Header Ads

అమృతసర్ రైలు ప్రమాదంలో అతను పలువుర్ని కాపాడాడు. కానీ తన ప్రాణాలను కోల్పోయాడు..!

పంజాబ్‌లో తాజాగా ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం విదితమే. అమృతసర్‌లోని ధోబీ ఘాట్ గ్రౌండ్‌లో జరిగిన రావణ దహనం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలంతా పెద్ద ఎత్తున గుమి గూడి రైల్వేట్రాక్స్‌పై నిలబడ రావణ దహనాన్ని వీక్షిస్తుండగా అకస్మాత్తుగా ట్రాక్స్ మీదకు వచ్చిన జలంధర్-అమృతసర్ రైలు జనాల మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో 61 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా జనాలకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో కొంత మందిని మాత్రం ఆ వ్యక్తి కాపాడాడు. అయితే అలా వారిని కాపాడే క్రమంలో తాను రైలు కింద పడి ప్రాణాలను కోల్పోయాడు.




దల్బీర్ సింగ్ అనే వ్యక్తి ప్రతి ఏటా దసరా సందర్భంగా నిర్వహించే నాటకాల్లో పాల్గొంటుంటాడు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వేషాలను వేస్తాడు. ఈసారి అతను రావణుడి వేషం వేసి నాటకంలో అలరించాడు. అందుకు గాను ట్రోఫీని కూడా అందుకున్నాడు. అయితే అనంతరం నిర్వహించిన రావణ దహన కార్యక్రమాన్ని కూడా అతను వీక్షించాడు. ఆ సమయంలో రైలు ట్రాక్స్‌కు దగ్గరగా ఉన్న దల్బీర్ సింగ్ జనాల అరుపులు విని అక్కడకు వేగంగా పరిగెత్తి కొందరిని రక్షించాడు. కానీ అతని కాలు ట్రాక్స్ మధ్యలో ఇరుక్కోవడంతో అతను తప్పించుకోలేకపోయాడు. దీంతో అతని మీద నుంచి ట్రెయిన్ దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.


అయితే దల్బీర్ సింగ్‌పై అతని తల్లి, భార్య ఆధార పడ్డారు. దల్బీర్ సింగ్‌కు 8 నెలల  వయస్సున్న కుమార్తె కూడా ఉంది. కాగా ఆ కుటుంబానికి దల్బీర్ సింగే జీవనాధారం కావడంతో ఇప్పుడు వారిని పోషించే వారు లేకుండా పోయారు. ఈ క్రమంలో దల్బీర్ సింగ్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారి బంధువులు కోరుతున్నారు. ఏది ఏమైనా.. ఈ రైలు ప్రమాదం మాత్రం ఎంతో మంది కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. దల్బీర్ సింగ్ కుటుంబాన్ని ఎవరో ఒకరు ఆదుకోవాలని కోరుకుందాం..!

No comments