Header Ads

దీపావళి పండుగ జరుపుకోడానికి గల కారణాలు మరియు విశిష్టత.!

దీపావళి పండుగ అంటే అందరికి ఇష్టమే, దీపావళి పండుగను తెలుగువారు ఘనంగా చేసుకుంటారు. ముఖ్యంగా అంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో ఈ వేడుక చాల అట్టహాసంగా జరుపుకుంటారు. దీపావళి అంటే సిరులు పండుగగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా ఉంది. ఆ రోజున సంపదలు కోరుకునే వారంతా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.

వేకువజామునే నిద్రలేచి ఇంటిని పరిశుభ్రంగా తయారుచేసుకుంటారు. ఇంటిలోని పూజా మందిరాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించి లక్ష్మీదేవిని కొలువు తీరుస్తారు. ఐశ్వర్య ప్రదాయినిగా పేరున్న ఆ తల్లిని కొలిస్తే సమస్త సంపదలు వస్తాయని నమ్మకం. శాస్రోక్తంగా పూజలు చేసి పలు రకాలైన పిండివంటలతో ఆ తల్లికి నైవేద్యం పెడతారు.దీపం అంటేనే లక్ష్మీదేవి అన్నది ప్రజల విశ్వాసం, . అలా దీపాల వరసను పేర్చితే ఆ లోగిళ్ళు కళకళలాడుతూ లక్ష్మీదేవి వచ్చేందుకు ఇష్టపడుతుందని భావిస్తారు. అందువల్ల ఉదయం పూజామందిరంలో దీపాలను వెలిగించడం అయ్యాక సాయంత్రం ఇంటికి నలువైపులా దీపాలతో వెలుగుల పండుగను తీసుకువస్తారు.

ఇక మరో వైపు బాణాసంచా సరంజామా కూడా సిధ్ధం చేసుకుంటారు. దీపావళి పండుగ రావడానికి కారణమైన నరకాసురుని కధని దక్షినాదివారు బాగా నమ్ముతారు. దీపావళి రోజు  పిండివంటలతో విందారగించి అంతా సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు.

సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు చేసిన నరకాసుర సంహారానికి ప్రజలు పరమానందం చెంది జరుపుకునే పండుగే ‘దీపావళి’. నరకాసురుడిని శ్రీకృష్ణుడు చంపిన తర్వాతి రోజు, ఆ రాక్షసుడి పీడ విరగడైందన్న సంతోషంతో దీపావళి జరుపుకునే సంప్రదాయం వచ్చింది. అలాగే రావణాసురుడిని శ్రీరాముడు అంతంచేసి.. సీతమ్మను అయోధ్యకు తీసుకువచ్చిన సందర్భంగా దీపావళి జరుపుకుంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి. కథ ఏదైనా చెప్పే నీతి ఒక్కటే. చెడును రూపుమాపి, ప్రజలకు మంచిని మిగిల్చిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. సంతోషానికి చిహ్నంగా చీకటిని పారదోలుతూ దీపాలను వెలిగించి, విజయసూచికంగా టపాసులు కాల్చుతూ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటాం. ఈ అమావాస్యకు ఒక రోజు ముందు వచ్చే చతుర్దశిని నరక చరుర్దశిగా చెబుతారు. ఈ ఏడాది నరక చతుర్దశి నవంబర్ 6వ తేదీన వస్తోంది. అందుకే నవంబర్ 7న దీపావళిని జరుపుకోవాలి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 6వ తేదీ రాత్రి నుంచే దీపావళి సంబరాలు మొదలైపోతాయి.

టపాకాయలు కాల్చి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ కాబట్టి పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అలాగే మహిళలు ఇళ్లలో దీపాలను అందంగా అలంకరిస్తారు. దీపావళికి ముందు రోజు నరకచతుర్దశిని, అంతకు ముందు వచ్చే ధనత్రయోదశిని కొందరు ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాత రోజును కొన్నిచోట్ల బలిపాడ్యమిగా జరుపుకుంటారు.

కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. బలి చక్రవర్తిని మించిన దానశూరులుండరు అంటారు. వజ్ర, వైడూర్యాలు, మునిమాణిఖ్యాలు తదితర వస్తువులను దానమివ్వడం కాక, తన్ను తానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. బలిని, ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో దీపావళిని మూడురోజుల పండుగగా జరుపుకుంటే, ఉత్తర భారతదేశంలో మొత్తం ఐదు రోజులపాటు దీపావళిని జరుపుకోవడం పరిపాటి. ధనత్రయోదశి లేదా యమత్రయోదశి (మొదటిరోజు), నరకచతుర్దశి (రెండవరోజు), దీపావళి (మూడవరోజు), బలిపాడ్యమి (నాల్గవరోజు), భ్రాతృద్వితీయ లేక యమద్వితీయ (ఐదవరోజు) జరుపుకుంటారు.

అయితే ప్రస్తుతం చాలా ఇళ్లలో కేవలం దీపావళి రోజున మాత్రమే పండగ వాతావరణం కనిపిస్తోంది. సాధారణంగా దీపావళి నాడు వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. త్రయోదశి నాటి సాయంకాలం, ఇంటి బయట యముడి కోసం దీపం వెలిగించడంవల్ల అపమృత్యువు నశిస్తుంది అని అంటారు. అలాగే.. అమావాస్య, చతుర్దశి రోజుల్లో సాయంకాలం దీపదానాన్ని చేస్తే యమ గండం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దీపోత్సవ చతుర్దశి రోజున యమ తర్పణం చేయాలని ధర్మశాస్త్రాల్లో వివరించినట్లు చాలా మంది చెబుతారు. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని ‘కౌముదీ మహోత్సవం’గా అభివర్ణించారని, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి దీపదానం చేయాలని చెప్పారని ఓ కథనం ఉంది. దీపావళి పండుగ నాడు అందరు ఆనందంగా ఉంటారని, ఆ లక్ష్మి దేవి దీవెనలు దీపావళి నాడు ఆమె ను ఆరాధించిన వాలా పైన ఎప్పుడు ఉంటాయి అని పురాణాల్లో తెలిపారు .

No comments