Header Ads

స్వ‌శ‌క్తిని న‌మ్ముకుంది ప‌ది మందికి అన్నం పెడుతోంది – బోయ‌న‌ప‌ల్లి క‌విత బ‌తుకు క‌థ‌

జ్యూట్ బ్యాగుల త‌యారీతో జీవ‌నోపాధి, స్వ‌శ‌క్తిని న‌మ్ముకుంది ప‌ది మందికి అన్నం పెడుతోంది , బోయ‌న‌ప‌ల్లి క‌విత బ‌తుకు క‌థ‌ ఇది . ప్లాస్టిక్ బ్యాగులు, సంచుల వినియోగం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటోంద‌న్న ఆలోచ‌నే శ్రీ‌మ‌తి బోయ‌న‌ప‌ల్లి క‌విత‌ను వినూత్నంగా ఆలోచించింది. తాను బ‌త‌క‌ట‌మే కాదు ప‌ది మందికి ఉపాధి క‌ల్పించాల‌న్న సంక‌ల్పం ఆమెను జ్యూట్ బ్యాగుల త‌యారీ ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టేలా చేసింది. ఎక్క‌డ చూసినా ప్లాస్టిక్ సంచులే. వీటి వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌మైన రోగాలు వ‌చ్చే ప్ర‌మాదం వుంద‌ని ఆమె గ్ర‌హించారు. తానే ఎందుకు వాటిని ఉప‌యోగించ‌కుండా చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించారు. భ‌ర్త స‌హ‌కారంతో అదే కొద్దిపాటి పెట్టుబ‌డితో సిరి జ్యూట్ క్రియేష‌న్స్ పేరుతో నాలుగు సంవ‌త్స‌రాల కింద‌ట హైద‌రాబాద్ లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాల‌నీలో ప్రారంభించింది. కొద్ది మందితో ప్రారంభ‌మై ఇపుడు 22 మందికి ఉపాధి ఇచ్చేలా ఎదిగింది. దీని వెనుక శ్రీ‌మ‌తి క‌విత గారి ప‌ట్టుద‌ల‌, కృషి ఎంతో ఉంది. మొద‌ట్లో రెండు ఏళ్ల పాటు సిబ్బంది, పెట్టుబ‌డికి ఇబ్బంది ఎదురైనా మెల మెల్ల‌గా వ్యాపారం పుంజు కోవ‌డంతో ఏడాదికి 90 లక్ష‌ల ట‌ర్నోవ‌ర్ సాధించేలా చేసింది.
2 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో ప్రారంభం :

ఖాళీగా కూర్చోవ‌డం కంటే ఏదో ఒక ప‌ని చేయాలి. ఇంకొంద‌రికి ప‌ర్మినెంట్‌గా కొలువులు ఇవ్వాల‌నే ఉద్ధేశంతో శ్రీ‌మ‌తి క‌విత ఈ జ్యూట్ బ్యాగుల‌ త‌యారీని ఎంచుకున్నారు. ఇందు కోసం రా మెటీరియ‌ల్‌ను ఏలూరుతో పాటు చెన్నైలోని గుమ్మిడిపుండి నుండి తెప్పించారు. అక్క‌డికి వెళ్లాల్సిన ప‌ని లేకుండానే ఆర్డ‌ర్స్ ఇస్తే చాలు ఇక్క‌డికి పంపించే సౌలభ్యం ఉండ‌డంతో బ్యాగుల త‌యారీకి అడ్డంకులు లేకుండా పోయాయి. ఇక్క‌డ కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. జ్యూట్ బ్యాగులు, ఇత‌ర వ‌స్తువులు నాణ్య‌త‌తో పాటు వివిధ డిజైన్లు క్రియేట్ చేస్తుండ‌డంతో గిరాకీ పెరిగింది. జ్యూట్ క్లాత్ ఒక మీట‌ర్ కు 150 రూపాయ‌లు ఇది క్వాలిటీతో కూడుకున్న‌ది. దీనిని చెన్నై నుండి తెప్పిస్తారు. ఇంకో క్వాలిటి క‌లిగిన క్లాత్ ఏలూరు నుండి 90 రూపాయ‌లకు మీట‌ర్ చొప్పున రెండు వేల మీట‌ర్లు తీసుకుంటారు. ఒక బ్యాగు తయారు చేయాలంటే ముగ్గురు వ‌ర్క‌ర్లు అవ‌స‌ర‌మ‌వుతారు. మ‌రొక‌రు ఫైన‌ల్ గా ఫినిషింగ్ ఇస్తారు. ఒక్కొక్క‌రికి 6000 నుండి 7000 రూపాయ‌ల దాకా వీరికి వేత‌నాల రూపంలో ప్ర‌తి నెలా 22 మందికి చెల్లిస్తారు.

నేడు 90 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్‌తో రికార్డ్ :

సిరి జ్యూట్ క్రియేష‌న్స్‌లో 15 జ్యూట్ మిష‌న్లు ఉన్నాయి. 2000 మీట‌ర్ల జ్యూట్ క్లాత్ ఎప్పుడూ నిలువ వుండేలా చూసుకుంటారు. కుట్టు మిష‌న్ ను పోలిన విధంగా జ్యూట్ మిష‌న్లు ఉంటాయి. ఒక్కో మిష‌న్ ధ‌ర 25000 వేల రూపాయ‌లు. క‌టింగ్ మాస్ట‌ర్ కీల‌కం అత‌డికి ప్ర‌తి నెలా 16000 వేల రూపాయ‌లు ఇస్తారు. విద్యుత్ ఖ‌ర్చు 10,000 , వాట‌ర్ బిల్లు 2000, రూమ్ రెంట్ 20000 మొత్తం నెల‌కు 2,00,000 ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌ర్చ‌వుతోంది. మై హోం అధినేత శ్రీ‌మాన్ జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు ష‌ష్టి పూర్తి సంద‌ర్భంగా సిరి జ్యూట్ క్రియేషన్స్ ఆధ్వ‌ర్యంలో వృక్షో ర‌క్షితి ర‌క్షితః అనే పేరుతో జ్యూట్ బ్యాగులు స‌ర‌ఫ‌రా చేశారు. ఇవి వ‌చ్చిన వారిని బాగా ఆక‌ట్టుకున్నాయి. అక్క‌డి నుండి నేటి దాకా వారి వ్యాపారం పెరుగుతూ వ‌చ్చింది.

మ‌న‌సు దోచే బ్యాగులు ఇవే - వీరు త‌యారు చేస్తున్న బ్యాగులకు గిరాకీ పెరిగింది. సంస్థ‌లే కాకుండా మ‌హిళ‌లు, ఇత‌రులు కొనుగోలు చేయ‌డం ప్రారంభించారు. ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హానీ లేక పోవ‌డం, ప్ర‌భుత్వాలు ప్లాస్టిక్ బ్యాగులు వాడొద్దంటూ ప్ర‌చారం చేయ‌డం వీరికి క‌లిసొచ్చింది. ఇక్క‌డ 50 రూపాయ‌ల నుండి 1700 రూపాయ‌ల దాకా విలువ చేసే ర‌క‌రకాల బ్యాగులు ల‌భిస్తున్నాయి. పెళ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాల‌కు కూడా వాడుతున్నారు. తాంబూలం బ్యాగ్ 50 రూపాయ‌ల‌కు, ల్యాప్ టాప్ బ్యాగు 250 నుండి 500 రూపాయ‌లు, స్కూల్ బ్యాగ్ 500 నుండి 600 రూపాయ‌లు, ఫైల్ ప్యాడ్స్ 200 , ట్రావెల్ బ్యాగ్స్ 700, సూట్ కేసులు 1500, టేబుల్ మ్యాట్స్ 50 రూపాయ‌లు, వాల్ హ్యాంగింగ్స్ 500 నుండి 600, హ్యాండ్ బ్యాగ్స్ 200 నుండి 500 , ప‌ర్స్‌లు , వాలెట్స్ 150 నుండి 200 రూపాయ‌ల ధ‌ర‌లో స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ప్ర‌త్యేకించి స్టూడెంట్స్ ను దృష్టి లో పెట్టుకుని త‌యారు చేసిన కాలేజీ బ్యాగ్స్‌కు మంచి డిమాండ్ ఉంటోంది. వీటిని 200 నుండి 250 ధ‌ర‌లో విక్ర‌యిస్తున్నారు.

స్వీట్ షాపులు, గ‌వ‌ర్నెమెంట్ ఆఫీసులు - జ్యూట్ బ్యాగుల్లో నాణ్య‌త‌, డిఫ‌రెంట్ డిజైన్స్ ఉండడం మ‌రిన్ని ఆర్డ‌ర్స్ వ‌చ్చేలా చేశాయి. కెప్టెన్ రామారావు ఎమ‌రాల్డ్ స్వీట్ షాప్ అధినేత పాలేక‌ర్ విజ‌య్ రామ్‌ను వీరికి ప‌రిచ‌యం చేశారు. వారి దుకాణాల‌తో పాటు త‌న‌కు తెలిసిన దుకాణాలు, సంస్థ‌లకు వీరి బ్యాగుల గురించి విజ‌య్ రామ్ ప‌రిచ‌యం చేశారు. ఎమ‌రాల్డ్ స్వీట్ షాప్‌తో పాటు హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని ఆల్మండ్ హౌస్‌, ద‌మ‌న్ ఆర్గానిక్ ఫార్మాస్యూటిక‌ల్స్ కంపెనీకి స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన అసిస్టెంట్ స్టాఫ్ కాలేజీ ఆప్ ఇండియా, ఆంద్రా బ్యాంకు, ఎస్ బి హెచ్ బ్యాంకు, ఎక‌నామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కార్యాల‌యాల‌కు ఇస్తున్నారు.

శ్రీ స్వామి వారి కృప‌తోనే సాధ్య‌మైంది :

నాంప‌ల్లిలో వున్న నేష‌న‌ల్ జ్యూట్ బోర్డు ఆఫీసులో ప‌నిచేస్తున్న న‌ర్సిములు గారి స‌హ‌కారం ఉంటోంద‌ని అంటారు శ్రీ‌మ‌తి క‌విత‌. జ్యూట్ బ్యాగ్స్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఎగ్జిబిష‌న్స్ సంద‌ర్భంగా స్టాల్ ఏర్పాటు చేసుకునేలా చేశార‌ని తెలిపారు. ప్ర‌తి సంవ‌త్స‌రం 8 సార్లు ఎగ్జిబిష‌న్స్ నిర్వ‌హిస్తారు. విశాఖ ప‌ట్ట‌ణం, హైద‌రాబాద్‌, కాకినాడ‌, గోవా, ముంబై, బెంగ‌ళూరు, పూణె ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎగ్జిబిష‌న్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రెండు సార్లు అవ‌కాశం వ‌చ్చినా వీసా ల‌భించ‌క పోవ‌డం వ‌ల్ల తాను వెళ్ల‌లేక పోయాన‌ని శ్రీ‌మ‌తి క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే అమెరికాలో ఏర్పాటు చేసిన ఇండియ‌న్ కంపెనీల‌తో పాటు యుఎస్ లోని రైస్ ల‌వ్ సంస్థ‌కు త‌మ ఉత్ప‌త్తుల‌ను పంపించామ‌ని తెలిపారు. ఆ సంస్థ‌కు చెందిన వారు హైద‌రాబాద్‌కు వ‌చ్చి ఇక్క‌డ ప‌నిచేస్తున్న వారికి దుస్తులు, బియ్యం ఇవ్వ‌డంతో పాటు ఒక‌రోజంతా వీరితో గ‌డిపారు. ఇది మ‌రిచి పోలేని జ్ఞాప‌క‌మంటారు ఆమె. ఎవ్వ‌రి వ‌ద్ద‌కు వెళ్లాల్సిన ప‌ని లేకుండానే ఆర్డ‌ర్స్ త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్నాయ‌ని అంటారు. ఇదంతా స్వామి వారి కృప వ‌ల్ల‌నే సాధ్య‌మైందంటారు. పాలేక‌ర్ విజ‌య‌రామ్ ప్ర‌తి ఏటా గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి 4000 వేల బ్యాగులు, విత్త‌నోత్ప‌త్తి కార్య‌క్ర‌మానికి 10000 బ్యాగులు ఆర్డ‌ర్ ఇస్తారని తెలిపారు.

సిరి జ్యూట్ క్రియేష‌న్స్ సాధించిన విజ‌యం :

ఊరికే కూర్చుంటే కొండ‌లైనా క‌రిగి పోతాయి. మ‌నం క‌ష్ట‌ప‌డితే ఫ‌లితం త‌ప్ప‌కుండా వ‌స్తుందంటారు. కేవ‌లం 5 ల‌క్ష‌ల రూపాయ‌ల పెట్టుబ‌డితో జ్యూట్ బ్యాగుల త‌యారీ కేంద్రాన్ని నెల‌కొల్ప‌వ‌చ్చంటారు. ఆస‌క్తి వున్న వారు ఎవ‌రైనా ఏర్పాటు చేయాల‌న‌కుంటే స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో పాటు మార్కెటింగ్ సౌక‌ర్యం క‌ల్పిస్తామంటున్నారు. త‌యారు చేసిన వాటిని తామే తీసుకుంటామ‌ని దీని వ‌ల్ల మ‌ధ్య ద‌ళారీల బెడ‌ద ఉండ‌దంటారు. ప్ర‌స్తుతం లాభ న‌ష్టాలు లేకుండా నడుస్తున్న త‌మ సిరి జ్యూట్ క్రియేష‌న్స్‌ను 100 మంది ప‌నిచేసే అతి పెద్ద కంపెనీగా తీర్చిదిద్దాల‌న్న‌దే త‌న ఆశ‌య‌మ‌ని అంటారు బోయ‌న‌ప‌ల్లి క‌విత‌. చుట్టూరా వున్న చిమ్మ చీక‌టిని తిడుతూ కూర్చోవ‌డం కంటే చిరు దీప‌మైనా వెలిగిస్తే చాలంటారు. ఎవ‌రినీ ఆశించ‌కుండా ఇంకెవ‌రికీ త‌ల‌వంచ‌కుండా స్వ‌శ‌క్తినే న‌మ్ముకున్న వీరి సంక‌ల్పం భ‌గ‌వ‌త్ బంధువుల‌కు , ఇత‌రుల‌కు స్ఫూర్తి కావాల‌ని కోరుకుందాం.

No comments