Header Ads

ఆకు ప‌చ్చ‌ని యోధుడు - నిజ‌మైన భూమి పుత్రుడు రియల్ స్టోరీ.!

కొంద‌రు కొంత సాధిస్తే చాలు అదే గొప్ప‌వార‌మ‌ని అనుకుంటారు. ఇదీ మాన‌వ నైజం. కానీ ఆయ‌న మ‌న‌లాగే మాన‌వ మాత్రుడు.కానీ మ‌న‌లాంటి మ‌నిషే. కాక‌పోతే మ‌న‌కంటే ఆయ‌న అత్యున్న‌తైన స్థాయిలో వున్నారు. అంత‌కంటే మ‌నం అందుకోలేనంత ఎత్తుకు ఎదిగి పోయారు. ఒక్క‌డు ఓ వ్య‌వ‌స్థ‌గా ఎలా మారాడో తెలుసు కోవాల్సిన క‌థ ఆయ‌న‌ది. అత‌డు సాధించిన ఈ విజ‌యం వేలాది మందికి పాఠంగా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి అనుమానాలు అక్క‌ర్లేదు కూడా.


ఆయ‌న ఈ మ‌ట్టిని అమితంగా ..త‌ల్లికంటే ఎక్కువ‌గా ప్రేమించాడు. దానితోనే స‌హ‌వాసం చేశాడు. తాను మాత్రం ప్ర‌కృతితోనే జీవితం పంచుకున్నాడు. బ‌తుకంతా దానితోనే సాగుతున్నాడు. త‌న లాంటి వారిని వేలాది మందిని త‌యారు చేశాడు. వారంతా ఇపుడు జూనియ‌ర్ సుభాష్ పాలేక‌ర్లుగా మారిపోతున్నారు. ఇది ఒక అసాధార‌ణ‌మైన ర‌క్త‌మాంసాలున్న మామూలు ప‌ల్లెటూరి మ‌నిషి క‌థ‌. మాన‌వ‌త్వం ..మ‌ట్టిత‌నం క‌ల‌బోసుకున్న ఓ విజేత చ‌రిత్ర‌.

ఇందుకు అవార్డులు ఇవ్వాల్సిన ప‌ని లేదు. ఇంకొక్క‌రి సిఫార‌సు అక్క‌ర్లేదు. అంత‌టి ఘ‌న‌మైన ఉద్విగ్న‌మైన క‌థ‌ను స్వంతం చేసుకున్న ఆయ‌నే కృష్ణా జిల్లా గూడూరు మండ‌లానికి చెందిన మేక‌పోతుల విజ‌య‌రామ్ . ఆయ‌న పేరుకంటే పాలేక‌ర్ శిష్యుడు అంటే ఎవ‌రైనా ఇట్టే గుర్తు ప‌డ‌తారు. అంతటి స్థాయికి ఆయ‌న చేరుకున్నారు. కొన్నేళ్లుగా ఈ భూమితోనే బంధం ఏర్పాటు చేసుకున్నారు. ఎలాంటి ఎరువులు, ర‌సాయ‌నాలు, మందులు లేకుండా వ్య‌వ‌సాయం సాగు చేయాల‌న్న ఆయ‌న సంక‌ల్పానికి పాలేక‌ర్ తోడ‌య్యారు. ఆయ‌న ఎంచుకున్న అనిత‌ర‌మైన మార్గానికి ఓ దిక్సూచి లభించింది. సుబాష్ రూపంలో దొరికింది.


ఏళ్ల త‌ర‌బ‌డి ఎలాంటి పెట్టుబ‌డి అంటే న‌యా పైసా ఖ‌ర్చు లేకుండా వ్య‌వ‌సాయాన్ని సాగు చేస్తున్నారు. మొద‌ట్లో విజ‌య‌రామ్ చెప్పిన దానిని చుట్టు ప‌క్క‌ల వాళ్లు న‌మ్మ‌లేదు. అందుకే ఆయ‌నే త‌న స్వంత పొలాన్ని ప్ర‌కృతి వ్య‌వ‌సాయ క్షేత్రంగా మార్చేశారు. ఇప్పుడ‌ది రైతుల‌కు ఓ ప్ర‌యోగ‌శాల‌. పాఠ‌శాల కూడా. విజ‌య్ రామ్ కు వ్య‌వ‌సాయం అంటే చ‌చ్చేంత ఇష్టం. దాని కోసం ఆయ‌న ఏం చేయ‌మ‌న్నా చేస్తారు. బ‌తుకంతా దానితో మ‌మేక‌మై పోవ‌డంతో ఏం కావాల‌న్నా ఇట్టే చెప్పేస్తారు. ఏ పంట ఎప్పుడు వేయాలి..ఏ స‌మ‌యంలో ఏం చేయాలో ద‌గ్గరుండి చూపిస్తారు. ఇప్పుడంతా మోన్‌శాంటో కంపెనీ ఆక్టోప‌స్ లా ప్ర‌పంచ వ్యాప్తంగా అల్లుకు పోయింది. దీనిని ఇండియా కానీ అమెరికా కానీ నిలువ‌రించే ప‌రిస్థితుల్లో లేవంటారు రామ్‌. ఏడాదికి ఒక్కో ఊరు నుండి దాదాపు 16 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెడుతున్నామంటారు ఆయ‌న‌. బంగారం లాంటి ఈ మ‌ట్టి ఇప్పుడు అంతులేని ర‌సాయ‌నాల‌తో నిండి పోయింది. మందుల‌తో నిండిన ఆహార‌మే మ‌నం తింటున్నాం. అందుకే ఇన్ని రోగాలు..మ‌రెన్నో బాధ‌లు. గ‌తంలో డ‌బ్బులు ఉండేవి కావు..కానీ ఇంటి నిండా ధాన్యం ఉండేది. కుటుంబమంతా ప‌చ్చగా ఉండేది. ఇపుడ‌ది ఓ క‌ల మాత్ర‌మేనంటారు ఆయ‌న‌.

పండుగ‌లా చేసుకోవాల్సిన వ్య‌వ‌సాయం ఇపుడు గుదిబండ‌గా మార‌డం వెనుక ఎన్నో కార‌ణాలు ఉన్నాయి. మందులు వాడ‌క‌పోతే దిగుబ‌డి రాని ప‌రిస్థితి దాపురించింది. దీని వ‌ల్ల‌నే చెప్ప‌లేని రోగాలు. చిన్న‌త‌నంలోనే కంటిచూపు లేక పోవడం..ముప్పై ఏళ్ల‌కే కాళ్ల నొప్పులు, న‌డ‌వ‌లేని స్థితికి చేరుకోవ‌డం ..ఇదంతా మందులతో నిండిన ఆహార ప్ర‌భావమే నంటారు. జీవ వైవిధ్యం తీవ్ర‌మైన విధ్వంసానికి గురైంది. ఇపుడు ప్ర‌తి ఇంట్లో కావాల్సినంత డ‌బ్బుంది కానీ రోగం లేని మ‌నిషంటూ లేరు. ఇదొక్క‌టి చాలు చెప్పుకోవ‌డానికి.

గోవుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నాం. ఒక్క ఆవును కాపాడు కోగ‌లిగితే 30 ఎక‌రాలు సాగు చేయ‌వ‌చ్చంటారు రామ్‌. మ‌ట్టి విధ్వంసం గురించి సుభాష్ పాలేక‌ర్ గుర్తించారు. ఆరు ఏళ్లు ఆయ‌న వ్య‌వ‌సాయ సాగుపై ప‌రిశోధ‌న‌లు చేశారు. ర‌సాయ‌నాలు , మందులు వాడితే ఎలాంటి దిగుబ‌డి వ‌స్తుంది..ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా చేస్తే ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో చూపించారు. దేశ వ్యాప్తంగా రైతుల‌కు శిక్ష‌ణ‌లు, స‌మావేశాలు , సద‌స్సులు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇంటర్ ఫెయిల్ అయిన విజ‌య్ రామ్ దృష్టి ప్ర‌కృతి వ్య‌వ‌సాయం పై ప‌డింది. తానే ఎందుకు ముందుకు రాకూడ‌దంటూ పాలేక‌ర్‌ను ఫాలో అవుతూ వ‌చ్చారు. చివ‌ర‌కు ఆయ‌నే జూనియ‌ర్ పాలేక‌ర్‌గా మారి పోయారు. అలా పేరు తెచ్చు కున్నారు రామ్‌. దేశంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డికి వెళ్లారు. ఎక్క‌డ చిన్న అవ‌కాశం చిక్కినా స‌రే మందులు లేని వ్య‌వ‌సాయాన్ని ..సాగును ప‌రిశీలించారు. దాని అనుభ‌వాల‌ను త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో అమ‌లు చేశారు.

మేలు జాతి ఆవుల‌ను సైతం ఆయ‌న సంర‌క్షిస్తున్నారు. గో ఆధారిత వ్య‌వ‌సాయానికి ఆయ‌న శ్రీ‌కారం చుట్టారు. కొన్నేళ్లుగా ఈ ప్ర‌య‌త్నం సాగుతూనే ఉంది. ఆవును పూజించే అల‌వాటు హిందువుల్లో ఎక్కువ‌గా ఉంటుంది. ఎంతో ఖ‌ఱ్చు చేసి నానా ఇబ్బందులు ప‌డే రైతులకు చ‌క్క‌టి అవ‌కాశం ఈ జీవ‌రాశుల‌ను కాపాడు కోవ‌డం. అన్నింటి కంటే ఎక్కువ‌గా గోవుల‌ను ర‌క్షించ‌డం. జీవ వైవిధ్యం స‌మ‌తుల్య‌త సాధించాలంటే ఆవు సంర‌క్ష‌ణే స‌రైన మార్గం అంటారు రామ్‌.

60 ఏళ్లుగా ఈ భూమి విధ్వంసానికి గుర‌వుతూనే ఉంది. ప‌రీక్ష‌ల పేరుతో..ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు దెబ్బ‌కు ప‌చ్చ‌ని పొలాలు బీళ్లు బారి పోయాయి. రైతులను కోలుకోలేకుండా చేశాయి. ఈ విధ్వంసం ఖ‌రీదు వేల కోట్ల‌ల్లో ఉంటోంది. బ‌హుళ‌జాతి కంపెనీల మాయాజాలం..ఆధిప‌త్యం కొన‌సాగుతూనే ఉంటుంది. నివారించే స‌త్తా ఏ ఒక్క‌రికీ ..ఏ స‌ర్కార్‌కు ఉండ‌దంటారు. దీనిని నివారించేందుకు పాలేక‌ర్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి పెట్టుబ‌డి లేకుండా సాగు ఎలా చేయొచ్చో నేర్పిస్తున్నారు. ఆవు పేడ ఎక‌రానికి 10 కేజీలు, 10 లీట‌ర్ల మూత్రం, 2 కేజీల శ‌న‌గ‌పిండి, 2 కేజీల బెల్లం, దోసెడు మ‌ట్టిని రెండు రోజుల పాటు అట్టిపెడితే 48 గంట‌ల్లో సూక్ష్మ జీవుల వ‌ల్ల పొలాల‌నికి మంచి ఎరువు త‌యార‌వుతుంది. ఇదే పాలేక‌ర్ క‌నిపెట్టిన ఖ‌ర్చు లేని వ్య‌వ‌సాయ విధానం. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా ఎలా పంట‌లు పండించ‌వ‌చ్చో రైతుల‌కు పాలేక‌ర్ శిక్ష‌ణ ఇస్తున్నారు. దీనిని ప్రోత్స‌హిస్తున్నారు. ఇప్ప‌టి దాకా 43 ల‌క్ష‌ల‌కు పైగా ల‌బ్ది పొందారు. వారు త‌మ‌లాంటి మ‌రికొంత మంది రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

ప్ర‌తి ఏటా వ్య‌వ‌సాయం సాగు చేయ‌డం అన్న‌ది రైతుల‌కు గుదిబండ‌గా మారింది. అప్పులు చేయ‌డం..తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌డం ఇదంతా మామూలుగా మారి పోయింది. దీని నుంచి బ‌య‌ట ప‌డేసేందుకే పాలేక‌ర్ న‌డుం బిగిస్తే విజ‌య్ రామ్ ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల‌లో 10 వేల మంది ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా లాభ‌ప‌డ్డారు. ఎలాంటి పెట్టుబ‌డి లేకుండా కేవ‌లం ఒకే ఒక్క ఆవుతో త‌మ పొలాల‌ను సాగు చేసుకునేలా రామ్ తీర్చిదిద్దారు. విత్త‌న భాండాగారం చేయాల‌న్న సంక‌ల్ప‌మే త‌న‌ను ఈ వైపు న‌డిపించింద‌ని అంటారు . వ‌రిలో ఆరు ల‌క్ష‌ల విత్త‌నాలున్నాయి. అవ‌న్నీ విధ్వంసానికి గుర‌య్యాయి.

ఇప్పుడు కొన్ని మాత్ర‌మే ల‌భిస్తున్నాయి. ఈ విత్త‌నాలు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. అంతేకాదు దీర్ఘ‌కాలిక రోగాల బారి నుండి కాపాడుతాయి. 3 వేల నుండి 6 వేల వ‌ర‌కు విత్త‌నాలు ఉన్నాయి. వీటిలో 200కు పైగా విత్త‌నాలు విజ‌య్‌రామ్ వ‌ద్ద భ‌ద్రంగా ఉన్నాయి. ఆయ‌న ప్ర‌తి రాష్ట్రం తిరిగారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. విత్త‌నాల నిల్వ‌ల కేంద్రాలు చేయాల‌న్న‌దే త‌న సంక‌ల్పం అంటారు. దీనికి ఏడేళ్లు శ్ర‌మించారు. ప్ర‌తి ఏటా రైతులు విత్త‌న పండుగ నిర్వ‌హించు కోవాలి. అది ఓ జాత‌రలాగా మారాల‌న్న‌దే త‌న ఆశ‌యం అని చెబుతారు.

ఈ దేశంలో ఎక్కువ శాతం వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డిన వారే. వ్య‌వ‌సాయం త‌ప్పా మ‌రో మార్గం లేదు. దీనిని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే సుభాష్ పాలేక‌ర్ విధాన‌మే స‌రిపోతుంది. విషం లేని భోజ‌నం తినాలి ప్ర‌తి ఒక్క‌రు. స్వంతంగా తానే పొలంలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో పెద్ద ఎత్తున పంట‌లు పండిస్తుండ‌డంతో చుట్టు ప‌క్క‌ల రైతులు ఆయ‌న‌ను అనుస‌రించారు. త‌మ బ‌తుకులు బాగుప‌డేలా చేసుకున్నారు. ఎలాంటి ఖ‌ర్చు లేకుండా సేద్యం సాధ్య‌మేనా అన్న మీమాంస‌లో ఉన్న‌వారికి మేము అండ‌గా నిల‌బ‌డ్డాం . రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం..త‌మ క్షేత్రంలోనే సాగు చేసిన విత్త‌నాల‌ను వారికి అంద‌జేయ‌డం..త‌న లాగా మ‌రికొంద‌రిని ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ..పాలేక‌ర్ విధానం వైపు మ‌ర‌ల్చేలా చేసేందుకు శ‌త‌విధాలా కృషి చేస్తున్నారు.

ఇందు కోసం హైద‌రాబాద్ లో ని రామ‌కృష్ణ మ‌ఠంకు ఎదురుగా 1999లో విజ‌య్ రామ్ ఎమ‌రాల్డ్ స్వీట్ షాపు ప్రారంభించారు. ఇందులో ఎలాంటి మందులు, ర‌సాయ‌నాలు లేకుండాత‌యారు చేసిన స్వీట్లు మాత్ర‌మే ల‌భ్య‌మ‌వుతాయి. ఇదే స‌మ‌యంలో 2010లో పాలేక‌ర్ ఉద్య‌మానికి రామ్ ప్ర‌భావితుడ‌య్యారు. వికారాబాద్‌లో 43 ఎక‌రాలు స్వంతంగా తీసుకున్నారు. దీనిని క‌నీవిని ఎరుగ‌ని రీతిలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. వ‌రి విత్త‌నాలు, 16 ర‌కాల ఆకు కూరలు, కూర‌గాయ‌ల విత్త‌నాలు, 200 ర‌కాల వివిధ ర‌కాల వ‌రి విత్త‌నాలు సేక‌రించారు. ఆయ‌న కొంతమందితో క‌లిసి సేవ్ అనే స్వచ్చంధ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ‌కు జాతీయ స్థాయిలో 50 మంది త‌మ తోడ్పాటును అంద‌జేస్తున్నారు.

2014లో మొద‌టి సారిగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో విత్త‌న పండుగ‌ను నిర్వ‌హించారు. ఇక అప్ప‌టి నుంచి నేటి దాకా ఈవిత్త‌నాల పండుగ కొన‌సాగుతూనే ఉంది. ఈ విత్త‌నాల‌ను వేల మంది తీసుకున్నారు. ఒక్కో విత్త‌నం ఒక్కో ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంటుంద‌ని చెబుతారు విజ‌య్‌రామ్‌. గ‌ర్భం నిలిచేలా, పాలు వ‌చ్చేలా ఈ విత్త‌నాలు తోడ్ప‌డ‌తాయంటారు. యూనివ‌ర్శిటీల‌లో అంతుప‌ట్ట‌ని ర‌హ‌స్యాల‌ను తాము ప‌రిశోధించి తెలుసుకున్నామ‌ని అంటారు. వ్య‌వ‌సాయ శాస్ర్త‌వేత్త‌ల ప్ర‌శ్న‌ల‌కు మేం స‌మాధానాలు చెప్పాం. ఖ‌ర్చు లేకుండా చేయ‌డ‌మే మేం సాధించిన విజ‌యం. ఇక అనుమానాలు ఎందుకంటారు రామ్‌.

ఎన్నో ర‌కాల ఆవులు, ప‌శువులు పెంచుతున్నాం. ఓ వైపు ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ఇంకో వైపు ప‌శువుల పోష‌ణ‌..సంర‌క్ష‌ణ ఇదంతా నిరాటంకంగా కొన‌సాగుతూనే ఉన్న‌ది. జ‌డ్చ‌ర్ల స‌మీపంలోని జేప‌ల్లి గ్రామంలో స‌త్య‌, రఘు అనే ఇద్ద‌రు 100 ఎక‌రాల్లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం సాగు చ‌స్తున్నారు. మంత్రులు పోచారం, ల‌క్ష్మారెడ్డి స్వ‌యంగా ప‌రిశీలించి సంతృప్తిని వ్య‌క్తం చేశారు. కేవ‌లం 10 శాతం నీళ్లు, 10 శాతం మాత్ర‌మే క‌రెంట్ వాడ‌తామ‌ని ఇక ఎలాంటి ఖ‌ర్చు ఉండ‌దంటారు. అధిక దిగుబ‌డి, ప‌శువుల ర‌క్ష‌ణ ఇదే ప్ర‌కృతి వ్య‌వ‌సాయం సాధించిన విజ‌యం అంటారు రామ్‌.

రాబోయే 20 ఏళ్ల‌లో దేశ వ్యాప్తంగా పాలేక‌ర్ విధానం అమ‌లు చేయాల‌న్న‌దే మా సంక‌ల్పం. ఆ దిశ‌గా తెలుగు రాష్ట్రాల‌లో రైతులను ఆ దిశ‌గా శిక్ష‌ణ ఇచ్చి..అవ‌గాహ‌న క‌ల్పించి జూనియ‌ర్ పాలేక‌ర్లుగా త‌యారు చేసేందుకే ఈ ప్ర‌య‌త్న‌మంతా. మేం చెబితే కొంతమందికి మాత్రమే వెళుతుంది. స‌మాజ హిత‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్న శ్రీ‌శ్రీ‌శ్రీ చిన‌జీయ‌ర్ స్వామి లాంటి వారు ఆదేశిస్తే కోట్ల మందికి మా శిక్ష‌ణ చేరుతుంది. వారు జిల్లా స్తాయి, నియోజ‌క‌వ‌ర్గ , మండ‌ల , గ్రామాల స్థాయికి తీసుకు వెళ‌తారు.

ఒక్క హైద‌రాబాఆద్ న‌గ‌రంలోనే 2000 దాకా ఇంకుడు గుంత‌లు నిర్మించారు విజ‌య్‌రామ్ . వ‌ర్ష‌పు నీరు వృధా కాకుండా ఉండ‌డ‌మే కావాల్సింది. అదే మ‌నిషిని కాపాడుతుందంటారు.పాలేక‌ర్ విధానం వ‌ల్ల ఎక‌రా చెరుకు పంట‌లో 110 ట‌న్నుల దిగుబ‌డి సాధించ‌డం ఓ రికార్డ్.

ప్ర‌భుత్వం సీడ్‌బౌల్ గా మారుస్తానంటోంది. ప్ర‌తి రైతుకు ఉచితంగా ఎరువులు ఇస్తామ‌ని చెబుతోంది..ఎరువులకు బ‌దులు ప్ర‌తి ఇంటికో గోవును ఉచితంగా ఇస్తే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని విజ‌య్ రామ్ అంటారు. కేర‌ళ‌లో పాలేక‌ర్ ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై శిక్ష‌ణ ఇస్తుండ‌గా ఆవు వ‌ల్ల ఉప‌యోగాల గురించి చెబుతుండ‌గా 50 మంది ముస్లింలు స్టేజీపైకి వ‌చ్చారు. ఆవు వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయ‌ని తెలియ‌దు..ఇక నుంచి మేం పూజిస్తామ‌ని చెప్ప‌డం పాలేక‌ర్ సాధించిన విజ‌యానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 3 వేల‌కు పైగా సెమినార్లు నిర్వ‌హించారు. ఇది కూడా ఓ రికార్డేనంటారు రామ్‌.

పాలేక‌ర్ విధానాల‌ను అవ‌లంభిస్తే దేశం మ‌రో మూడు దేశాల‌కు ఆహార నిల్వ‌ల‌ను అంద‌జేసే స్థాయికి చేరుకుంటుందంటారు. ఇక దివ్వ‌సాకేతంలో రైతుల‌కు ఉచిత శిక్ష‌ణ ఇచ్చేందుకు నిర్ణ‌యించాం. సేవ్‌తో పాటు స్వామి వారు అడిగిన తక్ష‌ణ‌మే అంగీక‌రించారు. ఉచితంగా స్థ‌లాన్నికేటాయించారు. ఇది తొమ్మిది రోజుల పాటు జ‌రుగుతుంది. 2500 మంది రైతులు ఇక్క‌డ శిక్ష‌ణ తీసుకుంటారు. అక్క‌డి నుంచి వారు జూనియ‌ర్ పాలేకర్లుగా త‌యారై తాము నేర్చుకున్న పాఠాల‌ను రైతుల‌కు బోధిస్తారు.

పాలేక‌ర్ ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై అవ‌గాహ‌న క‌ల్పించి సాగు చేసుకునేలా తీర్చిదిద్దుతారు. ఇందు కోసం తమ సంస్థ త‌మ వ్య‌వ‌సాయ క్షేత్రంలో త‌యారైన విత్త‌నాలు, కూర‌గ‌యాలు, దేశీయ ఆవుల పాలు, పెరుగుతోనే శిక్ష‌ణ కోసం వ‌చ్చే వారికి ఏర్పాటు చేస్తున్నామ‌ని రామ్ తెలిపారు. అంతేకాకుండా నీటి సౌక‌ర్యాన్ని మై హోం యాజ‌మాన్యం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింద‌న్నారు. శిక్ష‌ణా స‌మ‌యంలో పాలేక‌ర్‌తో పాటు చిన‌జీయ‌ర్ స్వామీజీ కూడా ఉంటార‌ని అన్నారు. ఇదంతా మాకు ఆ దైవం ఇచ్చిన అవ‌కాశ‌మే న‌ని చెబుతారు విజ‌య్ రామ్‌.ఆయ‌న మ‌నిషి నుండి మ‌నీషిగా ఎదిగారు. రైతుల క్షేమం కోసం..ఎలాంటి ఖ‌ర్చు లేకుండా వ్య‌వ‌సాయం సాగు చేయ‌డం కోసం జీవితాన్ని ధార‌పోశారు. రాబోయే రోజుల్లో వేలాది మంది పాలేక‌ర్ల‌ను త‌యారు చేయాల‌న్న ఆయ‌న సంక‌ల్పం గొప్పది. ఈ ప్ర‌భుత్వాలు , వ్య‌వ‌స్త‌లు చేయ‌లేని ప‌నుల్ని ఈ ఆకుప‌చ్చ‌ని భూమి పుత్రుడు చేస్తున్నారు.. ఆయ‌న స‌దాశ‌యం నెర‌వేరాల‌ని..రైతుల క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల‌ని కోరుకుందాం.

No comments