Header Ads

రియ‌ల్ ఎస్టేట్‌లో రారాజులు - వ్యాపారం.!!

ఓ వైపు నోట్ల ర‌ద్దు..మోడీ తీసుకున్న నిర్ణ‌యం దెబ్బ‌కు ఇండియ‌న్ మార్కెట్ ఇంకా కోలుకోలేదు. ఎన్ని సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టినా ..ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా ఇంకా కొలిక్కి రాలేదు. ఒడిదుడుల‌కు లోన‌వుతూనే వున్న‌ది. అన్నింటికి జీఎస్‌టీ జ‌పం చేయ‌డంతో మార్కెట్ రంగంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి వ‌చ్చిన దాంట్లో కొంత డ‌బ్బును దాచుకున్న బ్యాంకులు ఇపుడు ఖాళీ అవుతున్నాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని ఏర్పాటైన ఎనీ టైం మిష‌న్లు అంటే ఏటీఎంలు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఓ ర‌కంగా ఇది సంధికాలం అనే చెప్పాలి. జ‌నం త‌మ డ‌బ్బుల కోసం రోడ్ల మీద‌కు వ‌చ్చారు. ప‌స్తులున్నారు. ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. క‌ష్ట‌ప‌డ్డ డ‌బ్బులు ఉంటాయో ఊడిపోతాయో తెలీదు. బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించే ఆర్ బీ ఐ ఉందో లేదోన‌న్న అనుమానం కొంత ప‌రిజ్ఞానం క‌లిగిన వాళ్ల‌ను ఆలోచ‌న‌ల్లో ప‌డేశాయి.
ఐటీ, ఆయిల్ , స్టీల్, లాజిస్టిక్ రంగాలు కొంత ప‌ర్వాలేద‌నిపించినా ఆ మ‌ధ్య రియ‌ల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపింది మోడీ తీసుకున్న నిర్ణ‌యం. మాజీ గ‌వ‌ర్న‌ర్లు వృద్ధి రేటు విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు మ‌న ఆర్థిక‌రంగం ఎలాంటి ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటుందో తెలియ చేస్తుంది. దేశ‌మంత‌టా ఒకే ప‌న్ను విధానం పేరుతో బీజేపీ స‌ర్కార్ చేసిన హ‌డావుడి చ‌ప్పున చ‌ల్లారిపోయింది. జ‌నం నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంది. కొత్త నోట్లు బ్యాంకుల‌కు వ‌చ్చినా ..లావాదేవీలు జ‌రుగుతున్నా ఇంకా వినియోగదారులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇది మ‌రింత ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను సూచిస్తోంది. సిమెంట్‌, స్టీలు ,ఆయిల్ ప‌రిశ్ర‌మ‌ల‌పై నోట్ల ర‌ద్దు ప్ర‌భావం అధికంగా ప‌డింది. రిజిస్ట్రేష‌న్లు చేసుకోలేక‌..కొనుగోలుదారులు వెన‌క్కి మ‌ళ్లిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు.

నిర్మాణ రంగం లో కొంత స్థ‌బ్ద‌త ఏర్ప‌డింది. మెల మెల్ల‌గా కొంత క‌ద‌లిక ప్రారంభ‌మైంది. రియ‌ల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. కేంద్ర స‌ర్కార్ ప్ర‌తి ఒక్క‌రికి ఇల్లు ఉండాల‌నే ఉద్ధేశంతో ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి ఆవాజ్ యోజ‌న ప‌థ‌కం ల‌క్ష‌లాది మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు క‌ల్ప‌త‌రువుగా మారింది. ఐటీ పుణ్య‌మా అంటూ ఇండియ‌న్స్ అమెరికాను ఆశ్ర‌యించ‌డం..కోట్లు వెన‌కేసు కోవ‌డం..వారంతా ప్లాట్లు, ఫ్లాట్స్‌, ల‌గ్జ‌రీ భ‌వ‌నాల‌పై దృస్టి పెట్ట‌డంతో..రియ‌ల్ కంపెనీలు కాసుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. క‌స్ట‌మ‌ర్ల సంతృప్తికి పెద్ద‌పీట వేస్తూ..మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తు..నాణ్య‌త విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌కుండా చేప‌ట్టిన భ‌వంతులు, ఆకాశ హార్మ్యాల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి.

ఏపీలోని అమ‌రావ‌తి, విజ‌య‌వాడ‌, వైజాగ్‌, మంగ‌ళ‌గిరి, గ‌న్న‌వ‌రంతో పాటు క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు, చెన్నై, కోల్‌క‌తా, ముంబయి, ఢిల్లీతో పాటు ఇండోర్‌, ఐటీ హ‌బ్ గా పేరొందిన హైద‌రాబాద్‌లో రియ‌ల్ బూమ్ ఒక్క‌సారిగా పెరిగింది. రియ‌ల్ట‌ర్ల‌కు పెట్టిన ఖ‌ర్చుకు రెట్టింపు ఆదాయం స‌మ‌కూరింది. బిల్డ‌ర్స్ రియ‌ల్ ఎస్టేట్ రంగంలో రారాజులుగా వెలుగొందే స్తాయికి చేరుకున్నారు. వీరిలో తెలంగాణ‌కు చెందిన చిన్న‌జీయ‌ర్ స్వామి శిష్యుడు మైహోం రామేశ్వ‌ర్ రావు కూడా ఉండ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. జాతీయ స్థాయిలో స‌ర్వే చేస్తే 100 మంది రియ‌ల్ట‌ర్లు తేలారు. వారిలో మ‌నోడికిచ్చిన ర్యాంకు 14. సో..ఎవ‌రెవ‌రో తెలుసుకోవాలంటే ఓ లుక్ వేయాల్సిందే. వీరిలో..మొద‌టి స్థానాన్ని ముంబ‌యికి చెందిన లోధా గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కుడు 27, 150 కోట్ల నిక‌ర ఆస్తుల విలువ‌తో మంగ‌ల్ ప్ర‌భాత్ లోధా సాధించారు. బెంగ‌ళూరుకు చెందిన ఎంబ‌సీ గ్రూప్ ఛైర్మ‌న్ అయిన జితేంద్ర బిర్వానీ 23 వేల 160 కోట్ల‌తో రెండో స్థానంలో నిలిచారు.

డీఎల్ ఎఫ్ వైస్ ఛైర్మ‌న్ రాజీవ్ సింగ్ 17 వేల 890 కోట్ల‌తో మూడో స్థానంలో నిల‌వ‌గా, ర‌హేజా కంపెనీ సీఇఓ చంద్రూ ర‌హేజా 14 వేల 420 కోట్ల‌తో నాలుగో స్థానంలో ఉన్నారు. 10 వేల 980 కోట్ల నిక‌ర ఆస్తుల విలువ‌తో ముంబ‌యికి చ చెందిన ఒబేరాయ్ కంపెనీ ఎండీ వికాస్ ఒబేరాయ్ అయిదో స్థానంలో నిలిచారు. ఇదే న‌గ‌రానికి చెందిన నిరంజ‌న్ హీరానందాని 7 వేల 880 కోట్ల నిక‌ర ఆస్తుల విలువ‌తో హీరానందాని గ్రూప్ ఆరో స్థానాన్ని చేజిక్కించుకుంది. సురేంద్ర నందాని 7 వేల 880 కోట్ల విలువ‌తో ఏడో స్థానంలో, ముంబ‌యికి చెందిన అజ‌య్ పిర‌మ‌ల్ 6 వేల 330 కోట్ల‌తో పిర‌మ‌ల్ గ్రూప్ కంపెనీ ఎనిమిదో ప్లేస్‌లో నిలిచారు. 5 వేల 900 కోట్ల‌తో బెంగ‌ళూరుకు చెందిన మ‌నోజ్ మోండా కంపెనీ తొమ్మిదో స్థానంలో ఉండ‌గా 5 వేల 900 కోట్ల‌తో రాజ్ మోండా ప‌దో స్థానంలో నిలిచారు. రియ‌ల్ ఎస్టేట్ రంగం వీరిని కరోడ్‌ప‌తిని చేసింది. ఇక తెలంగాణ‌కు చెందిన బిజినెస్ టైకూన్‌..మై హోం అధినేత రాజారామేశ్వ‌ర్ రావు..3 వేల 370 కోట్ల నిక‌ర ఆస్తుల విలువ‌తో 14 స్థానాన్ని చేజిక్కించు కోగా జీవీకే కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు మోహ‌న్ రెడ్డి 63వ స్థానంతో స‌రిపెట్టుకున్నారు. మొత్తం మీద ఇండియా వెలిగి పోతోంది అన‌డానికి రియ‌ల్ ఎస్టేట్ రంగాన్ని చూపిస్తే స‌రిపోతుంది క‌దూ.

No comments