జయహో జయేష్ గురించి ప్రత్యేక కథనం..!
దేశ వ్యాప్తంగా ఐటీ రంగంలో తెలంగాణ ఐటీ హబ్ తనదైన ఒరవడితో ముందుకు దూసుకు వెళుతోంది. పాలనాపరంగా ఉన్నతాధికారులలో సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి జయేష్ రంజన్ తనదైన ముద్రతో ఐటీ రంగానికి జవసత్వాలను కలుగజేస్తున్నారు. కొంగొత్త ఆలోచనలతో తమకంటూ ఓ ప్రత్యేకతను కావాలని కోరుకునే నేటి తరం యువతరానికి ఆయన ఓ దిక్సూచిలా..మరో రకంగా చెప్పాలంటే వారధిలాగా నిలబడ్డారు.
ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ పేరు విస్మరించలేని నగరంగా విరాజిల్లుతోందంటే అదంతా జయేష్ రంజన్ చలవేనని చెప్పక తప్పదు. ఇంకో వైపు డిజిటల్ మీడియా రంగం డైరెక్టర్‌గా కొణతం దిలీప్ రెడ్డి ఉన్నప్పటికీ జయేష్ మాత్రం ఒన్ మేన్ ఆర్మీ లాగా ఒంటరి పోరు చేస్తున్నారు. లెక్కకు మించి వందలాది ఐటీ దిగ్గజాలు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడంలో ఆయన కీలక భూమిక పోషించారు. జయేష్ లేకపోతే ఐటీ పరిశ్రమలో కొత్త కంపెనీలు వచ్చేవి కావన్న ప్రచారం ఉన్నది.
ఏది ఏమైనప్పటికీ ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాకు ఐటీ కారిడార్‌ను టీఎస్ సర్కార్ ప్రకటించింది. రెండుసార్లు ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఇక్కడికి వచ్చారు. అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఊహించని విధంగా 250 ఎకరాలను జిల్లా యంత్రాంగం ఐటీ కారిడార్‌కు కేటాయించింది. ఎన్ ఆర్ ఐలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా..కొత్తగా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా జయేష్ రంజన్ కృషి చేస్తున్నారు.
కేరళ, తమిళనాడు, బెంగళూరులలో లాగా మండలాలలో కూడా బి.పి.ఓ కేంద్రాలను ఏర్పాటు చేయగలిగితే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దొరికినట్టవుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద కోట్లు కలిగిన వ్యక్తులు, వ్యవస్థలు, కంపెనీలు ఈ జిల్లాలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా వాసుల కోరిక. పాలకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయిన తర్వాత కొలువుల భర్తీకి దూరంగా ఉంటున్నారు.
ఈ సమయంలో ఒకే ఒక్క ఆశ ఐటీ కారిడార్ ద్వారానైనా జయేష్ రంజన్ దృష్టి సారిస్తే కొత్త కంపెనీలు స్థాపించేందుకు అవకాశం ఏర్పడుతుంది. జయేష్ వల్ల ఐటీ వెలిగిపోతోంది. ఆ వెలుగే కేటీఆర్‌కు ప్రచారం వచ్చేలా చేస్తోంది. ఇకనైనా సర్కార్ కళ్లు తెరవాలి.ఐటీ జపం కాకుండా ప్రజలకు , సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలి. లేకపోతే యువతీ యువకుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్నది గుర్తించాలి.
Post a Comment