Header Ads

దీపావళి రోజున దీపాలు వెలిగిస్తే.. ఆ దోషాలు తొలగిపోతాయట.అవి ఏమిటో తెలుసుకోండి.?

మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. అంత అపురూపమైన దీపాల పండుగ దీపావళి. దీపావళితో మొదలుపెట్టి, కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంది. ఈ నెల అంతా సంధ్యాసమయంలో దీపాలు వెలిగించి, ఇంటి ముంగిట పెడతారు. కనీసం ఒక్క దీపాన్ని అయినా తులసికోట ముందు ఉంచితే మంచిదంటారు.




దీపావళి పండుగ అంటే అందరికి ఇష్టమే, ముఖ్యంగా పిల్లలకి మరీ ఇష్టం, టపాకాయలు కాలుస్తూ, సందడి చేస్తూ సంతోష పడిపోతారు. వ్యాపారాలు చేసే వ్యక్తులకు దీపావళి అంటే అత్యంత ఇష్టం మరియు శుభదాయకం అనుకుంటారు, దీపావళి పర్వ దినం నాడు, పని చేసే వాళ్ళకి ఏదో ఒకటి బహుమతి గా ఇస్తారు. లక్ష్మి దేవి ఎప్పటికి తమ పైన కరుణ కటాక్షం చూపాలని దీపావళి నాడు లక్ష్మి దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ ఎన్నో విధాలుగా మనకు ముఖ్యమైంది. ఈ రోజున ఎవరికైనా డబ్బులు అవసరమైతే లక్ష్మి దేవి వస్తుందని అని అంటారు. ఎవరికైనా ఆరోగ్యం కావాలంటే శక్తి వస్తుంది. ఎవరికైనా జ్ఞానం కావాలంటే సరస్వతి వస్తుంది. ఇవన్నీ మీ శ్రేయస్సుకు సోపానాలని కధల రూపంలో చెప్పటమే.


పురాణాల ప్రకారం దీపావళికి ముందు రోజును నరకచతుర్దశిగా పిలుస్తారు. అంతకుముందు రోజును కొందరు ధనత్రయోదశిగా ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాత రోజును బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే.. ఈ బలి పాడ్యమి. బలిచక్రవర్తిని మించిన దానశూరులుండరు. వజ్ర, వైఢూర్యాలు, మణిమాణిక్యాలు తదితర వస్తువులను దానమివ్వడం కాక, తన్ను తానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. బలిని, ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడ వుంది. కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు. ఉత్తరంలో దీపావళి ఐదు రోజుల పండుగ. దక్షిణంలో దీపావళి మూడునాళ్ల పండుగ. దీపావళి రోజున దీపాలు వెలిగించడం ద్వారా అపమృత్యువు దోషాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, మానవుడు యమమార్గాధికారంనుండి విముక్తుడవుతారని విశ్వాసం. దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని "కౌముదీమహోత్సవం" అని నిర్వచించినట్లుగాను, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. దీపావళి హిందువుల పండుగే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో ఈ పండుగను వేడుకగా చేసుకుంటున్నారు.

No comments