Header Ads

ఆత్మ విశ్వాసం ఆమె ఆయుధం - స్మితా సబర్వాల్

స్మితా సబర్వాల్ ఈ పేరు వినని వారంటూ ఉండరు. అంతగా ప్రాచుర్యం పొందారు. నిఖార్సైన అధికారిణిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ప్రజల మెప్పు పొందారు. జనం గుండెల్లో పదిలంగా వున్నారు. ఇప్పటికీ ఆమె కోసం పేదోళ్లు ఎదురు చూస్తూనే వుంటారంటే న‌మ్మ‌గ‌ల‌మా..ఇది ముమ్మాటికి నిజం. ఆమె ఎక్కడికి వెళ్లినా సరే అధికార దర్పానికి దూరంగా వున్నారు. జ‌నం మధ్యే వున్నారు. ఏనాడు తన రాజసాన్ని , అధికార ద‌ర్పాన్ని ప్రదర్శించలేదు. అందుకే ఆమెకు వేలాదిగా ఫ్యాన్స్ ఉన్నారు.
నిక్కచ్చిగా ఉండటం. నిబద్దతతో పని చేయడం స్మితా స‌బ‌ర్వాల్ ప్రత్యేకత. చిన్న వయసులోనే ఆమె దేశంలోనే అత్యున్నతమైన సర్వీస్ గా భావించే ఐఏఎస్ పరీక్షల్లో టాప్ వన్ గా నిలిచారు. పని చేసిన ప్రతి చోటా ఆమె ప్రజల మన్ననలు చూరగొన్నారు. విద్య , వైద్యం , ఆరోగ్యం , మహిళాభివృద్ది , సామాజిక అంతరాలు లేని సమాజం కోసం స్మితా సబర్వాల్ అలుపెరుగని కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలను ఆమె మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ప్రత్యేకంగా గుర్తించి..స‌హాయం చేశారు.

స్వాతంత్ర సమర యోధులను ఘనంగా సన్మానం చేసారు. సమున్నతంగా సత్కారం చేశారు. కరీంనగర్ జిల్లాలో పనిచేసిన సమయంలో జనంలో నమ్మకాన్ని పెంచారు. అధికారులంటే మనుషులేనని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు సమర్దవంతంగా భాద్యతలు నిర్వర్తించేలా కింది నుంచి పై స్థాయి వరకు సిబ్బంది , ఉద్యోగులను ముందుండి నడిపించారు. అంతేనా ఆమె రేయింబవళ్లు జిల్లా అభివృద్ధి కోసం పాటు పడ్డారు. రాజకీయ వత్తిళ్ళను తట్టుకున్నారు . తాను జనం మనిషినని నిరూపించుకున్నారు. పేదలు, రైతులు, భాదితులకు అండగా ఉన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యేలా అహర్నిశలు కృషి చేశారు. అలసత్వాన్ని ప్రదర్శించిన వారిపై చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఏ పని అప్పగించినా సక్సెస్ చేసారు. ఇదీ ఆమెకు ఓ ఆసెట్ గా మారింది . ఉన్నట్టుండి మెదక్ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయినా అక్కడ కూడా తన మార్క్ ఉండేలా చేసారు . పని దొంగల భరతం పట్టారు. ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విధులకు ఎగనామం పెడుతున్న పంతుళ్ళకు చుక్కలు చూపించారు.

అంతేనా ప్రభుత్వ పరంగా ఎన్నో రాయితీలు పొందుతూ లాభాలు గ‌డిస్తున్న కంపెనీలు .. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2 శాతం నిధులు ఖర్చు చేసేలా చర్యలు తీసుకున్నారు. కోట్లాది రూపాయలు సర్కార్ కు అందేలా చేశారు. బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. పని చేయకుండా రాజకీయాలు చేసే వారిని సరెండర్ చేశారు. ఓ మహిళగా తానేమిటో ప్రజలకు ఎలా సేవ చేయొచ్చో ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఎక్కడా లొంగ లేదు . ఎవరికీ జై కొట్టలేదు.అంద‌రికీ చుక్క‌లు చూపిస్తుండ‌డంతో త‌ట్టుకోలేక అప్ప‌టి ప్ర‌భుత్వం ఆమెను ప‌నిగ‌ట్టుకుని మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా బదిలీ చేసింది. అక్క‌డ కొద్ది రోజులే ఉన్నారు. అయినా త‌న ప‌నితీరు మార్చుకోలేదు. స్మిత సబర్వాల్ సంచలనాత్మక మైన నిర్ణయాలు తీసుకున్నారు . పంటలు పండించే రైతుల కోసం ఎన్నో చేశారు. మార్కెట్ యార్డుల్లో మధ్య దళారీల మోసాలకు అడ్డుకట్ట వేశారు. అంతేనా వారి ధాన్యం స్వేచ్చ్గగా అమ్ముకునేలా చర్యలు చేపట్టారు. అమ్మిన డబ్బులు నేరుగా అన్నదాతల ఖాతాల్లో జమ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అది అప్పట్లో ఓ రికార్డ్. రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి నిర్ణ‌యంగా ప్ర‌శంస‌లు ల‌భించాయి.

నీతి .. నిజాయితీ .. నిబద్దత ..ధర్మం ..కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే అధికారిణిగా ఆమె స్వల్ప కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె సాధించిన ప్రగతి , చేపట్టిన పనులు .. విజయాలు పరిగణలోకి తీసుకున్నది. చిన్న వయస్సులోనే సీఎంఓ కార్యాలయంలోకి తీసుకున్నది. కొత్త సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లేలా ఆమె భాద్యతలు నిర్వహిస్తోంది. ఇటీవల కొన్ని ఆరోపణలు వచ్చినా ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. దేశంలోని కోట్లాది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.

మహిళా ప్రపంచంలో ఆమె లాంటి వాళ్ళు ఉండటం అరుదు. గొప్పనైన అధికారిణిగా .. పేద ప్రజల ఆశాజ్యోతిగా ..స్మితా సబర్వాల్ ఇప్పుడు నిలుస్తున్నారు. రేపటి తరాలకు భవిష్యత్తు పట్ల మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నారు.మనం ఎంచుకున్న మార్గం సరైనది అనుకుంటే దాని కోసం పాటు పడాలి . ఇవ్వాళ కాకపోయినా రేపటి ఉదయం మనదే అవుతుందన్న ఆమె మాటలు అక్షర సత్యాలు కాదంటారా..!

No comments