Header Ads

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సగం మంది నేర‌చ‌రితులే - ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం

ఇండియాను మ‌నీ ..మీడియా..మాఫియా రాజ్య‌మేలుతున్నాయి. వీటిని నియంత్రించాల‌ని అనుకోవ‌డం..ప్ర‌య‌త్నం చేయ‌డం భ్ర‌మ‌. కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు పాలిటిక్స్‌ను న‌డిపిస్తున్నారని అప్ప‌ట్లో కాన్షీరాం చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఒక‌ప్పుడు రాజ‌కీయం అంటేనే సామాజిక సేవ‌. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం. ప్ర‌భుత్వానికి జ‌జ‌నానికి మ‌ధ్య వార‌దిగా ఉండ‌డం. దేశం ఏర్ప‌ర్చుకున్న రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించ‌డం. ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షిస్తూ విలువే ప్రాతిప‌దిక‌గా పొలిటిక‌ల్ లీడ‌ర్లుగా ..ఆద‌ర్శ‌ప్రాయ‌మైన వ్య‌క్తులుగా పేరొందిన వాళ్లున్నారు. ఎక్క‌డో రైలు ప్ర‌మాదం జ‌రిగితే కేంద్ర ప‌ద‌వికి రాజీనామా చేసిన ఘ‌న‌త లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిది. మాణిక్ స‌ర్కార్ , మురార్జీదేశాయ్‌, వాజ్‌పేయి లాంటి నేత‌లు ఎంద‌రో ఉన్నా..అత్య‌ధికంగా ఆయా పార్టీల్లో ఉన్న వారు నేర చ‌రిత్ర క‌లిగి ఉండ‌డం ప్ర‌మాద‌క‌ర‌మైన సంకేతాల‌ను సూచిస్తున్నాయి.ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డ‌డం, హ‌త్యా రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌డం, ఆస్తులు కూడ‌గ‌ట్టు కోవ‌డం, బ్లాక్ మ‌నీని క‌లిగి ఉండ‌డం, రియ‌ల్ ఎస్టేట్ దందాలు చేప‌ట్ట‌డం, డ్ర‌గ్స్‌, మాఫియా డాన్‌ల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డం, వీరికి అధికారులు, పోలీసులు కొంత మంది మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం వ‌ల్ల పొలిటిక‌ల్ లీడ‌ర్లు అంటేనే ఏహ్య భావం క‌లుగుతోంది. 35 నుండి 45 శాతం మ‌ధ్య జ‌నం మాత్ర‌మే ఓట్ల‌ను వినియోగించు కోవ‌డం కూడా ఓ కార‌ణం. నిర‌క్ష‌ర్యాస‌త‌, పేద‌రికం, సామాజిక అంత‌రాలు , కుల‌, మ‌త భేదాలు, మూఢ న‌మ్మ‌కాలు, బాలిక‌లు, మ‌హిళ‌ల‌పై అంతులేని నేరాలు జ‌రుగుతున్నాయి. లెక్క‌లేన‌న్ని కేసులు న‌మోద‌య్యాయి. ఎన్నో కుంభ కోణాలు, మ‌రెన్నో ఆర్థిక నేరాలు..ఇండియాను అవినీతిలో టాప్‌లో ఉండేలా చేశాయి.

బాంబుల దాడులు, వ్య‌క్తిగ‌త హ‌త్య‌ల‌కు కొద‌వే లేదు. నేర‌మూ..రాజ‌కీయ‌మూ రెండూ క‌ల‌గ‌లిసి పోవ‌డం వ‌ల్ల పాలిటిక్స్ మ‌రింత ద‌రిద్రంగా త‌యార‌య్యాయి. అవినీతి, అక్ర‌మాలకు పాల్ప‌డుతూ నేర చ‌రిత్ర క‌లిగిన ప్ర‌జా ప్ర‌తినిధుల గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ చెప్పేందుకు ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో ఓ సంస్థ ప్ర‌తి ఏటా ప్ర‌క‌టిస్తూ వ‌స్తోంది. ఈసారి తెలంగాణ‌లో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల వివ‌రాలు సేక‌రించింది. ఈ సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల‌ను చూస్తే దిగ్భ్రాంతిక‌ర‌మైన వాస్త‌వం వెల్ల‌డైంది. అన్ని పార్టీలు టికెట్లు ఇచ్చిన అభ్య‌ర్థుల్లో అత్య‌ధికంగా అంటే 50 శాతానికి పైగా నేర చ‌రిత్ర క‌లిగిన వారున్నార‌ని పేర్కొంది.

ఎంఐఎం పార్టీ త‌ర‌పున 8 మంది అభ్య‌ర్థులు బ‌రిలో వుంటే..వారిలో 7 మంది నేర చ‌రిత్ర క‌లిగి ఉండ‌గా..కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ, టీడీపీలు క‌లిసి మ‌హాకూట‌మి త‌ర‌పున పోటీ చేస్తున్న 119 మంది అభ్య‌ర్థుల్లో 77 మందిపై కేసులు ఉన్నాయ‌ని ఎఫ్‌జీజీ వెల్ల‌డించింది. ఇక అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా 67 మంది కేసుల‌ను ఎదుర్కొంటున్నారు. బీజేపీ 118 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉండ‌గా 40 మంది నేర చ‌రిత్ర క‌లిగిన వారే ఉండ‌డం విశేషం.

అన్ని పార్టీలు మేనిఫెస్టోలో ప్ర‌జ‌ల ఆశ‌ల‌కు రెక్క‌లు తొడిగే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. పార‌ద‌ర్శ‌క పాల‌న అందిస్తామ‌ని హామీ ఇస్తున్నాయి. కానీ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాయి. ఏది ఏమైనా ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతం కానంత వ‌ర‌కు ఇలాంటి వారు నేత‌లుగా చెలామ‌ణి అవుతూనే ఉంటారు. ఓటు విలువైన‌ది..ఆయుధం కంటే బ‌ల‌మైన‌ది అన్న వాస్త‌వం గుర్తించాలి. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడు కోవాలి.

No comments