Header Ads

కింగ్‌మేక‌ర్లే కీల‌కం -73 శాతం దాటిన పోలింగ్ - ఈవీఎంల‌లో భ‌విష్య‌త్ నిక్షిప్తం

కొన్ని గంట‌ల్లో అన్ని పార్టీల త‌ర‌పున బ‌రిలోకి దిగిన అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం తేల‌నుంది. అంద‌రి ఫ్యూచ‌ర్ ప్ర‌స్తుతానికి ఈవీఎంల‌లో నిక్షిప్త‌మై ఉంది. టీఆర్ఎస్ 100 సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తుంటే..మ‌హాకూట‌మి మాత్రం ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే నిజ‌మ‌వుతుంద‌ని చెబుతోంది. బీజేపీ, ఎంఐఎంలు మాత్రం తామే స‌ర్కార్ ఏర్పాటులో కీల‌కం కాబోతున్నామ‌ని ప్ర‌క‌టిస్తున్నాయి. కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు ప్ర‌జాకూట‌మి నేత‌లు. కోట్లు పారేసి ఎగ్జిట్ పోల్స్ త‌మ వైపు వ‌చ్చేలా చేసుకున్నార‌ని ఆరోపించారు. ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేది మేమేనంటూ ఇరు పార్టీలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. గెలుస్తామ‌ని అభ్య‌ర్థులు పైకి గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా..లోలోప‌ట మాత్రం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

సంక్షేమ ప‌థ‌కాల మీదే గులాబీ ద‌ళం ఆశ‌లు పెట్టుకోగా..ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాలే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని హ‌స్తం అంటోంది. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బేరీజు వేస్తే..ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి ఇబ్బంది ఎదుర‌వుతుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. ఈ విష‌యాన్ని ల‌గ‌డ‌పాటి ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. దీనిని కేటీఆర్ కొట్టి పారేశారు. పాజిటివ్ ..నెగ‌టివ్ ఓట్లు ఎవ‌రి వైపు ప‌డ్డాయో ..ఎవ‌రిని గెలుపు తీరాల‌కు చేరుస్తుందో తెలియ‌క ల‌బోదిబోమంటున్నారు. సందిట్లో స‌డేడియా అన్న‌ట్లు అనుచ‌ర గ‌ణాలు ల‌క్ష‌లు వ‌సూలు చేసి..వెన‌కేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఈవిఎంల‌ను కూడా కేసీఆర్ స‌ర్కార్ టాంప‌రింగ్ చేసే ప్ర‌మాదం ఉంద‌ని..అందుకని గ‌ట్ట బందోబ‌స్తు ఏర్పాటు చేయాల‌ని గ‌జ్వేల్ కాంగ్రెస్ అభ్య‌ర్థి వంటేరు ప్ర‌తాప్ రెడ్డి ఇప్ప‌టికే ఈసీ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం వాస్త‌వామేన‌ని ఈసీ ప్ర‌క‌టించింది. ఈసారి ఎన్నిక‌ల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓట‌ర్ల చైత‌న్యం వెల్లి విరియ‌గా..ప‌ట్ట‌ణాల్లో అనుకున్నంతగా ఓట‌ర్లు స్పందించ‌లేదు. వృద్ధులు, మ‌హిళ‌లు త‌మ వైపు ఉన్నార‌ని, రైతు బంధు గ‌ట్టెక్కిస్తుంద‌ని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. నియంత పాల‌న‌కు కాలం చెల్లిందంటూ ఇక ఫాం హౌస్‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌జాకూట‌మి అంటోంది. సెప్టెంబ‌ర్ 6 నుండి డిసెంబ‌ర్ 7 దాకా మూడు నెల‌ల పాటు ఎన్నిక‌ల జాత‌ర జ‌రిగింది. శ‌త్రువులు మిత్రులుగా మారిన సంఘ‌ట‌న ఈసారి చోటు చేసుకుంది. హ‌స్తం, సైకిల్ ఒక్క‌ట‌య్యాయి. ఎక్క‌డికి వెళితే అక్క‌డి టెంపుల్స్‌ను సంద‌ర్శించే రాహుల్ గాంధీ ఈసారి ఇక్క‌డ ఏ గుడికి వెళ్ల‌లేదు. అధినేత‌ల ప్ర‌సంగాల‌కు ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులే అనువాదం చేశారు. ఓట‌ర్ల చైత‌న్యం పెరిగినా చాలా చోట్ల నోటాకు ప్ర‌జ‌లు ఓటు వేశారు. గ్లామ‌ర్ ..త‌ళుకు బెళుకులు ప‌ని చేశాయి. ఖుష్బూ, విజ‌య‌శాంతి, న‌గ్మా , అజ‌హ‌రుద్దీన్ క్యాంపెయిన్ చేశారు. ఎన్న‌డూ లేనంత‌గా స‌ర్వేలు మాయం చేశాయి. కోట్ల‌కొద్దీ నోట్ల క‌ట్ట‌లు ప‌ట్టుబ‌డ‌డం విశేషం.

2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 69.5 శాతం న‌మోదైతే..ఈసారి 2018లో 3.7 శాతం అధికంగా పోలింగ్ న‌మోదైంది. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో 90.95 శాతం , అత్య‌ల్పంగా హైద‌రాబాద్ జిల్లాలో 48.49 శాతం న‌మోదైంది. నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగా చూస్తే మ‌ధిర‌లో 91.65 శాతం. చార్మినార్‌లో 40.18 శాతం న‌మోదైంది. 36 నియోజ‌క‌వ‌ర్గాల్లో 85 శాతం ..కంటే ఎక్కువ న‌మోదు కాగా..7 సీట్ల‌లో 90 శాతం కంటే అధికంగా పోలింగ్ జ‌రిగింది. ఈసారి గిరిజ‌న ప్రాంతాల్లోనే అత్య‌ధికంగా జ‌ర‌గ‌డం విశేషం. ఆలేరు, మునుగోడు, న‌ర్సాపూర్, భువ‌న‌గిరి, న‌ర్సంపేట‌, పాలేరులో అధికంగా యాకూత్‌పూర‌, మ‌ల‌క్‌పేట‌, నాంప‌ల్లి, జూబ్లీహిల్స్‌, చాంద్రాయ‌ణ్‌గుట్ట‌ల‌లో త‌క్కువ‌గా న‌మోదైంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు మాత్రం తామే కీల‌కం కాబోతున్నామంటూ బేరాల‌కు కుదిరారు. ఎవ‌రి వైపు మొగ్గు చూపుతార‌న్న‌ది తెలియ‌క ప్ర‌ధాన పార్టీలు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. ఈవీఎంలు ప్ర‌శాంతంగా ఉన్నాయి. పోలీసులు కాపాలా కాస్తున్నారు. నేత‌లు ఎవ‌రికి వారే ధీమాలో ఉన్నారు. అభ్య‌ర్థులు క‌ల‌లు కంటున్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రి ప‌నుల్లో వారు మునిగి పోయారు. బెట్టింగ్ బాబులు..కాయ్ రాజా కాయ్ అంటున్నారు. నోట్లు..మ‌ద్యం ఇంకా అలాగే కొన్నిచోట్ల ప‌డి ఉన్న‌ది. దొర పాల‌నలో బానిస‌ల‌వుతామా లేక ప్ర‌జ‌ల పాల‌న‌లో పంచుకుంటామో 11న తేల‌నుంది.

No comments