ఆ యువకుడికి ఎవరికీ సొంతం కానీ ఓ ల్యాండ్ దొరికింది..! నేనే “కింగ్” అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు.!చివరికి ఏమైంది?
ఏదైనా ప్రదేశానికి రాజుగా ఉండే అధికారం మీకు వచ్చిందనుకోండి..! అప్పుడేం చేస్తారు ? ఎవరైనా ఏం చేస్తారు. రాజు ఎలా చేస్తాడో అలాగే చేస్తారు. చుట్టూ ఉన్న వారికి ఆదేశాలు ఇస్తారు. తాను చెప్పిందే మాట. ఏం చేసినా చెల్లుతుంది. దీనికి తోడు రాజభోగాలు ఉంటాయి. అయితే అది కరెక్టే. ఇప్పుడు మేం చెప్పబోయే ఆ యువకుడు కూడా ఆ ప్రాంతానికి రాజు అయ్యాడు. అవును, మీరు విన్నది కరెక్టే. అయితే అతనికి రాజ విలాసం లేదు. భవనాలు లేవు. పనివారు లేరు. అసలు ఆ ప్రాంతంలో అతను రాజు అనేమాటే గానే అతనొక్కడే ఉన్నాడు. వేరే ఎవరూ లేరు. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా..! అయినా మేం చెబుతోంది నిజమే..! కావాలంటే అతనెవరో మీరే తెలుసుకోండి..!
అతని పేరు సుయాష్ దీక్షిత్. ఇండియా వాసి. అయితే సుయాష్ ఈ మధ్యే ఈజిప్టుకు, సుడాన్‌కు మధ్య ఉన్న బిర్ తావిల్ అనే ప్రాంతానికి రాజు అయ్యాడు. అరె.. అతను అలా ఎలా రాజు అవుతాడు, అతన్ని ఎవరు చేశారు ? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అతను తనను తానే ఆ ప్రాంతానికి రాజుగా ప్రకటించుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతం ఏ దేశానికి చెందదు కాబట్టి. దాన్ని అన్క్లెయిమ్డ్ ల్యాండ్‌గా భావిస్తూ వస్తున్నారు. అంటే ఆ ప్రాంతం ఏ దేశానికి చెందనిది అని అర్థం. అందుకనే సుయాష్ ఆ ప్రాంతానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు.
అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది ? అనేగా మీ డౌట్. ఏమీ లేదండీ.. మీ లాగే అతనికి డౌట్ వచ్చింది. అందుకనే అనేక రూల్ బుక్స్ చదివాడు. ఇలాంటి ప్రాంతాలకు రాజు కావాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాడు. ఆ తరువాత సింపుల్‌గా ఆ ప్రాంతానికి వచ్చి ఒక విత్తనం నాటాడు. దానికి కొన్ని నీళ్లు పోశాడు. అంతే.. సింపుల్ రూల్స్ ప్రకారం అతను ఆ ప్రాంతానికి రాజు అయ్యాడు. కనుకనే తనను తాను ఆ ప్రాంతానికి రాజుగా ప్రకటించుకున్నాడు. అయితే మరి అతని దేశం పేరు తెలుసా ? కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్. అవును, అదే. అతని పేరునే దేశానికి పెట్టేశాడు.
అయితే సుయాష్ ఆ ప్రాంతానికి చేరుకునేందుకు చాలా కష్టపడ్డాడు. 2 రోజులు తన కారులో ఓ డ్రైవర్ సహాయంతో ప్రయాణించి కష్టాల నడుమ ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే నిజానికి ఆ ప్రాంతంలో టెర్రరిస్టులు తిరుగుతారట. అందుకని ఈజిప్టు మిలటరీ వారు అక్కడ గస్తీ తిరుగుతారు. ఇతరులు ఎవరైనా కనిపిస్తే టెర్రరిస్టు కింద భావించి ఏమీ అడగకుండానే కాల్చి వేస్తారు. ఈ క్రమంలోనే మొదట తన నిర్ణయాన్ని ఇంట్లో చెప్పగా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో వారికి చెప్పకుండానే సుయాష్ ఈ పని చేసి సక్సెస్ అయ్యాడు. అనంతరం తాను ఆ దేశానికి రాజు అయినట్టు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు ద్వారా తెలిపాడు.
ఇక సుయాష్ దేశ విస్తీర్ణం ఎంతో తెలుసా ? 800 చదరపు మైళ్లు ఉంటుంది. ఈ క్రమంలోనే తన దేశం కోసం ఒక జాతీయ జెండాను నిర్మించేపనిలో పడ్డాడు. ఇప్పటికే https://kingdomofdixit.gov.best పేరిట తన దేశ వెబ్‌సైట్‌ను అతను లాంచ్ చేశాడు. ఇక ఆ దేశానికి అధ్యక్షుడిగా సుయాష్ తన తండ్రిని ప్రకటించి ఆయనకు బర్త్ డే గిఫ్ట్‌ను ఆ రూపంలో అందజేశాడు. ప్రస్తుతం సుయాష్ తన దేశానికి హెడ్ ఆఫ్ ది మిలటరీగా, ప్రధానిగా కూడా ఉన్నాడు. ఇతర పోస్టులకు అప్లికేషన్లను ఆహ్వానిస్తున్నాడు. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ దేశానికి చెందిన ఏదైనా పోస్టులో దూరిపొండి మరి..!
Post a Comment