Header Ads

కొలువుల కోలాటం - నిరుద్యోగుల ఆరాటం - భ‌ర్తీ చేస్తుందా కొత్త ప్ర‌భుత్వం

నిన్న‌టి దాకా ప‌డిలేచింది తెలంగాణ‌. ఈ ప్రాంతానికి లెక్క‌లేన‌న్ని గాయాలు..చెప్పుకోలేనంత భారాలు. నీళ్లు..నిధులు..నియామ‌కాల పేరుతో కొన్నేళ్ల పాటు పోర‌టాలు..ఉద్య‌మాలు..స‌క‌ల జ‌నుల స‌మ్మెలు ..బ‌లిదానాలు..ఆత్మ త్యాగాలు ..ఆత్మ‌హ‌త్య‌లు చోటు చేసుకున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ..ప్ర‌భుత్వం ప్రాజెక్టుల నిర్మాణం..నీళ్లు ఇవ్వ‌డంపైనే దృష్టి పెట్టింది. నిరుద్యోగులు ఖాళీగా ఉన్న పోస్టులు భ‌ర్తీ చేస్తార‌నే న‌మ్మ‌కంతో స్వంత డ‌బ్బుల‌తో ..అప్పులు చేసి కోచింగ్‌ల‌కే ప‌రిమిత‌మై పోయారు. చూస్తూ వుండ‌గానే నాలుగున్నర ఏళ్లు గ‌డిచి పోయిన‌వి. స‌ర్కార్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు తెర తీసింది. అవి కూడా అయి పోయాయి.
ఉద్యోగాల భ‌ర్తీ అన్న‌ది అన్ని పార్టీలు ప్ర‌ధాన ఎజెండాగా త‌మ మేనిఫెస్టోల‌లో చేర్చాయి. ల‌క్ష ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని..వెంట‌నే నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌ని ..అర్హులైన ప్ర‌తి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయ‌ల నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని మ‌హాకూట‌మి మేనిఫెస్టోలో ప్ర‌క‌టించింది. ఇందుకు భిన్నంగా గులాబీ బాస్ ఏకంగా 3, 016 రూపాయ‌ల చొప్పున ఇస్తామ‌ని ఎన్నిక‌ల స‌భ‌ల్లో వెల్ల‌డించారు. చాలా మంది రిటైర్ కాబోతున్నారు. ఇంకా భ‌ర్తీ కావాల్సిన‌వి ఖాళీలు ఉన్నాయి. ఇప్ప‌టికే నోటిఫికేష‌న్లు వేశారు. కొన్నింటిని భ‌ర్తీ చేశారు. శాస‌న‌స‌భ సాక్షిగా ప‌లువురు స‌భ్యులు కొలువుల భ‌ర్తీ విష‌య‌మై ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డం త‌మ ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని ప్ర‌స్తుత ఎన్నిక‌లలో గెలిచాక ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ తెలిపారు.ఉద్యోగాల కోసం ఇప్ప‌టికే గ‌దుల‌కే ప‌రిమిత‌మైన నిరుద్యోగులు కొలువులు వ‌స్తాయో రావోన‌ని ఆందోళ‌న‌కు లోన‌వుతున్నారు. ఇంకొంద‌రు ఉద్యోగ భ‌ర్తీ వ‌యో ప‌రిమితి దాటి పోతున్నారు. కొత్త స‌ర్కార్ కొలువు తీరిన వెంట‌నే ఖాళీగా వున్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటే భావుండేద‌ని బాధితులు కోరుతున్నారు.

ఇక పోస్టుల విష‌యానికి వ‌స్తే..వ్య‌వ‌సాయ శాఖ‌లో 3, 673 పోస్టుల‌కు గాను 2 వేల 688 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేస్తే 1506 మాత్రమే భ‌ర్తీ చేశారు. ప‌శుసంవ‌ర్ద‌క శాఖ‌లో 1842 ఖాళీలుంటే..258 పోస్టులు నింపారు. బీసీ సంక్షేమం శాఖ‌కు సంబంధించి చూస్తే 2, 881 ఉద్యోగాలు ఖాళీ వుంటే..కేవలం 338 మాత్రమే పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ‌గా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కులాల‌కు చెందిన వారున్నారు. దీనిని స‌ర్కార్ విస్మ‌రించ‌డం శోచ‌నీయం. సీఏఎఫ్ అండ్ సీఎస్ శాఖలో 140 పోస్టులు ఖాళీగా వుంటే ఏ ఒక్క‌టి భ‌ర్తీ కాలేదు. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌లో 3 వేల 602 ఖాలీలుండ‌గా కేవ‌లం 82 పోస్టులు భ‌ర్తీ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఎమ‌ర్జెన్సీ స‌ర్వీసు సెక్టార్‌గా ఉన్న విద్యుత్ శాఖ‌లో 2 వేల 608 ఉద్యోగాలు వుంటే 1427 పోస్టులు మాత్ర‌మే భ‌ర్తీ చేయ‌గా..ఇంకా రికార్డ్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ అసిస్టెంట్, బిల్ క‌లెక్ట‌ర్ త‌దిత‌ర క్ల‌రిక‌ల్ పోస్టుల భ‌ర్తీపై దృష్టి పెట్ట‌లేదు. ఆర్థిక శాఖ‌లో 729 పోస్టులుంటే 28 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. సాధార‌ణ ప‌రిపాల‌నలో 190 పోస్టులు ఖాళీగా వుంటే..90 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది..ఇంకా భ‌ర్తీ ప్ర‌క్రియ ప్రారంభం కాలేదు.

విద్యారంగాన్ని పూర్తిగా టీఆర్ ఎస్ స‌ర్కార్ పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింది. ఉన్న‌త విద్యా శాఖ‌లో 4 వేల 702 పోస్టులు ఖాళీగా వుంటే నేటీకీ ఒక్క‌టి కూడా భ‌ర్తీ కాక పోవ‌డంపై నిరుద్యోగులు మండి ప‌డుతున్నారు. వైద్యం, ఆరోగ్య శాఖ‌లో 12 వేల 487 పోస్టులు ఖాళీగా వుంటే..కొన్నింటిని మాత్ర‌మే భ‌ర్తీ చేశారు. హోం శాఖ‌లో 36 వేల 785 పోస్టులు ఖాళీగా వుంటే.. 12 వేల 752 పోస్టులు భ‌ర్తీ చేశారు. పోలీసుల‌పై ఉన్నంత శ్ర‌ద్ధ ప్ర‌తిభ క‌లిగిన వారిని కొలువుల్లోకి తీసుకునే విష‌యంలో స‌ర్కార్ శ్ర‌ద్ధ చూప‌లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. గృహ నిర్మాణంలో ఒకే ఒక్క పోస్టు ఖాళీ ఉన్న‌ట్లు చూపించారు. నీటి పారుద‌ల శాఖ‌లో 853 పోస్టుల‌కు గాను 481 ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు. ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ‌ల విష‌యానికి వ‌స్తే ..186 పోస్టులు భ‌ర్తీ చేయాల్సి వుండ‌గా ఏ ఒక్క‌టీ నింప‌లేదు. న్యాయ‌శాఖ‌లో 12 ఉద్యోగాలు ఖాళీగా వుంటే..ఒక్క పోస్టు కూడా భ‌ర్తీ కాలేదు. కార్మిక‌శాఖ‌లో 724 పోస్టులు ఖాళీగా వుంటే..53 పోస్టుల‌కు మాత్ర‌మే నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించి..ఒక్క‌టి కూడా నింప‌లేదు. పుర‌పాల‌క , ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌లో 2 వేల 612 ఉద్యోగాలు ఖాళీగా వుంటే..961 పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు ప్ర‌క‌టించి..కేవ‌లం 942 భ‌ర్తీ చేశారు. మైనార్టీ సంక్షేమం శాఖ‌లో 2 వేల 278 పోస్టులు ఖాళీగా వుంటే.. 550 మాత్ర‌మే పూర్తి చేశారు.

ప్లానింగ్ శాఖ‌లో 514 పోస్టులు ఖాళీగా వుంటే..ఒక్క‌టి కూడా భ‌ర్తీ చేప‌ట్ట‌లేదు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో 1620 ఉద్యోగాలు ఖాళీగా వుంటే..947 పోస్టులు నింపారు. రెవిన్యూ శాఖ‌లో 4, 253 పోస్టులు ఉండ‌గా ఒక్క‌టి భ‌ర్తీ కాలేదు..వీఆర్ ఓ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ వేసి..ఎగ్జామ్ నిర్వ‌హించారు. ఫ‌లితాలు ప్ర‌క‌టించారు. ఇంకా ఫైన‌ల్ లిస్టు వెల్ల‌డించ‌లేదు. ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్ శాఖ‌లో 3 వేల 875 ఖాళీలుండ‌గా..498 ఉద్యోగాల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేశారు. పాఠ‌శాల విద్యా శాఖ‌లో 9,980 పోస్టులు ఖాళీగా వుంటే..136 ఉద్యోగాలు మాత్ర‌మే పూర్త‌య్యాయి. ఆర్ అండ్ బి శాఖ‌లో 1249 పోస్టులు ఖాళీగా వుంటే..307 మాత్ర‌మే భ‌ర్తీ చేశారు. గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో 3 వేల 556 ఉద్యోగాలు ఖాళీగా వుంటే..275 మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయి. స్త్రీ శిశు సంక్షేమం శాఖ‌లో 308 పోస్టులు ఖాళీగా వుంటే..ఒక్క‌టీ కూడా భ‌ర్తీ కాలేదు. యువ‌జ‌న స‌ర్వీసులు శాఖ‌లో 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌లేదు.

మొత్తం ల‌క్షా 1, 807 పోస్టులు ఖాళీగా వుండ‌గా 30 వేల‌కు పైగా భ‌ర్తీ చేశారు. 811 పోస్టుల‌ను రెగ్యుల‌రైజ్ చేశారు. సింగ‌రేణిలో 7266 ఉద్యోగాలు భ‌ర్తీ చేశారు. ఇంకా భ‌ర్తీ కావాల్సిన‌వి ల‌క్ష‌కు పైగా ఉన్నాయి. ఇప్ప‌టికైనా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం దృష్టి సారించి కొలువులు భ‌ర్తీ చేస్తే నిరుద్యోగులు సంతోషానికి గుర‌వుతారు.

No comments