విమానాలకు తెలుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా..?
మీరు విమానాలను ఎప్పుడైనా చూశారా..? ఇదేం ప్రశ్న..? విమానాలను చూడని వారుంటారా ఎవరైనా..? అని అడగబోతున్నారా..? అయితే మీరు అంటోంది కరెక్టే. కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది విమానాలను చూశారా, చూడలేదా అన్న దాని గురించి మాత్రం కాదు. విమానం రంగును గురించి. అవును, రంగే. ఇంతకీ మీరు ఇప్పటి వరకు ఎన్ని విమానాలను చూశారు..? వాటికి ఉన్న రంగు ఏమిటో గుర్తుందా..? ఆ… గుర్తుంది, తెలుపు రంగు ఉంటుంది. విమానం ముందు వెనుక భాగాల్లో, రెక్కలకు మాత్రమే పలు విభిన్నమైన రంగులు ఉంటాయి. కానీ విమానం మొత్తాన్ని చూస్తే దానికి తెలుపు రంగే ఎక్కువగా ఉంటుంది. అయితే ఏంటి అంటారా..? ఏం లేదండీ… విమానాలకు అసలు తెలుపు రంగునే ఎందుకు వేస్తారో, దాని వెనుక ఏమైనా సైంటిఫిక్ కారణాలు ఉన్నాయా అన్న విషయాలను తెలపడం కోసమే విమానం రంగును గురించి అడిగాం. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందామా.
* విమానాలకు తెలుపు రంగునే వేయడానికి కారణం ఏమిటంటే తెలుపు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అంతేకాకుండా తెలుపు రంగు పూసిన విమానాలను నిర్వహించడం చాలా తేలిక. అదే ఇతర రంగులైతే త్వరగా వెలసిపోతాయి. కాబట్టి వాటికి ఎప్పటికప్పుడు రంగులు వేయాల్సి ఉంటుంది. దీంతో వాటి నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. అందుకే విమానాలకు తెలుపు రంగు వేస్తారు.
* వేరే రంగులన్నీ సూర్యుని కాంతి నుంచి వచ్చే ఉష్ణాన్ని ఎంతో కొంత మొత్తంలో లోపలికి గ్రహిస్తాయి. దీని వల్ల విమానంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, అది ఏసీలపై ప్రభావాన్ని చూపుతుంది. అదే తెలుపు అయితే సూర్యకాంతిని మొత్తం బయటికి పరివర్తనం చెందిస్తుంది. లోపలికి తీసుకోదు. దీని వల్ల విమానంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఏసీలు బాగా పనిచేస్తాయి.
* ఆకాశంలో ఉన్నా, భూమిపై ఉన్నా తెలుపు రంగులో ఉన్న వస్తువులకు ఉన్న స్పష్టత మరే ఇతర రంగులతో ఉన్న వస్తువులకు కూడా ఉండదు. దీని వల్ల తెలుపు రంగులో ఉన్న వస్తువులు మన కళ్లకు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. దీంతో విమానంపై ఏ చిన్న పగులు ఏర్పడ్డా, విజిబుల్‌గా ఏ లోపం ఉన్నా వెంటనే తెలిసిపోయి విమానం సిబ్బంది జాగ్రత్త పడవచ్చు.
* విమానాలను నడిపించే కంపెనీలు వాటిని తిరిగి రీసేల్ చేయడం చాలా తేలికవుతుంది. వాటిని కొనుగోలు చేసిన వేరే కంపెనీలు వాటిపై ఉన్న లోగోలను, ఇతర మార్క్‌లను మాత్రమే తొలగిస్తే చాలు, వెంటనే వారు వాటిని తమ కంపెనీ కోసం వాడుకోవచ్చు. అదే ఇతర రంగులు ఉంటే వాటన్నింటినీ తొలగించి వాడుకోవాలంటే కొంత ఖర్చవుతుంది. కనుకే విమానాలకు తెలుపు రంగు వేయిస్తారు.
Post a Comment