వరలక్ష్మీ నీకో సలాం - లైంగిక వేధింపులపై సంచలన కామెంట్స్..!
ఎన్నికల వేళ..దేశ మంతా చర్చించు కోవాల్సిన సమయంలో ఉన్నట్టుండి ఓ మహిళ లైంగిక వేధింపులపై చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. జాతి యావత్తు ఎవరీమె..ఎంతటి ధైర్యం..అనుకుంటూ ..ఆమె కోసం సెర్చింగ్ చేయడం మొదలు పెట్టాయి. సోషల్ మీడియా దిగ్గజం గూగుల్‌లో ఆమె పేరుతో లక్షలాది మంది వెతికారు. ఇంతగా ప్రాచుర్యం పొందిన ఆమె ..ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు ..వరలక్ష్మీ శరత్ కుమార్.
ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను కాదని ఆమె కోసం నెటిజన్లు వెదికారంటే అర్థం చేసుకోవాలని ఆమె చూపిన తెగువకు మెచ్చుకోవాల్సిందే. ఆమె చేసిందల్లా ఒక్కటే. సినిమా రంగంలో తమకంటూ హక్కులున్నాయని..లైంగిక వేధింపులు ఉన్నాయని కుండ బద్దలు కొట్టింది. దెబ్బకు దేశ వ్యాప్తంగా కోలివుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంతా ఆమె మాటలపైనే దృష్టి కేంద్రీకరించాయి. నటనా పరంగా ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మీ ఇపుడు తోటి తారలకు ఓ భరోసా..ఓ ఐకాన్. బాధితుల పక్షాన ఓ గొంతుక.
మేమూ మనుషులమే. మాకూ రక్తమాంసాలున్నాయి. మమ్మల్ని మనుషులుగా చూడటం లేదు. మేమూ రోజంతా కష్టపడుతున్నాం. ప్రతి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. ఎపుడు వస్తుందో తెలియక ఎందరో ఈ కలల ప్రపంచం కోసం వేచి చూస్తున్నారు. నాలాంటి వాళ్లకే ఇలా వుంటే..ఇక ఎవ్వరి సహకారం, ప్రోత్సాహం లేకుండా వచ్చే వారి పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించు కోవచ్చని ఆవేదన చెందుతున్నారు వరలక్ష్మీ. లైఫ్‌ను ..సోసైటీని ప్రభావితం చేసే సినిమా రంగంలో కావాల్సినంత ప్రతిభ కలిగిన నటీనటులున్నారు.
ఒక్క ఛాన్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సింది పోయి..వివక్షకు గురి చేస్తున్నారు. వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఇపుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రశ్నించగలం..చెప్పండి అంటూ వరలక్ష్మీ తన గొంతును వినిపించారు. దీంతో ఒక్కసారిగా దేశం అలర్ట్ అయ్యింది. ఆమె మాటలను విన్నది. ఎందరికో బలాన్ని ఇచ్చింది. ఆమెకు అండగా వేలాది గొంతుకలు కలిపాయి. తమకు జరిగిన అన్యాయం గురించి. మోసపోయిన దాని గురించి ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పటి దాకా అవకాశాల పేరుతో మోసం చేసిన వారి బండారాన్ని బట్ట బయలు చేశారు.
మీటూ ఉద్యమం దెబ్బకు సెలబ్రెటీలు, పేరొందిన వాళ్లు..ఫేమస్ పర్సనాలిటీలు అందరూ వణికి పోతున్నారు. ఎక్కడ తమ చేష్టల గురించి బయటకు వస్తుందోనని జడుసుకుంటున్నారు. నిన్నటి దాకా నోరు విప్పని వారంతా వేడుకునే పరిస్థితికి దిగజారారు. చాలా మందిపై ఆరోపణలు వస్తూనే వున్నవి. ప్రపంచ వ్యాప్తంగా తన వాయిస్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిన్మయి శ్రీపాద ..ప్రముఖ పాటల రచయిత వైర ముత్తుపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లైంగికంగా వేధింపులకు గురి చేయబోయాడంటూ వాపోయింది. దీంతో ఒక్కసారిగా ఆయనకున్న పేరు పోయింది. దీనిపై వైరముత్తు ఖండించలేదు..
క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఇది వాస్తవం. దీనిని కాదనలేం. అప్పుడూ వుంది..ఇప్పుడూ వుంది. కావాల్సిందల్లా బయటకు వచ్చి చెప్పుకోవడమే. మనమంతా ఒక్కటిగా మనదైన వాయిస్‌ను వినిపించాలి. ఈ దేశం పట్టించుకోక పోతేనేం..ప్రపంచంలో మనంలాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. వారంతా మన న్యాయమైన గొంతుకు సపోర్ట్ గా నిలుస్తారంటారు వరలక్ష్మీ. తమిళ సినిమా ఆమె మాటలతో కదిలి పోయింది. ఎందరో తారలు.. మౌనంగా ఉన్న వారంతా మెల మెల్లగా తమ గొంతులను సవరించు కుంటున్నారు. బయటకు వచ్చి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇదో మంచి పరిణామం అంటారామె.
సినిమా అంటే వినోదం కాదు..అది రియల్ జీవితాన్ని వ్యక్త పరిచే పరికరం..అందుకే రియలిస్టిక్ క్యారెక్టర్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నానని స్పష్టం చేస్తున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. కథను బట్టి పాత్రలను పోషిస్తా. ప్రతి మహిళకు ఓ మనసుంది..హృదయం ఉంది. తనకంటూ స్వేచ్ఛ ఉంది. ఆమెకంటూ తనదైన ప్రపంచం ఉంది. అది గుర్తించే వాళ్లతోనే నా ప్రయాణం. తోటి స్త్రీలను గౌరవించని ఏ సమాజమైనా, సినిమా రంగమైనా..లేక ఏ రంగమైనా ముందుకు వెళ్లదంటోంది ఆమె. కాదనడానికి మనమెవ్వరం..కదూ..!
రచయిత - డాక్టర్ విజయ భాస్కర్.
Post a Comment