Header Ads

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ సాధ్యం - సుభాష్ పాలేక‌ర్.!

ఆయ‌న ప్ర‌కృతి ప్రేమికుడు. పురుగు మందులు, ఎరువుల పేరెత్తితే చాలు ఆయ‌న ఉగ్ర‌రూపం దాల్చుతాడు. ఆయ‌న నిజ‌మైన భర‌త‌మాత ముద్దుబిడ్డ‌. మ‌ట్టిత‌నం క‌ల‌బోసుకున్న మ‌నిషి శ్రీ సుభాష్ పాలేక‌ర్‌. మ‌హారాష్ట్రకు చెందిన ఆయ‌న దేశాన్ని మందుల బారి నుండి కాపాడాల‌ని, రైతుల‌కు ఎలాంటి బ‌రువు లేకుండా వ్య‌వ‌సాయం సాగు చేసేలా చేయాల‌ని ప‌క్షిలా అంత‌టా తిరుగుతున్నారు. జ‌నాన్ని చైత‌న్య వంతం చేస్తున్నారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయం వ‌ల్ల గ‌ణ‌నీయ‌మైన లాభాలు పొంద‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా కొద్దిసేపు మాట్లాడారు. త‌న అనుభ‌వాల‌ను ఆయ‌న పంచుకున్నారు.
ప్ర‌కృతి ఎంతో ఇచ్చింది. ఇంకా ఇస్తోంది. కానీ మాన‌వులు మాత్రం ఏమీ చేయ‌డం లేదు. ఇంకా ముందుకు వెళ్లి ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగిస్తున్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. అన్నం పెట్టే అన్న‌దాత‌ల‌కు తిండి క‌రువైంది. ఇలాంటి క‌రువు ప‌రిస్థితుల్లో గ‌ట్టెక్కాలంటే ఒక్క‌టే మార్గం ప్ర‌కృతి వ్య‌వ‌సాయం సాగు చేయ‌డం. బోర్లు వేసుకుంటూ పోతున్నారు. దేని కోసం ఇదంతా. సాగు చేయాలంటే కాలువలు త‌వ్వాల‌ని, అడ్డుకట్ట‌లు వేయాల‌ని వ్య‌వ‌సాయ అధికారులు, ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. ఇదంతా అవ‌స‌రం లేనే లేదంటారు పాలేక‌ర్‌. ఇపుడు వాడుతున్న నీటిలో కేవ‌లం 10 శాతం ఉప‌యోగించుకుంటే చాలు దేనినైనా పండించ‌వ‌చ్చ‌ని అంటారు.

ఇదంతా చిత్త‌శుద్ధి లేక పోవ‌డం, ప్ర‌కృతి వ్య‌వ‌సాయంపై అవ‌గాహ‌న లేక పోవ‌డం , అధికంగా అప్పులు చేసి వ్య‌వ‌సాయం సాగు చేయ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మంటారు పాలేక‌ర్ . దీని నుండి గ‌ట్టెక్కాలంటే ఉన్న వాటితోనే స‌రిపెట్టుకుని సాగు చేయ‌వ‌చ్చ‌ని చెబుతారు. ఒక ఎక‌రా వ‌రి పండించాల‌న్నా, వేరుశ‌న‌గ‌, కందులు, జొన్న‌లు సాగు చేయాల‌న్నా ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చ‌వుతోంది. ఒక్క రూపాయి లేకుండా సాగు చేయ‌వ‌చ్చ‌ని తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని సుభాష్ స‌వాల్ చేస్తున్నారు.

వ్య‌వ‌సాయ నిపుణులు, శాస్త్ర‌వేత్త‌లు తామేదో ఘ‌న‌కార్యం సాధించామ‌ని అనుకుంటున్నారు..కానీ దేశానికి, రైతుల‌కు ఏం కావాలో అది చేయ‌డం లేదు. ముందు వీరు మారాలి. అపుడే రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంటారాయ‌న‌. పెట్టుబ‌డులు అంత‌కంత‌కూ పెరిగి పోతున్నాయి. కానీ దానికి త‌గ్గ‌ట్టు దిగుబ‌డి రావ‌డం లేదు. చేసిన అప్పులు తీర్చ‌లేక ధ‌ర రాక రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.ఇది న‌న్ను క‌ల‌చి వేస్తోంది. ర‌సాయ‌నాలు, మందుల‌తో సాగు చేయ‌డం వ‌ల్ల దిగుబ‌డి మాటేమిటో కానీ లేని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. దీంతో ల‌క్ష‌లాది రూపాయ‌లు హాస్పిట‌ల్స్‌కు చెల్లిస్తున్నాం. మీ ఆరోగ్య‌మే కాదు మీ భ‌విత‌వ్యం కూడా మీ మీదే ఉందంటారు పాలేక‌ర్‌. ప్ర‌కృతితో మ‌మేకం కావాలి. అది నేర్పే పాఠం త‌ల్లి కూడా నేర్ప‌దు.


ఎవ‌రు నేర్పారు అడ‌వికి పూలిమ్మ‌ని..ఫ‌లాలు ఇవ్వ‌మ‌ని..ఎవ‌రి స‌హ‌కారం లేకుండానే చెట్లు, మొక్క‌లు విస్త‌రించ‌డం లేదా. ఒక్క‌సారి ఆలోచించండి. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు వాటిల్లే ఏ ప‌నీ చేయ‌కండి. త‌క్ష‌ణ‌మే ప్ర‌మాద‌ఘంటిక‌లు మోగిస్తున్న ఆ ఎరువులు, పురుగు మందులు, ర‌సాయ‌నాల‌ను వాడ‌డాన్ని నిలిపి వేయండి అని పిలుపునిస్తున్నారు. వ్య‌వ‌సాయ రంగంలో అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తిగా మిమ్మ‌ల్ని కోరుకుంటున్నా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ‌మే మేలైన ప‌ద్ధ‌తి. దీనిని ఎంత త్వ‌ర‌గా మీరు స్వీక‌రించి ఆచ‌రిస్తారో మీకున్న ఇబ్బందుల‌న్నీ తొల‌గి పోతాయి.

మీకు మీరే ధ‌న‌వంతుల‌య్యే అవ‌కాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను జీరో బ‌డ్జెట్ నేచుర‌ల్ ఫార్మింగ్ ను ఏర్పాటు చేశా. ఖ‌ర్చు లేని ప్ర‌కృతి వ్య‌వ‌సాయం . దీనిపై కొన్నేళ్లుగా నేను ప‌రిశోధ‌న‌లు చేశా. ఆ వ‌చ్చిన అనుభ‌వం , ఫ‌లితాల ఆధారంగానే దేశ‌వ్యాప్తంగా తిరుగుతున్నా. ల‌క్ష‌లాది మందికి దీనిపై విస్తృతంగా శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింది. అందులో భాగంగానే ఇక్క‌డ శిక్ష‌ణ ఇచ్చేందుకు వ‌చ్చా. నేను చెబితే కొంద‌రు మాత్ర‌మే అర్థం చేసుకుంటారు. కానీ కోట్లాది మంది భ‌క్తులు క‌లిగిన స్వామీజీ స‌మ‌క్షంలో చెబితే ఆయ‌న రైతుల‌కు పిలుపునిస్తే ఆ సందేశం ల‌క్ష‌లాది మంది రైతుల‌కు చేరుకుంటుంది అంటారు పాలేక‌ర్.
ప్ర‌కృతి వ్య‌వ‌సాయం అంటే దానిని భూత‌ద్దంలో చూడాల్సిన ప‌నిలేదు. చాలా సులువైన ప‌ద్ధ‌తి ఇది. దీనిలో ఎరువులు, క్రిమిసంహార‌కాల వినియోగం ఉండ‌దు. వ‌ర్మీ కంపోస్ట్ అవ‌స‌రం ఉండ‌దంటారు. ప్ర‌కృతి సిద్ధంగా తాము త‌యారు చేసిన జీవామృతం ఉప‌యోగించి సాగు చేయొచ్చు. మార్కెట్ నుంచి ఏదీ కొనాల్సిన ప‌నిలేద‌. దీనికంత‌టికీ ఒక్క పైసా ఖ‌ర్చు కాదు. కేవ‌లం 10 శాతం నీరు మాత్ర‌మే అవ‌స‌ర‌మ‌వుతుంది. గాలిలో ఉండే తేమ‌లోని 90 శాతం నీరు ఈ సాగు ప‌ద్ధ‌తిలో ఉప‌యోగించుకుంటామంతే. ఆశించిన దానికంటే ఫ‌లితం  క‌నిపిస్తోంది. ఇక రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దంటారు సుభాష్‌. సేంద్రీయ వ్య‌వ‌సాయం వైపు ప‌రుగులు తీస్తున్నారు. ఇది ఓ మోసం. నాలుగు రెట్లు ఎక్కువ ఖ‌ర్చ‌వుతుంది. చివ‌రికి దిగుబ‌డి త‌క్కువ‌గా వ‌స్తుంది. సాగు చేశాక‌..పంట అవ‌శేషాల‌ను త‌గుల బెడ‌తారు. దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుంది. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విధానంలో ఏదీ కోల్పోవ‌డం అంటూ ఉండ‌దంటారు పాలేక‌ర్‌.

సాగు ఎలా చేయాలో కాదు ఎలా పండించు కోవాలో..మార్కెట్ ఎలా చేసుకోవాలో..ఏది వేయాలో ఏది వేయ‌కూడదో చెబుతున్నా. వీరిలో 500 మంది సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు ఉన్నారు. మారుతున్న వ్య‌వ‌సాయ విధానం బాగా లేద‌ని ఎలా అన‌గ‌లం ఆయ‌న ఎదురు ప్ర‌శ్న వేశారు. కాసిన్ని నీటి వ‌న‌రులుంటే చాలు ప్ర‌కృతి సాగు ద్వారా ఏడాదికి 6 నుంచి 10 ల‌క్ష‌లు దాకా ఆదాయం పొంద‌వ‌చ్చు. ఉన్న కొలువులు వ‌దిలేస్తున్నారు. ఈ సాగు బాగుంద‌ని పొలం బాట ప‌డుతున్నారంటారు ఆయ‌న‌. ఆయ‌న అనుభ‌వాల‌ను నేటి ప్ర‌భుత్వాలు అర్థం చేసుకోవాలి. ఆచ‌ర‌ణాత్మ‌కంగా అమ‌లు చేస్తే ఈ దేశానికి పురుగు మందులు, ర‌సాయ‌నాలు లేని ఆహారాన్ని అందించిన వాళ్ల‌వుతారు.

No comments