Header Ads

ఈ రెండేళ్ల చిన్నారి నటించిన పీహు చిత్రం మొత్తం భారత దేశాన్ని ఆకట్టుకుంటుంది..!

పీహు- ప్రస్తుతం ఈ చిత్రం గురుంచి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, బడ్జెట్ చిన్నదే, కాస్టింగ్ కూడా పెద్దదేమీ కాదు, మరి ఎందుకని ఈ సినిమా గురుంచి చాలా మంది చర్చించుకుంటున్నారు, ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా తియ్యడానికి చాలా కష్ట పడ్డాడు, అదేంటి సినిమా తీయాలి అంటే ఎవరైనా కష్ట పడాల్సిందే గా అని అంటారేమో మీరు, కానీ ఇతని కష్టం కొంచెం వేరు.. అసలు విషయానికి వస్తే....ఓ వ్యక్తి సృజనాత్మకంగా ఆలోచిస్తే ఓ కథ తయారవుతుంది. దాన్నితెరపైకి ఎక్కించాలని ప్రయత్నిస్తే దర్శకుడి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. రెండేళ్ల చిన్నారితో సినిమా తీయాలని దర్శకుడు వినోద్ కాప్రి కథను తయారు చేసుకున్నాడు. పెట్టుబడి పెట్టమంటూ ఎక్కని గుమ్మం లేదు తొక్కని గడప లేదు. ఒక్కరూ ముందుకు రాలేదు.
ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తేనే హిట్ అవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో కథ మొత్తం రెండేళ్ల చిన్నారి చుట్టూనే నడిపిస్తానంటే.. జనం ఎలా చూస్తారనుకుంటున్నావు అని నిరాశపరిచిన వాళ్లే ఎక్కువ. ప్రాణ స్నేహితుడు నేను పెట్టుకుంటా ఖర్చు మొత్తం అన్నాడు. ఇంతలోనే అర్థాంతరంగా ప్రాణాలు వదిలాడు. మళ్లీ వేట ప్రారంభించాడు. అతడి ఆశలకు ఊపిరి పోయడానికి సిద్ధార్థ్‌రాయ్ కపూర్ ముందుకు వచ్చారు. దంగల్, చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్ లాంటి చిత్రాలను నిర్మించిన సిద్ధార్థ్‌‌కి వినోద్ కథ నచ్చింది. అంతకంటే ముందు అతడు కథను మలిచిన తీరు, చెప్పిన విధానం నచ్చడంతో మరో ఆలోచన లేకుండా నేనే నిర్మిస్తాను అంటూ కొండంత భరోసా ఇచ్చాడు. వినోద్ స్నేహితుడి కూతురు మైరా. రెండేళ్ల చిన్నారి.
రెండు గంటల నిడివి ఉన్న చిత్రాన్ని తీయడానికి రోజుకి రెండు గంటలు మాత్రమే షూటింగ్ చేసేవారు.

షూటింగ్ జరిగే ఇంట్లోకి పాప కుటుంబం షిప్ట్ అయింది. చిత్ర బృందం అంతా పాపతో స్నేహంగా మెలిగేవారు. పాప హావభావాలని ఒడిసిపట్టుకునేందుకు ఒకేసారి రెండు మూడు కెమెరాలు ఉపయోగించేవారు. పాప ప్రవర్తనకి అనుగుణంగా స్క్రిప్ట్‌ని మలుచుకున్నారు వినోద్. తను రోజూ ఆడుకునే బొమ్మలనే సినిమాలో కూడా ఉపయోగించారు. దర్శకుడు ఆసక్తికరంగా మలచిన ఈ కథకి మూలం 2014లో తాను చదివిన ఓ చిన్న వార్త. అదే ‘పీహూ’ చిత్రంగా రూపుదిద్దుకుంది. ఇంట్లో అమ్మా, పాప మాత్రమే ఉంటారు. పాపకు అమ్మతోనే ఆట, పాట, అల్లరి అంతా. ఓ రోజు అమ్మ అర్థాంతరంగా తనువు చాలిస్తుంది. చిట్టితల్లికి అర్థం చేసుకునే వయసు లేదు. అమ్మని తట్టి లేపుతుంది. లేవట్లేదని మళ్లీ ఆడుకోవడానికి వెళ్లి పోతుంది.

ఎన్నో ట్విస్టులు, ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు ఆధ్యంతం ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం బాలీవుడ్ బిగ్ బీని, మధుర్ భండార్కర్ లాంటి మహా మహుల్ని ఆకర్షించింది. ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పలు ప్రశంశలు పొందింది. ప్రేక్షకులు కూడా పీహూని ఆకాశానికి ఎత్తేస్తారని దర్శకుడు ఆశిస్తున్నాడు. ట్రైలర్ చూసిన వారంతా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 16న పీహూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా చాలా మంది తల్లి తండ్రులకి తమ పిల్లల మీద బాధ్యత పెరుగుతుంది.

No comments