Header Ads

మేలైన మార్గం హోమియోప‌తి వైద్యం – రోగుల సేవ‌లో హాస్పిటల్ జిమ్స్..!

బత‌క‌డమే గ‌గ‌నంగా మారిన త‌రుణంలో వైద్య సేవ‌లు మ‌రింత ప్రియంగా మారాయి. క‌ళ్లు చెదిరే అత్యాధునిక సౌక‌ర్యాల‌తో జ‌నాన్ని బెంబేలెత్తిస్తున్న ఆసుపత్రులు అందినంత మేర దండుకుంటున్నాయి. దీనిని అడ్డుకట్ట వేయ‌డం అధికారుల‌కు  ప్ర‌భుత్వాల‌కు చేత కావ‌డం లేదు. దీనిని నివారించేందుకు నానా రకాలుగా చ‌ర్య‌లు తీసుకున్నా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. కొన్నేళ్లుగా ఈ తంతు ఓ దందాగా మారి పోయింది. ఇది ఇప్ప‌ట్లో ఆగిపోయేలా లేదు.
అనుకోని రోగాలు పేద‌ల‌ను , మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను నానా రకాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. త‌క్కువ ఖర్చుతో ఎక్కువ ఫ‌లితం ఇచ్చేలా జిమ్స్ కృషి చేస్తోంది. ఇందుకోసం శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామీజీ అలుపెరుగ‌కుండా కృషి చేస్తూ వ‌చ్చారు. అన్నిటికంటే హోమియో వైద్యం మేలు చేకూరుస్తుంద‌ని ఆయ‌న న‌మ్మారు. ప్ర‌తి ఒక్క‌రు దీనిని ఉప‌యోగించుకుని రోగాల బారి నుండి కాపాడు కోవాల‌ని ఏకంగా ఆసుప‌త్రితో పాటు మెడిక‌ల్ కాలేజీ కూడా ఏర్పాటు చేశారు.

జాతీయ ర‌హదారిలోని శంషాబాద్ ఎయిర్ పోర్టు ద‌గ్గ‌ర‌లోని ముచ్చింతల్ గ్రామ శివారులో ఇది ఉన్న‌ది. తెలంగాణ‌లో మొద‌టిసారిగా దీనిని ప్రారంభించారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా ఎవ్వ‌రైనా ఇక్క‌డ ఉచితంగా సేవ‌లు పొందేలా చేశారు. దీని వెనుక మహోన్న‌త‌మైన ఆశ‌యం ఉన్న‌ది. స్వ‌త‌హాగా హోమియోప‌తి వైద్యంలో డాక్ట‌ర్ కావ‌డంతో మై హోం సంస్థ‌ల ఛైర్మ‌న్ జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు దీనికి ఓ రూపం తీసుకు వ‌చ్చారు.ఉచితంగా స్థ‌లం ఇవ్వ‌డంతో పాటు క‌ళాశాల‌తో పాటు ఆస్పత్రి కూడా న‌డిచేలా చేశారు. దీర్ఘ‌కాలికంగా రోగాల‌ను న‌యం చేసే ల‌క్ష‌ణం ఒక్క హోమియో ప‌తి వైద్యానికి మాత్ర‌మే ఉందంటారు జూప‌ల్లి. జీవా సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈ రెండూ విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి. మ‌నుషుల‌కు దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్ర‌తి రోగానికి ఇక్క‌డ చికిత్స ల‌భించేలా వైద్యులు కృషి చేస్తున్నారు. ఇది ఆహ్వానించ‌త‌గిన ప‌రిణామం. ల‌క్ష‌లాది మంంది పేద ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించాల‌న్న ఉద్దేశంతో స్వామీజీ దీనిని ఏర్పాటు చేశారు. హోమియోప‌తి, ఆయుర్వేదిక్ , అల్లోప‌తి వైద్యం ఒకే చోట ల‌భించేలా చేయాల‌ని సంక‌ల్పించారు. అదే ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చారు.


దీంతో చేయి తిరిగిన వైద్యులు, సీనియ‌ర్ డాక్టర్లు ఇక్క‌డ రోగుల‌కు చికిత్స చేస్తున్నారు. ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల దాకా వైద్య సేవ‌లు ఇక్క‌డ అందుబాటులో ఉన్నాయి. చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లే కాకుండా ఇత‌ర ప్రాంతాల నుండి చికిత్స కోసం ఇక్క‌డికి వ‌స్తుంటారు. ఇదీ ఈ వైద్య‌శాల‌, కాలేజీ ప్ర‌త్యేక‌త‌. సీనియ‌ర్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జిమ్స్ సిబ్బంది, వైద్యులు కంటి ప‌రీక్షా శిబిరాల‌తో పాటు వివిధ గ్రామాల్లో ఉచితంగా వైద్య, ఆరోగ్య శిబిరాల‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా స‌మ‌యం ఆదా కావ‌డంతో పాటు రోగుల వ‌ద్ద‌కే డాక్ట‌ర్లు వెళ్లేలా చేయ‌డంతో

ప్ర‌జ‌లు వీరి సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటున్నారు. ఉచితంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు వారికి స‌రిపోయిన మందులు అంద‌జేస్తున్నారు. మొద‌ట్లో కొంచెం సంశయించినా రానురాను ఈ ఆసుపత్రికి రావ‌డం అల‌వాటై పోయింది. ఇది ఓ ర‌కంగా జిమ్స్ సాధించిన కృషికి ద‌క్కిన గౌర‌వ‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా చికిత్స‌లు చేస్తున్నారు.

2014 లో చిన జీయ‌ర్ స్వామీ మెగా హెల్త్ క్యాంపు ను ప్రారంభించారు. దీనికి మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం డాక్ట‌ర్ రీతా కృష్ణ‌న్‌, మ‌హ్మ‌ద్ ఇర్ఫాన్‌, వంశీ కృష్ణా రెడ్డి, శ్రీ‌కాంత్‌, హీనీ జోషి, మాన‌స వైద్య సేవ‌లు అంద‌జేస్తున్నారు. వీళ్లంతా సాయంత్రం దాకా రోగుల‌కు అందుబాటులో ఉంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రాజేశ్ తివారీ ఇటీవ‌ల జిమ్స్ కాలేజీ, హాస్పిట‌ల్ ను సంద‌ర్శించి సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఇలాంటి కాలేజీ ఉండ‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌శంసించారు.


ఇక్క‌డ అందిస్తున్న సేవ‌ల‌ను చూసేందుకు అమెరికాలో న‌ర్స్ కోర్సులో శిక్ష‌ణ పొందుతున్న వారు కాలేజీని సంద‌ర్శించారు. తెలంగాణ హోం మినిష్ట‌ర్ నాయ‌నితో పాటు కాళోజీ నారాయ‌ణ‌రావు యూనివ‌ర్శిటీ వీసీ నారాయ‌ణ రెడ్డి కాలేజీని సంద‌ర్శించారు. 2016 జ‌న‌వ‌రి ఒక‌టిన కాలేజీ కొత్త బిల్డింగ్ ను చిన‌జీయ‌ర్ స్వామీ ప్రారంభించారు. ఆరోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి కూడా సంద‌ర్శించారు. మెడిక‌ల్ కౌన్సిల్ వంద సీట్లు ఈ కాలేజీకి కేటాయించింది. ఇది కూడా అన‌తి కాలంలోనే సాధించ‌డం సంతోష‌క‌ర‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు.

2015 అక్టోబ‌ర్ 20న జిమ్స్ హోమియోప‌తిక్ కాలేజీతో జర్మ‌నీ దేశంలోని గ్లేస్ అకాడెమీతో ఒప్పందం చేసుకుంది. ఆయుష్ క‌మిష‌న‌ర్ కూడా కాలేజీని, ఆసుప‌త్రిని సంద‌ర్శించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. డాక్ట‌ర్ పావులూరి కృష్ణ చౌద‌రి నేతృత్వంలో ఇది న‌డుస్తోంది. స్వామి వారి ఆశీస్సుల‌తో ఎంద‌రో రోగుల‌కు వైద్యం అందుతోంది. ఇదో ర‌కంగా ఎలాంటి వైద్య ఖ‌ర్చులు లేకుండా ఉండ‌డంతో అటు భ‌క్తులు ఇటు జ‌నం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటీవ‌ల హోమియో వైద్యంపై రాసిన పుస్త‌కాల‌ను స్వామీజీ హైద‌రాబాద్‌లో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా చిన‌జీయ‌ర్ స్వామీజీ విలువైన సూచ‌న‌లు చేశారు. ఈ కాలానికి హోమియోనే స‌రైన వైద్య‌మ‌ని చెప్పారు. అక్క‌ర‌కు వ‌చ్చే అంశాల‌ను అందించే ప్ర‌య‌త్నం చేస్తే స‌మాజం త‌ప్ప‌క అందుకుంటుంద‌ని అన్నారు. రోగుల‌ను నిదానంగా ప‌రిశీలించి మందులు ఇవ్వ‌గ‌లిగితే దీర్ఘ‌కాలిక రోగాలు కూడా న‌య‌మ‌వుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇత‌ర విధానాల వ‌ల్ల ఖ‌ర్చులు పెరిగి పోవ‌డ మే కాకుండా మ‌రింత ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని హెచ్చ‌రించారు.

తినే తిండి, జీవ‌న విధానం అనారోగ్యాల‌ను తెచ్చి పెడుతున్నాయి. దీనిని నివారించాలంటే దీని నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఒక్క‌టే మేలైన మార్గం హోమియోప‌తి వైద్యం మాత్ర‌మే న‌ని అన్నారు. చాలా మంది వైద్యుల‌కు రోగుల‌ను ప‌రీక్షించే ఓపికా ఉండ‌డం లేద‌ని చిన‌జీయ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హోమియోపై ఆస‌క్తి క‌లిగిన వారు ప‌రిశోధ‌న‌లు చేస్తే ఇంకొంత మేలు జ‌రుగుతుంద‌న్నారు. డాక్ట‌ర్ కృష్ణ చౌద‌రి త‌న అనుభవాల‌ను పంచుకున్నారు. అన్నిటికంటే ఈ విధాన‌మే స‌రిపోతుంద‌న్నారు. మొత్తం మీద జిమ్స్ చేస్తున్న వైద్య సేవ‌లు మ‌రింత విస్త‌రించ‌గ‌లిగితే ఇంకొంద‌రికి మేలు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది ప‌లువురి భావ‌న‌.

No comments