప‌నిలేదు. ఇపుడు ఆ శ్ర‌మ త‌ప్పింది. ఇన్మ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పుణ్య‌మా అంటూ లెక్క‌లేన‌న్ని యాప్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇండియా వ‌ర‌కు వ‌స్తే హిందీ త‌ర్వాత ఎక్కువ‌గా మాట్లాడే భాష ఏది అంటే మ‌న తెలుగు భాషే. ఐటీ దెబ్బ‌కు చాలా మంది తెలుగులో మాట్లాడే వారి సంఖ్య రాను రాను త‌క్కువ‌వుతోంది. మ‌న వారికి మ‌న భాష‌లో మాట్లాడాలంటే నామోషీ. ఏదో చిన్న‌త‌నంగా భావిస్తారు. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అంటూ అభివృద్ధి న‌మూనా మారింది. ఏదైనా చేయి..ఏమైనా కానివ్వు..డాల‌ర్లు కావాలి. ఎందుకంటే ఏ దేశ‌పు రూపాయ‌లైనా డాల‌ర్ ముందు దిగ‌దిడుపే. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో అమెరికా డాల‌ర్ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. దానికే ఎక్కువ డిమాండ్‌.
ఇంగ్లీష్‌లో మాట్లాడ‌టం క్రేజ్‌గా ..ఓ స్టేట‌స్ సింబ‌ల్‌గా ..అంద‌రికంటే గొప్ప‌వారిన‌న్న ఫీలింగ్ ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌మ‌ను తాము గొప్ప‌వారిగా భావించుకుంటున్నారు. తెలుగులో మాట్లాడే వారిని చుల‌క‌న చేసి చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వ‌స్తున్న స‌భ్య‌త‌, సంస్కారం నేర్పే సంస్కృతి, సాంప్ర‌దాయాలు విధ్వంస‌మై పోతున్నాయి. ఇదంతా అమెరికాలో విప‌రీత‌మైన స్వేచ్ఛ దొరుకుతోంది. ఇక్క‌డ ప్ర‌తిదీ ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం న‌డుస్తుంది. ఈ స‌మాజం త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగిస్తే భ‌రించ‌దు. ఇక్క‌డ బంధాలు, బాంధ‌వ్యాల‌కు ప్రాముఖ్య‌త ఎక్కువ‌. పిల్ల‌ల నుండి పెద్ద‌ల దాకా ప్ర‌తి ఒక్క‌రు తెలుగు వ‌చ్చినా స‌రే ఎందుక‌నో ఇంగ్లీష్‌లో మాట్లాడేందుకే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నారు.

ఐటీ, మేనేజ్‌మెంట్ రంగాల‌తో పాటు అన్ని రంగాల‌లో ఈ ఇంగ్లీష్ జాడ్యం నెల‌కొంది. ప్ర‌పంచం అంతా ఒక వైపు వుంటే..అమెరికా ఒక్క‌టి మాత్రం వెరీ డిఫ‌రెంట్‌. మ‌న ఉప రాష్ట్రప‌తిగా ఉన్న ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడును ఈ సంద‌ర్భంగా మెచ్చుకోకుండా వుండ‌లేం. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా..స్వ‌చ్ఛ‌మైన‌..క‌మ్మ‌నైన తెలుగు భాష‌లోనే మాట్లాడ‌తారు. అంత‌లా ఆయ‌న మాతృభాష‌ను ప్రేమిస్తారు. త‌ల్లి పాలు ఇచ్చి..పెంచి పోషిస్తుంది..అలాంటిదే భాష కూడా. అమ్మ‌పై మ‌మ‌కారం లేక‌పోతే ..మ‌నం మ‌నుషులం కాకుండా పోతాం. అందుకే మాతృభాష‌ను మ‌నం స్వంతం చేసుకోవాలి. దానిలో ఉన్న అందం..అందులో ఉన్న మాధుర్యం మాట్లాడితేనే తెలుస్తుంది అంటారు..ప్ర‌ముఖ గాయ‌కుడు పండితారాధ్యుల బాల‌సుబ్ర‌మ‌ణ్యం. అటు ఆంధ్ర ప్ర‌దేశ్‌లో..ఇటు తెలంగాణ‌లో అధికార భాషా సంఘాలు ప‌నిచేస్తున్నా అవి పాల‌కులకు వ‌త్తాసు ప‌లికేవిగా ..జేబు సంస్థ‌లుగా త‌యార‌య్యాయి. తెలుగు భాషా దినోత్స‌వం పేరుతో ఏదో ఒక రోజు నిర్వ‌హించ‌డం..కొంద‌రు క‌వులు, ర‌చ‌యిత‌లు, గాయ‌నీ గాయ‌కులు, అనువాద‌కులు, త‌దిత‌రుల‌ను ఎంపిక చేయ‌డం ..శాలువాలు క‌ప్ప‌డం ..తీరా అయ్యింద‌నిపిస్తున్నారు.

ఇండియాలో భాష ప‌ట్ల మ‌క్కువే కాదు..త‌మ వారిని చుల‌క‌న చేసినా లేదా త‌క్కువ చేసి మాట్లాడినా ధీటుగా స‌మాధానం ఇచ్చే రాష్ట్రాల‌లో త‌మిళ‌నాడు అంద‌రికంటే ముందంజ‌లో ఉంటోంది. త‌మిళ‌నాడులో ఎంత‌టి వారైనా..వారు ఏ స్థానంలో ఉన్నా స‌రే వారి భాష‌లోనే మాట్లాడాలి. చెన్నైలో మీరు ఎక్క‌డికైనా వెళ్లండి..విమానాశ్ర‌యం నుండి ఇటు ఏ గ‌ల్లీకి వెళ్లినా..ముందు ఆహ్లాద‌క‌ర‌మైన చెట్లు క‌నిపిస్తాయి. ప్ర‌తి బోర్డుపై త‌మిళంలో వివ‌రాలు రాసి ఉంచ‌డం క‌నిపిస్తుంది. భాష అంటే వారికి అంతులేని మ‌మ‌కారం. భార‌త రాజ్యాంగం భాష‌ల‌ను ర‌క్షించు కోవాల‌ని స్ప‌స్టంగా పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఐటీ జ‌పం చేస్తున్నాయి. అభివృద్ధిలో దూసుకు పోతున్నాయి. కానీ మ‌నుషుల్ని క‌లిపే..మాతృభాష‌ను మాత్రం విస్మ‌రిస్తున్నాయి. భాష బ‌త‌కాల‌న్నా..లేదా సంస్కారం అబ్బాల‌న్నా ..మ‌నం ఏదైనా రంగంలో ముందంజ‌లో ఉండాల‌న్నా..ఏదైనా సాధించాల‌న్నా మ‌న మీద మ‌న‌కు సాధికార‌త ఉండాలి. భాష‌పై ప‌ట్టు క‌లిగి ఉండాలి..దానిపై మ‌మ‌కారాన్ని కోల్పోకూడ‌దు. ఐటీ దెబ్బ‌కు మ‌న భాష‌కు ముప్పు ఏర్ప‌డింది. అంత‌కంటే మ‌నం మ‌నం కాకుండా పోతున్నాం. హైద‌రాబాద్ ఇప్ప‌టికే అమెరికాను త‌ల‌పింప చేస్తోంది. ఎక్క‌డ చూసినా భ‌వంతులు..అన్నీ మాల్స్‌, స్టోర్ రూంలు..దుస్తుల దుకాణాలు..త్రీ స్టార్‌, ఫైవ్ స్టార్ హోట‌ల్స్‌. అన్నీ ఇంగ్లీష్ జ‌ప‌మే చేస్తున్నాయి.

రాను రాను ఇంగ్లీష్ రాక పోతే బ‌త‌క‌లేని ప‌రిస్థితికి తీసుకు వ‌చ్చారు పాల‌కులు. తెలుగులోనే మాట్లాడాలంటూ జీఓలు జారీ చేయాల్సిన స‌ర్కారే ఇంగ్లీష్‌లోనే జీఓలు జారీ చేస్తుండ‌డం చూస్తుంటే దానికి భాష‌ను అభివృద్ధి చేయ‌డంపై ..భాష‌ను బ‌తికించుకోవ‌డంపై శ్ర‌ద్ధ లేద‌నుకోవాలి. బ్యాంకులు, సంస్థ‌లు, కంపెనీలు అన్నీ ఇంగ్లీష్ జ‌పం చేస్తున్నాయి. తెలుగు అంటేనే ఛీ..ఛీ..అనే స్థాయికి దిగ‌జారి పోయారు. చైనాను, త‌మిళ‌నాడును చూసి సిగ్గు తెచ్చు కోవాలి. గూగుల్‌, ఫేస్ బుక్‌, ఇన్ స్టా గ్రాం, టంబ్ల‌ర్‌, యూట్యూబ్ లాంటి సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌న్నీ ఇపుడు తెలుగుపై కొంత దృష్టి పెట్టాయి. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అంటూ తెలుగు భాష వెలుగుతోంది. కానీ ప్ర‌భుత్వం , పాల‌కుల‌కు భాష‌పై మ‌మ‌కారం లేదు. గౌర‌వం, ప్రేమ కూడా లేదు. వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో చైనాదే రాజ్యం. అమెరికా అట్టుడుకి పోతోంది. ఐటీ కంపెనీల‌కు త‌మ భాష‌లో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తేనే త‌మ దేశంలోకి రానిస్తామ‌ని..నువ్వు ఎన్ని కోట్ల వ్యాపారం చేసినా ఎంత మందికి ఉపాధి క‌ల్పిస్తావో మాకు అన‌వ‌స‌రం..కావాల్సిందల్లా నీ భాష‌తో మాకు అన‌వ‌స‌రం..నువ్వు మాతో ఉండాల‌నుకుంటే ఇక్క‌డ మేం చెప్పిన‌ట్టు వినాల్సిందే. మా భాష‌లో మాట్లాడాల్సిందే..అని స్పష్టం చేసింది. గూగుల్ లాంటి బ‌డా ఐటీ కంపెనీలు త‌గ్గి..చైనా రూల్స్ కు అనుగుణంగా వారి భాష‌లోనే నిర్వ‌హిస్తున్నారు.

ఇండియ‌న్ ప్రైమ్ మినిస్ట‌ర్ న‌రేంద్ర మోడీకి జాతీయ భాష హిందీ అంటే గౌర‌వం. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌త‌హాగా సాహిత్యాభిమాని. ఆయ‌న‌కు తెలుగు భాష‌పై ప‌ట్టుంది. మ‌మ‌కారం ఉంది. ఆయ‌న స్వ‌త‌హాగా క‌వి, ర‌చ‌యిత‌, గాయ‌కుడు, సాహిత్య ప్రేమికుడు..బ‌హు భాషా కోవిదుడు. ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల‌పై ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. ఇటీవ‌ల భాష‌ను బ‌తికించుకుందామ‌ని ..కోరుతూ భారీ ఎత్తున తెలుగు మ‌హాస‌భ‌లు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. బ‌స్సులు ఏర్పాటు చేసి..సౌక‌ర్యాల‌ను క‌ల్పించి స‌క్సెస్ చేశారు. విద్యా హ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు నిర్బంధ విద్య‌ను పిల్ల‌ల‌కు అందించాలి. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం ఓ వైపు తెలుగు భాష‌ను కాపాడుకుందాం అంటూనే మ‌రో వైపు తెలుగులో ఉన్న పాఠ‌శాల‌ల‌ను మూసి వేసే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టారు. టీచ‌ర్ల‌ను భ‌ర్తీ చేయ‌లేదు. గ‌త పాల‌నలో 28 వేల పోస్టుల‌కు మించి భ‌ర్తీ చేయ‌లేదు.

తెలుగును మొద‌టి భాష‌గా, ఉర్దూను రెండో భాష‌గా అమ‌లు చేయాల‌ని మ‌రోసారి జీఓలు జారీ చేశారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాలు తెలుగులో ఉండాల‌ని, బోర్డులపై కూడా రాసి ఉంచాల‌ని పేర్కొన్నారు. ఎక్క‌డా అమ‌లు జ‌రుగుతున్న పాపాన పోవ‌డం లేదు. ఇక స‌మాచార హ‌క్కు చ‌ట్టంకు దిక్కు లేకుండా పోయింది. మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ లో స‌భ్యులను భ‌ర్తీ చేయ‌లేదు. వెంక‌య్య‌నాయుడుతో పాటు ఇరు ప్రాంతాల్లో ఉంటున్న స్వామీజీలు, గురువులు కొంద‌రు తెలుగు భాష‌ను బ‌తికిస్తున్నారు. వేద పాఠ‌శాల‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. పాల‌కుల్లో చిత్త‌శుద్ది లోపించింది. తెలంగాణ కంటే ఏపీలోనే భాష‌ను బ‌తికించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. క‌వి స‌మ్మేళ‌నాలు, భాషాభివృద్ధిపై స‌భ‌లు, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, భాష‌పై ప‌ట్టున్న వారిని గుర్తించి ప్రోత్స‌హించ‌డం, తెలుగు భాషా పండితుల‌ను స‌న్మానించారు. భాష‌ను బ‌తికించు కోవాల‌ని కోరుతూ యార్ల‌గ‌డ్డతోపాటు ప‌లువురు ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తెలంగాణ వ‌ర‌కు వ‌స్తే..పాల‌కులే కాదు..కొంత‌మంది చేతుల్లోనే అధికార భాషా సంఘం ప‌నిచేస్తోంది. అందులో వారు చెప్పిందే వేదం. ఇక ర‌వీంద్ర‌భార‌తి ఉందో లేదో తెలియ‌దు. కొన్ని ప్రాంతాల వారికే ప‌రిమితం చేశారు. జిల్లా ప‌రిపాల‌నాధికారులు అంటే జిల్లా క‌లెక్ట‌ర్లు ఈ విష‌యంలో పూర్తి నిర్లక్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇద్ద‌రు ముగ్గురు త‌ప్ప అంతా ఇంగ్లీష్ బాబులే. దీనికంత‌టికి కార‌ణం ప్ర‌భుత్వ‌మే. తెలంగాణ కంటే ఏపీ బెట‌ర్‌. తెలుగు భాష‌ను గౌర‌వించ‌ని వారిని శిక్షించేలా ..వారిని ఉద్యోగాల్లోంచి తీసి వేసేలా చ‌ట్టాలు తీసుకు రావాలి. ఐటీ కంపెనీలు కూడా మ‌న భాష‌కు ప్రాధాన్య‌త ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. నిర్బంధంగా చ‌ట్టాలు తీసుకు వ‌స్తే కానీ వీరు విన‌రు. మాతృభాష‌కు ముప్పు ఏర్ప‌డింది. అంటే దాన‌ర్థం సామాన్య‌, పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన‌, మైనార్టీ, బ‌హుజ‌న ప్ర‌జ‌లు స‌మాజం నుండి వెలి వేయ‌బ‌డుతున్న‌ట్టే లెక్క‌.

మాతృభాష‌లో మాట్లాడేందుకు ఇప్ప‌టి నుంచైనా ప్రారంభించాలి. ఆంగ్ల భాష అవ‌స‌ర‌మే కానీ అదే జీవితం కాద‌న్న స‌త్యం తెలుసు కోవాలి. భాష అంటే అమ్మ‌. మ‌రి ఆమెను గౌర‌విస్తేనే క‌దా ఈ బంధం బ‌ల‌ప‌డేది. తెలుగులో మాట్లాడ‌టం అంటే..త‌ల్లితో అనుబంధం క‌లిగి ఉండ‌డం అన్న‌మాట‌. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం..క‌మ్మ‌నైన..తీయ‌నైన తెలుగులో స్వేచ్ఛ‌గా మాట్లాడుకుందాం..దానిలోనే కార్య‌క‌లాపాలు నిర్వ‌హిద్దాం. ప‌లుచ‌నైన బంధాల‌ను క‌లుపుకుందాం. గుండె నుంచి గుండె లోతుల్లోకి తెలుగు అమృతాన్ని ఒలికిద్దాం. మాతృభాష వ‌ర్దిల్లాలి. తెలంగాణ త‌ల్లి ప‌రిఢ‌విల్లాలి. తెలుగుద‌నం ప్ర‌స‌రించాలి.

No comments