త్రిదండి చినజీయర్ స్వామి గారి నీతి భోధనలు..!
గ్లోబెల్ గురువుగా ఆధునిక ఆధ్యాత్మిక వేత్తగా భక్తులు కొలిచే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఏది మాట్లాడినా అది సంచలనమే. ప్రతి దానిలో అర్థం ఉంటుంది. పరమార్థం దాగి వుంటుంది. అంతకంటే జీవితానికి సమాజానికి కాలానికి ఉపయోపడేలా ఉంటుంది. ఇన్నేళ్లుగా సంచారకుడిగా ప్రయాణికుడిగా గురువుగా ఆయన ఎంతగానో ప్రసిద్ధి చెందారు. అన్నింటికంటే విలువలే ముఖ్యం అంటారు స్వాముల వారు. మరి ఆ విలువల్ని ఎలా పునరుద్ధరించు కోవాలి. ఏం చేస్తే బంధాలు, బాంధవ్యాలు బలపడుతాయో స్వామి వారు చెబుతారు.ఆయన వ్యక్తిత్త్వమే ఓ పాఠం. మరి ఆయన నుంచి స్ఫూర్తి పొందాలంటే మరింత తెలుసు కోవాలి. ఆచరించే ప్రయత్నం చేయాలి. అపుడే ఆనందం..అదే మిటో తెలుసు కోవాలంటే స్వామీజీ అంతరంగాన్ని ఆవిష్కరించే ఆ ఆధ్యాత్మిక అడుగుజాడలు చదవాలి. ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ భావజలధారల్లోకి. స్వామి సన్నిధిలోకి వ్యక్తిత్వ వికాస పాఠాలు మరియు స్వామి వారి బోధనలు ఇవే.
మనసే మందిరం దేహమే దేవాలయం :
పరుగులు తీసే ప్రవాహానికి అడ్డుపడాలని అనుకుంటారా ఎవరైనా. జెట్ స్పీడ్ కంటే వేగంగా పరుగులు తీస్తున్నకాలాన్ని ఎవరైనా ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేశారా. ప్రతి ఒక్కరికి విజయం సాధించాలన్న తపన ..కుతూహలం ఎక్కువగా వుంటుంది. మార్కెట్లో రోజూ వారీగా దొరికే వస్తువా సక్సెస్ సాధించడం అంటే. ఒక బలమైన కారణం వుండాలి. మనిషిగా ఎదగాలంటే. ఓ స్పష్టమైన ప్రణాళిక రూపొందించు కోవాలి. అందు కోసం ఏమేం చేస్తే లక్ష్యం చేరుకోగలోమో ముందే బలాలు, బలహీనతలను బేరీజు వేసుకోగలగాలి. అప్పుడే మనమేమిటో మన సత్తా ఏమిటో తెలుస్తుంది. ఇదంతా అలుపెరుగకుండా ప్రయత్నం చేస్తే వచ్చే ఫలితం . చెట్టు అనే వ్యక్తిత్వపు ఫలాలను అందుకోవాలంటే విత్తనం బలమైనదై ఉండాలి. మనసు పాదరసం లాంటిది. అది ఒకచోట కుదురుగా ఉండదు. ఎక్కడా ఏకాగ్రతతో నిలుచోనీయదు. పరిపరివిధాలుగా పరిభ్రమిస్తూనే వుంటుంది. ఒక్కోసారి ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలుగుతుంది. ఇంకోసారి ఎవరికీ అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్లిపోతాం. ఇపుడంతా ఇదే ఫ్యాషన్.అయిపోయింది. ఒక బలమైన పునాదులు కలిగిన వ్యవస్థ తయారు కావాలంటే అంతకంటే ఉక్కు సంకల్పం కలిగిన మనుషుల సమూహం రెడీగా ఉండాలి. అపుడే అనుకున్నది మనదవుతుంది. ఇది ఊరికే లభిస్తుందా కాదు కష్టపడాలి. ఒక్కోసారి చిక్కినట్టే చిక్కి మాయమై పోతుంది. ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే పక్షులు అనుకున్న చోటికి ఎగురగలవు. ఎక్కడ ఆహారం లభిస్తే అక్కడికి చేరగలవు. ఇదంతా ఎలా సాధ్యమైంది...అంతా రెప్పపాటులో ఆకలిని తీర్చుకోవాలంటే ప్రయాణం చేయాల్సిందే. ఎంత దూరమైనా సరే వెళ్లాల్సిందే. అలాంటిదే మనం కూడా. శరీరం..మనసు ఒకదానికొకటి అల్లుకుని ఉంటాయి. ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటిలో తేడా వచ్చినా ఇక అపజయం మూటగట్టకున్నట్లే..అసంతృప్తిని ఎట్టి పరిస్థితుల్లోను దరి చేరనీయకండి. పాజిటివ్ ఫీలింగ్స్ ను కలిగి ఉండండి. ఇపుడు కాకపోయినా సరే రేపటికి మంచి పౌరులుగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసే అన్నింటికి మూలం..కేంద్రం కూడా..దేహమే దేవాలయం. దానిని అలా భావించు కోగలిగితే ఎంతో మేలు జరుగుతుంది.
భక్తులారా ప్రేమించండి ప్రేమను పంచండి:
అన్ని జీవుల్లో కెల్లా మానవ జీవితం గొప్పది. పుట్టుక మన చేతుల్లో లేదు. పోయేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. పోయే లోపు మనం చేసిన ప్రయాణం ఎలాంటిదో తెలియాలంటే బతుకును మరింత కట్టుదిట్టంగా రూపొందించు కోగలగాలి. అప్పుడే సంసారంలో కలతలు అంటూ ఉండవు. ఎక్కడికైనా వెళ్లాలంటే వాహనాలు కావాలి. ఏదైనా సాధించాలంటే దానికి తగ్గట్టు రేయింబవళ్లు శ్రమించాలి. సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడిని స్మరించు కోవాలంటే ముందు మనం ఆత్మను..మనసును మలినాలు అంటకుంటా పరిశుభ్రంగా ఉంచు కోవాలి. దీనిని పొందాలంటే ఎంతో కష్టపడాలి. దీనిని చేయాలంటే ఏం చేయాలి..తనివి తీరా ప్రేమించాలి. అపుడే ఇంకొందరికి ప్రేమను పంచగలం. ఆ దైవం కూడా సమాజ హితం కోరే మనుషుల్నే కోరుకుంటుంది. సాటి వారిని..తోటి వారి పట్ల సహృదయత కలిగి ఉండేలా చేస్తుంది. అంతులేని స్వార్థం..ఎక్కడ లేని ఈర్ష్యా ద్వేషాలు మనుషుల్ని దూరం ఉంచేలా చేస్తున్నాయి. ఎవరికి వారు అధికులమని..తమకంటే గొప్పవారు లేరని అనుకుంటున్నారు. కాలపు ప్రవాహంలో అంతా నిమిత్తమాత్రులేనన్న నిజాన్ని గ్రహించాలి. రోజూ వారీ సంపాదనలో కనీసం 5 శాతాన్ని సమాజ హితం కోసం ఖర్చుచేయాలి. ఇది ప్రేమించడం వల్ల సాధ్యమవుతుంది. ఎవరికి వారు ఎవరి లోకంలో వారుంటే సమాజం ఎలా అభివృద్ధి సాధిస్తుంది. అంతా సమానులేనన్న భావన రావాలన్నా..సర్వ ప్రాణులకు సేవ చేయాలన్న ప్రేమ కలిగి ఉండాలి. అదే మనుషులను గొప్పవారిగా తయారు చేసేలా దోహద పడుతుంది. అన్నింటికి రుసుములు చెల్లించాలి..ఉదయం లేచి నప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా .
మనం బతకాలంటే చచ్చేంత దాకా ఈ లోకానికి బాకీ తీరుస్తూనే ఉండాలి. మరి ఇంత గొప్పనైన జన్మ ఇచ్చిన ఆ దేవుడికి మాత్రం మనం ఏం ఇస్తున్నాం..ఎలా రుణాన్ని తీర్చుకుంటున్నామో ఆలోచించాలి. ఆత్మ బంధువులారా నయా పైసా ఖర్చు లేని ప్రేమను పొందాలంటే ..మీరు ప్రేమను పంచాలి. అపుడే సాధ్యం లేదంటే కష్టమే. ఇప్పటికైనా మించి పోయింది లేదు..కాలం మీ చేతుల్లోనే ఉండాలంటే తప్పక ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ గొప్పనైన భావన కానే కాదు. అదొక మనుషుల్ని ..దైవానికి మధ్య బంధాన్ని పటిష్టం చేసే వంతెన ప్రేమ.
రుణం తీర్చుకోండి, జన్మను చరితార్థం చేసుకోండి :
మీకు మీరే ప్రత్యేకం. మీకు మీరే బ్రాండ్. వేరొకరిని అనుసరించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే మీకంటూ ఓ వ్యక్తిత్వం లేనట్టే. నిజమైన వ్యక్తిత్వం ఎదుటి వారిని ప్రభావితం చేస్తుంది. వారిని ఆలోచించేలా చూస్తుంది. వ్యక్తిత్వం అంటే ఏమిటి. అది పొందాలంటే ఏమైనా డబ్బులు ఖర్చవుతాయా..కాదు ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులు మనకంటే భిన్నంగా ఉంటారు. వారు ఈ సమాజం పట్ల వారికి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. చదువు కోవడం వల్లనో లేక ఇంకొకరు నేర్పితే వచ్చేది కాదు. పరిపూర్ణమైన మనస్తత్వం..వ్యక్తిత్వం కలిగిన వారిగా రూపొందాలంటే మాత్రం గురువుల్లాగా సాధన చేయాలి. యోగుల్లాగా శరీరాన్ని..మనసును అదుపులో ఉంచు కోవాలి. కోరికల్ని నియంత్రించు కోగలగాలి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలిగితే చాలు గొప్ప వ్యక్తిగా మారటానికి. దీనికి ఎలాంటి ఖర్చు లేదు. వేలకు వేలు ఫీజులు కట్టాల్సిన పని లేదు. వేరెవ్వరినీ దేబరించాల్సిన అవసరం లేదు. ఉన్నదల్లా సంకల్పం కావాలి. అది మన కుటుంబం నుంచే రావాలి. పిల్లలు వికసించాలన్నా..మనసును అదుపులో ఉంచు కోవాలన్నా తల్లిదండ్రులే కీలక భూమికను పోషిస్తారు. దానిని గుర్తించి మసలు కోగలిగితే చాలు ఏ సమస్య వచ్చినా సరే మీదైన బలం..మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. జ్ఞానం పుస్తకాల్లో దొరుకుతుంది. కానీ అనుభవం మనుషుల జీవితాల నుంచి లభిస్తుంది. గొప్పవారి జీవిత చరిత్రలు ఇందుకు ఉపయోగపడుతాయి. వారిని చదవాలి. ఆకళింపు చేసుకోవాలి. వీలైతే ఆచరించేలా చూడాలి. ప్రతిరోజు శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటామో మీ మనసును ఎలాంటి మోహాలకు, కోరికలకు ప్రభావం కాకుండా చూసుకోవాలి. నిజమైన వ్యక్తిత్వం అంటే మాట ఇవ్వడం..ఇచ్చాక దానిని నిలబెట్టు కోవడం. సమయ పాలన పాటించడం. ఎదుటి వారి పట్ల దయ కలిగి ఉండడం. ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు వాళ్లు పైకొస్తారు. పదుగురికి వెలుగును పంచుతారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ
మారండి. జన్మనిచ్చిన కన్నవారి బాధ్యతలను మీరు తీసుకోండి. మీ జన్మ ధన్యమవుతుంది. చరితార్థమవుతుంది.
మారండి. జన్మనిచ్చిన కన్నవారి బాధ్యతలను మీరు తీసుకోండి. మీ జన్మ ధన్యమవుతుంది. చరితార్థమవుతుంది.
పుస్తకాలు లోకాన్ని ఆవిష్కరించే దీపాలు:
నాకు ఏ రాజ్యాలు వద్దు. నోట్ల కట్టలు వద్దే వద్దు. నన్ను మనిషినిగా చేసే పుస్తకాలు ఇవ్వండి చాలు అంటారు ఓ సందర్భంలో బుద్ధుడు. ప్రతి ఊరు బాగుపడాలి. బాగుండాలి కూడా..ప్రతి బడిలో గంట మోగాలి. ప్రతి గుడిలో దీపం వెలగాలి. అపుడే ఆ గ్రామానికి వెలుగు వస్తుంది. విద్య వికాసాన్ని కలిగిస్తుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేలా చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా ..ఎన్నో తరాలుగా మనం నేర్చుకోవాల్సిన అనుభవసారమంతా ఆ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇంటర్నెట్ ఆధిపత్యం చెలాయిస్తున్నా.సామాజిక మాధ్యమాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నా ఇంకా ఈ ఆధునిక కాలంలో పుస్తకాల ప్రచురణ పెరుగుతూనే వస్తోంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా పత్రికలు, పుస్తకాల ముద్రణ రెట్టింపవుతోంది. అభివృద్ధి జరుగుతోంది. కాదనలేం. కానీ మనుషుల్ని వేరు చేసి యంత్రాలుగా మార్చే ఏ వ్యవస్థా బతికి బట్టకట్టిన దాఖలాలు లేవు. ఉన్నదల్లా సమాజాన్ని కాపాడుకోవడమే. మనం మారాలన్నా..విచక్షణా జ్ఞానం అలవడాలన్నా..మనుషులుగా సాటి వారి పట్ల ప్రేమను పంచాలన్నా పుస్తకాలు చదవాలి. తల్లి ప్రాణమిచ్చి..పాలిచ్చి పెంచి పోషిస్తుంది. తను పస్తులుండి పిల్లలకు పెడుతుంది. వాళ్లు ఉన్నతంగా ఎదగాలని..అందరికంటే పై స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. తండ్రి ఎప్పుడూ బాధ్యతలను భుజాల మీద పెట్టుకుని మోస్తూనే ఉంటాడు. ఈ బతుకు బండిని తోస్తూనే పిల్లల ఆశలను బతికించేందుకు తను కోల్పోతూ ఉంటాడు. ఎంతమంది తమ కన్నీళ్లను లోలోపట దాచుకుని, జీవితాలను పారేసుకుని వాళ్ల ఉన్నతికి వీళ్లు బలాయ్యోరో తల్చుకుంటే బాధేస్తుంది. గతాన్ని మరిచి పోకండి. మరింత భవిష్యత్తు మీకు దక్కాలంటే ..బాగుపడాలంటే పుస్తకాలే మీకు దిక్సూచీలుగా ఉపయోగ పడుతాయి. మీకు అంతులేని ఆత్మ స్థయిర్యాన్ని ఇవ్వడంతో పాటు బతుకు యుద్ధంలో గెలిచేందుకు ఆయుధాలుగా, సాధనాలుగా ఉంటాయి. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు..చిరిగిన చొక్కా అయినా తొడుక్కోండి..కానీ ఓ మంచి పుస్తకాన్ని మాత్రం కొనండి. పది మందిని చదించేలా చేయండి. ఏం ఆశించి శ్రీ రామానుజాచార్యులు ఈ సంఘం కోసం పనిచేశారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అత్యాధునిక వస్తువులు, సాధనాలు కొంతమేరకు ఉపయోగపడొచ్చు..కానీ హృదయాన్నిఆవిష్కరించే సాధనం మాత్రం పుస్తకమే. పిల్లలు వికసించాలంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు కన్నవారు చెప్పాలి. నీతి, నిజాయితీ, అబద్ధం ఆడక పోవడం, పెద్దవారిని గౌరవించేలా ..చదువులో ఉన్నతి పొందేలా ఉండాలంటే పుస్తకాలే నేస్తాలు..అవే విజ్ఞానాన్ని పంచే వెలుగుదివ్వెలు.
బంధాలే నిజమైన ఆస్తులు..అంతస్తులు :
సమాజానికి ఆలంబన కుటుంబమే. అదో బలమైన వ్యవస్థ. నేటికీ ఈ దేశంలో ఎన్ని కులాలు, మతాలు, జాతులు ఉన్నా అంతా ఐకమత్యంతో బతుకుతున్నారంటే సామరస్య వాతావరణం ఉండటమే. ఎవరి అభిప్రాయాలు వారివే. ఎవరి నమ్మకాలు వారివే. కానీ చావు బతుకుల్లో ఉన్న సమయంలో అన్నింటిని పక్కన పెడుతూ ఆదుకునేందుకు వస్తున్నారు. ఇటీవలి కాలంలో సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇది నేటి యువతకు మార్గదర్శనం చేసే పాఠం కూడా. కెరీర్ పరంగా ..కుటుంబ పరంగా వ్యవస్థలో ఎంతో ఎత్తులో ఉన్నా తమ మూలాలను మరిచి పోకుండా ఉండడం మంచి పద్ధతి. ఇది ఎందరికో పాఠం కావాలి. ఎలాంటి డబ్బులు లేకుండా కేవలం 5 వేల రూపాయలతో హోటల్ లో ఇడ్లీలు అమ్ముకుంటూ నేడు 5 వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన కామత్ ఎందరికో ఆదర్శనీయుడు. అరణ్యవాసం చేసినా ఏనాడూ చెక్కు చెదరని వ్యక్తిత్వంతో ఆదర్శ ప్రాయుడిగా కొలువబడుతున్న శ్రీరాముడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. ఇపుడు బంధాలు, బాంధవ్యాలు దారాల కంటే మరింత పలుచనై పోయాయి. ఇది అందరినీ కలవరపెడుతున్న ప్రధాన సమస్య. ఆధునిక కాలం మనుషుల్ని ఒక చోట ఉండనీయడం లేదు. ఐటీ లేదా ఇతర రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు , వేతనాల స్థాయిలో తేడాలు , చేతినిండా కరెన్సీ తాత్కాలిక ఆనందాన్ని ఇస్తున్నాయి. కానీ అసలైన మానసిక శాంతిని కలుగ చేయలేక పోతున్నాయి. ఒకటి పోతే ఇంకొకటి వస్తువు మార్కెట్లోకి వస్తోంది. దీనిని ప్రామాణికంగా తీసుకుని, ఇతరులతో అన్ని విషయాల్లో పోల్చుకోవడం నేటి యువతీ యువకులకు అలవాటుగా మారి పోయింది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది నేటి సమాజానికి మంచిది కాదు. ఏ స్థాయిలో ఉన్నా మిన్ను విరిగి మీద పడినా చెక్కు చెదరకుండా ఉండాలి. నదిలా ప్రవహించాలి. సముద్రంలా అల్లుకు పోవాలి. పర్వత శిఖరంలా నిటారుగా నిలబడాలి. రాకెట్ కంటే వేగంగా అడుగులు వేయాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ఎవరికో ఒకరికి ఇచ్చేయాల్సిందే. ఏదీ మనది కానప్పుడు ఎందుకింతటి ఆతృత. ఎవరైతే కోరికలకు అతీతంగా ఉంటారో..ఎవరైతే తోటి వారి పట్ల సానుకూల దృక్ఫథాన్ని కలిగి ఉంటారో వారే చివరి దాకా సంతోషంగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే బంధాలు బలపడితే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే లైఫ్ నరకమనిపిస్తుంది. మరి మీ ముందున్న ప్రధానమైన పని మనుషులతో కరచాలనం చేయాలి. వాళ్లతో కలవాలి.అంతా సమూహం కావాలి. వన భోజనాలతో పాటు అడవిలా విస్తరించాలి. బాంధవ్యాల బంధమే మీ ఉన్నతికి మూలస్తంభం.
Post a Comment