Header Ads

స్వ‌ర్గ‌ధామం ..శృంగేరి పీఠం - ఆధ్యాత్మికం

ఎక్క‌డ ప్ర‌శాంతత ల‌భిస్తుందో..ఎక్క‌డ మ‌న‌సు స్వేచ్ఛా వాయుల‌ను పీలుస్తుందో..ఎక్క‌డ ప్ర‌కృతి ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకుని పురివిప్పి నాట్యం చేస్తుందో ..అక్క‌డ అంత‌రాలు లేని ఆనంద‌మేదో మ‌న‌ల్ని చుట్టేస్తుంది. కాలం ప‌రుగులు తీస్తుంటే బ‌తుకు గురువై బోధిస్తుంది..ప‌క్క‌దారులు ప‌ట్ట‌కుండా ఆత్మ హెచ్చ‌రిస్తుంది. స‌నాత‌న ధ‌ర్మం పుణ్య‌మా అంటూ భార‌తీయ సంస్కృతి కొన్ని త‌రాలుగా ఈ దేశంలో విరాజిల్లుతూ వ‌స్తోంది. ధ‌ర్మం నాలుగు పాదాల‌లో న‌డిచేలా..మ‌నుషుల్లో ఆత్మ జ్యోతుల‌ను వెలిగించేందుకు ఎంద‌రో మ‌హానుభావులు ఈ నేల‌పై న‌డ‌యాడారు. జీవితాల‌ను త్యాగం చేశారు. అకుంఠిత దీక్షా ద‌క్ష‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. వారి బోధ‌న‌ల‌తో స‌మాజాన్ని ప్ర‌భావితం చేయ‌డ‌మే కాకుండా త‌రాల‌కు స‌రిప‌డా విలువ‌ల‌ను వ‌దిలేసి వెళ్లి పోయారు.
జీవిత‌మంటే కాసులు కొల్ల‌గొట్ట‌డం కాదు. ఆస్తులు సంపాదించు కోవ‌డం కాదు. ఆత్మ నిగ్ర‌హంతో ప‌ది మందికి సాయం చేయ‌డం. ప‌దుగురిలో మంచి వారుగా మెల‌గ‌టం. సృష్టిలోని ప్ర‌తి ప్రాణిలో దైవాన్ని చూడ‌టం. ప్ర‌తి ఒక్క‌రితో స‌ఖ్య‌త క‌లిగి ఉండ‌టం. యోగులు, బాబాలు, గురువులు, పీఠాధిప‌తులు ఎవ‌రికి తోచిన రీతిలో వారు భ‌క్తిత‌త్వాన్ని బోధిస్తూ వ‌చ్చారు. గురునాన‌క్‌, క‌బీర్‌, ఆదిశంక‌రాచార్య‌, రామానాజాచార్య‌, పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి లాంటి వారు ఈ స‌మాజాన్ని కొంత మార్చాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. కాలాన్ని ఒడిసి ప‌ట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ టైంను వేస్ట్ చేస్తూ డాల‌ర్ల మాయ‌లో ప‌డి కొట్టుకు చ‌స్త‌న్న న‌యా జ‌మానా పాడ‌వ‌కుండా కొన్ని నియ‌మ నిబంధ‌న‌ల పేరుతో బోధ‌న‌లు చేశారు.

వారు సంచ‌రించిన ప్రాంతాల‌న్నీ ఇపుడు జ్ఞాన నిల‌యాలుగా మారాయి. కొన్ని పీఠాలుగా మ‌రికొన్ని ఆశ్ర‌మాలుగా త‌మ‌కు తోచిన రీతిలో సేవ‌లు అందిస్తున్నాయి. త‌మిళ‌నాడులో ఆశ్ర‌మాలు, క‌ర్ణాట‌క‌లో పీఠాలు ఎక్కువ‌. వీటిపై కూడా కొన్ని ఆరోప‌ణ‌లు లేక పోలేదు. ఇపుడు వాటి గురించి, వాటిని నిర్వ‌హిస్తున్న వారి గురించి ప్ర‌స్తావించ‌డం మంచి ప‌ద్ధ‌తి కాదు. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ఆరాధించే ప్రాంతంగా బెంగ‌ళూరుకు 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఆదిశంక‌రుడు స్తాపించిన శ్రీ శృంగేరీ పీఠం వినుతికెక్కింది. పొద్దు ప్రారంభమైప్ప‌టి నుంచి చీక‌టి ప‌డేదాకా క్ర‌మ‌ప‌ద్ధ‌తిన సాగుతుంది. క‌ఠోర‌మైన శ్ర‌మ..బ్ర‌హ్మ‌చ‌ర్యం త‌ప్ప‌క పాటించాల్సిందే. ఉచితంగా విద్య‌, వైద్యం, బోధ‌న‌, ఆధ్యాత్మిక ప‌ర‌మైన భావ‌ప‌రంప‌ర నిరాటంకంగా కొన‌సాగుతూనే ఉన్న‌ది.

దీపం వెలుగుతూనే ఉండాలి. ఆ వెలుగు ఎంత దూర‌మైనా వెళ్ల‌గ‌లిగేలా..దారిని చూపించ‌గ‌ల‌గాలి. మ‌నంద‌రిలోని ఆత్మ‌లు ఆ దీపాల్లాగే ప్ర‌స‌రిస్తూ ఉండాలి అంటారు జ‌గ‌మెరిగిన భార‌తీ తీర్థ. శృంగేరీ పీఠాన్ని ఎంద‌రో పీఠాధిప‌తులు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కానీ స్వామీజీ హ‌యాంలో ఒక వెలుగు వెలిగింది. ప్ర‌పంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. దీనిని ఆరాధ్య దైవంగా కాకుండా భ‌క్తుల కొంగు బంగారంగా..స్వ‌ర్గ ధామంగా మ‌లిచారు. ఎన్నో పాఠ‌శాల‌లు , పేద‌ల‌కు ఉచితంగా వైద్యం అందించేలా ఆస్ప‌త్రులు క‌ట్టించారు. నిత్య అన్న‌దానం ప్ర‌వేశ పెట్టారు. ఆయ‌న చేయ‌ని కార్య‌మంటూ లేదు.

మనం మనలాగా వుండాలంటే ఏం చెయ్యాలి. ప్రశాంతమైన జీవితాన్ని పొందాలంటే. దగ్గరి దారులు ఏమైనా ఉన్నాయా లేక సులభమైన పద్ధతులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. కాలగమనములో మనం ప్రాపంచిక ప్రపంచం నుండి ఆవల వైపు చూస్తే తెలుస్తుంది మనమేమిటో..మన బతుకేమిటో. చిన్ని చిన్ని ఆనందాల కోసం ..కొద్దిపాటి జీవనం కోసం ఎన్నో కుట్రలు ఇంకెన్నో అబద్దాలు ..అన్నిటిని మించి మోసాలు ..ఆరోపణలు. ధర్మబద్ధమైన జీవితం అర్థం కావాలంటే మ‌న లోని దివ్యత్వాన్ని ఆస్వాదించాలి. అప్పుడే మనంలోని మహత్తు ఏమిటో తెలుస్తుంది. భౌతిక సుఖాల కోసం వెంపర్లాడే మనందరి స్థాయి ఏమిటో అర్థమవుతుంది అంటారు ఓ స‌మ‌యంలో శ్రీ స్వామీజీ. జగద్గురు శంకరాచార్యుల వారసత్వాన్ని కొన‌సాగించారు. భారతీయ ఔన్నత్యాన్ని కాపాడారు.

15 ఏళ్ళ వయసులో సన్యాసం స్వీకరించారు. అదీ అయన గొప్పతనం . సకల శాస్త్రాలను స్వామీజీ అవపోసన పట్టారు. దైనందిన కాలంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపారు. పవిత్రత ..నిబద్దత ..ధర్మబద్ధత ఇదే కావాల్సింది అంటారు. ఏం కోల్పోతున్నారో తెలుసుకోవడం లేదు. ధ్యానం ఒక భాగం కావాలి . వేదాల సారాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ తత్వశాస్త్రాలను ఆమూలాగ్రం గ్రంధస్థం చేయాలి. పలు భాషల్లో ప్రావీణ్యం ..అపారమైన జ్ఞానం..అంతకంటే ఆయనలోని స్థితప్రజ్ఞత భక్తుల్ని ఆక‌ట్టుకున్న‌ది. భారతీయ పరంపర కొనసాగుతోంది. అదే ఇక్కడ దర్శనమిస్తోంది. విశాలమైన ప్రాంతం. గురువు అన్న పదం గొప్పది. అందరూ గురువులు కాలేరు. దానికి సాధన చేయాలి . జీవితాన్ని త్యాగం చేయాలి. అప్పుడే ఆ పరమ పవిత్రమైన స్థానాన్ని చేరుకోగలం. ఇది అన్నిటికి వర్తిస్తుంది.

కొన్ని త‌రాల పాటు ఆధ్యాత్మిక భావ జ‌ల‌ధార‌ను దేశ వ్యాప్తంగా ప్ర‌స‌రించేలా చేసిన ఆ మ‌హోన్న‌త రూపం చెద‌ర‌కుండా అలాగే ఉన్న‌ది. ఆయ‌న వార‌స‌త్వాన్ని 37వ పీఠాధిప‌తిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న విధుశేఖ‌ర భార‌తి స్వామీజీ గురువు బాట‌లో న‌డుస్తున్నారు. భ‌క్తుల్లో దివ్య జ్యోతులు వెలిగించేందుకు న‌డుం బిగించారు. జీవితంలో ఒక్కసారైనా భ‌క్తిత‌త్వంతో నిండిన ఆ అత్య‌ద్భుత‌మైన శృంగేరి పీఠాన్ని ద‌ర్శించండి. మనల్ని మనం తెలుసుకుంటాం. మనం గతం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తాం. ఆధ్యాత్మికత లోని వైభవాన్ని అవలోకనం చేసుకుంటాం. అందుకే గురుభ్యోనమః అనక తప్పదు.!

No comments