Header Ads

కందుల సేక‌ర‌ణ‌తో కోట్ల వ్యాపారం - మ‌హిళా సంఘాల విజ‌యం

ఒక్క‌రైతే ఒంట‌రే..ఏక‌మైతే ఏదైనా సాధించ‌గ‌ల‌మ‌ని ఈ మ‌హిళ‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. వీరు సాధించిన విజ‌యం ఆషామాషీది కాదు. ఎలాంటి బిజినెస్ కోర్సులు చ‌దువు కోలేదు. పెట్టుబడులు పెట్ట‌లేదు. కంపెనీలు ఏర్పాటు చేయ‌లేదు. వారు చేసిందల్లా మ‌హిళ‌లంతా ఒక్క‌టై మ‌హిళా సంఘాలుగా ఏర్పాటు కావ‌డం. ఏక కాలంలో 5 కోట్ల 50 ల‌క్షల వ్యాపారం చేయ‌డం ఓ రికార్డు. రోజుకో రూపాయి చొప్పున పొదుపు చేస్తారు. ప్ర‌తి వారం మీటింగ్‌లు పెట్టుకుంటారు. తెలంగాణ‌లో మ‌హిళా సంఘాలు స్వ‌యం స‌మృద్ధి దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి. పూర్వ‌పు పాల‌మూరు జిల్లా కోడంగ‌ల్ కందుల సాగుకు పెట్టింది పేరు. ఇపుడ‌ది కొత్త జిల్లా వికారాబాద్ జిల్లాకు మారి పోయింది. కోస్గి, దౌల్తాబాద్‌, మ‌ద్దూరు, బొంరాస్‌పేట‌, కోడంగ‌ల్ మండ‌లాల్లోని అన్ని ఊర్ల‌లో కందుల‌ను అత్య‌ధికంగా సాగు చేస్తారు. ఇక్క‌డ ఎక్క‌డికి వెళ్లినా తాళాలు వేసిన ఇళ్లే క‌నిపిస్తాయి. క‌ర‌వుకు పెట్ట‌ని కోట‌. ఇక్క‌డ మొద‌ట్లో వెలుగు ప్రాజెక్టు ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత ఇందిరా క్రాంతి ప‌థంగా దీనిని మార్చారు. జిల్లా మ‌హిళా స‌మాఖ్య‌, మండ‌ల మ‌హిళా స‌మాఖ్య‌, గ్రామైక్య సంఘంగా ఏర్ప‌డ్డాయి. ఇది పూర్తిగా ప్ర‌భుత్వ స‌హ‌కారంతోనే ఏర్పాటై లావాదేవీలు నిర్వ‌హిస్తారు.ఈ ప్రాంతం క‌ర‌వుకు లోనైంది. ఎంత మంది పాల‌కులు వ‌చ్చినా ఇక్క‌డి ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పులు రాలేదు. నేటికీ వ‌ల‌స‌లే బ‌తుకు దెరువు. దీనిని నివారించేందుకు..అరిక‌ట్టేందుకు ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గిస్తున్నారు. వారి ద్వారా ప‌నులు అందేలా చేస్తున్నారు. వ్య‌వ‌సాయ‌మే ఇక్క‌డ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. ప‌రిశ్ర‌మ‌లు లేవు. క‌ర్ణాట‌క‌, ఏపీ, తెలంగాణ‌ల‌కు కేంద్ర బిందువుగా కోడంగ‌ల్ , వికారాబాద్ ప్రాంతాలున్నాయి. ఏ ఊరుకు వెళ్లినా కందులే ద‌ర్శ‌న‌మిస్తాయి. ప్ర‌తి పొలంలో కంది పంట సాగై ఉంటుంది. ప్ర‌తి గ‌డ‌ప ముందు కందులే ఉంటాయి. దీనికి ద‌గ్గ‌ర‌లోనే తాండూరు ఉంది. ఇక్క‌డ కందిప‌ప్పు ప‌రిశ్ర‌మ‌లు అధికంగా ఏర్పాట‌య్యాయి. బ్రోక‌ర్లు, మ‌ధ్య ద‌ళారీలు రైతుల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకుని ల‌క్ష‌లాది రూపాయ‌లు కొల్ల‌గొట్టారు.

మ‌ధ్య‌ద‌ళారీ వ్య‌వ‌స్థ‌కు మ‌హిళా సంఘాలు మంగ‌ళం పాడాయి. కందుల‌ను కొనుగోలు చేసి వారే వ్యాపారం చేసేలా కందుల కొనుగోలు క‌మిటీగా ఏర్పాట‌య్యారు. వీరే తూకాలు వేసుకుంటారు. వీరే లెక్క‌లు రాస్తారు. సేక‌ర‌ణ చేసినందుకు కొంత రుసుము తీసుకుంటారు. దీని వ‌ల్ల రైతుల‌కు ర‌వాణా భారం త‌గ్గుతుంది. మోసం జ‌ర‌గ‌దు. త‌మ ఊరులోనే ..త‌మ‌కు తెలిసిన వారే..పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుంది. జిల్లా స‌మాఖ్య ఆధ్వ‌ర్యంలో కొనుగోలు చేసి..ప్ర‌త్యేకంగా దౌల్తాబాద్‌తో పాటు ప‌లు గ్రామాల్లో కొనుగోలు చేసిన ధాన్యాల‌ను నిల్వ ఉంచేందుకు గోదాములు నిర్మించారు. ఇదంతా మ‌హిళా సంఘాలు సాధించిన ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం. వీరికి తోడుగా ఐకేపీ సిబ్బంది బుక్ కీప‌ర్లు, సీసీలు, ఏపీఎంలు, డీపీఎంలు ఉంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు జిల్లా స్థాయిలో ప్రాజెక్టు ప‌థ‌క సంచాల‌కులు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తారు. సంఘాల ప‌నితీరు గురించి జిల్లా క‌లెక్ట‌ర్ రివ్యూ చేస్తారు.

హ‌స్నాబాద్‌, అంగ‌డి రాయిచూర్‌, కోడంగ‌ల్ ప్రాంతాల‌కు చెందిన మ‌హిళా సంఘాలు కందుల కొనుగోలు క‌మిటీగా సంయుక్తంగా ఏర్పాట‌య్యాయి. మూడు వేల మంది మ‌హిళ‌లు..రికార్డు స్థాయిలో ట‌న్నుల కొద్దీ కందుల‌ను సేక‌రించారు. 2016-2017 సంవ‌త్స‌ర కాలంలో 15 .5 కోట్ల వ్యాపారం చేసి చ‌రిత్ర సృష్టించారు. కోడంగ‌ల్ నుండి 3 కోట్ల వ్యాపారం చేయ‌గా..హ‌స్నాబాద్ నుండి 7.7 కోట్లు, అంగ‌డి రాయిచూర్ నుండి 6.61 కోట్ల కందుల వ్యాపారం చేసి ఔరా అనిపించారు. వీరు సాధించిన వ్యాపార విజ‌యం ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచింది. 2015లో ఎక‌నామిక్ టైమ్స్ హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన స‌క్సెస్ స‌మ్మిట్‌లో హ‌స్నాబాద్ కందుల కొనుగోలు సంఘాన్ని అవార్డుతో స‌త్క‌రించింది. ఒక్క‌రిగా ఉండడం వ‌ల్ల ఏం లాభం..క‌లిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించ‌వ‌చ్చు అన్న‌ది ఈ మ‌హిళ‌ల‌ను చూస్తే తెలుస్తుంది.

No comments