Header Ads

జగన్ పై విరుచుకుపడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మీద ఒక యువకుడు దాడి చేసిన విషయం అందరికి తెలిసిందే.  అయితే ఈ మొత్తం సంఘటన మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.  వైజాగ్  విమానాశ్రయంలో  వైకాపా పార్టీ అధినేత  జగన్‌ పై దాడి వ్యవహారం అరాచకానికి పరాకాష్ట అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు .ఇది బీజేపీ స్క్రిప్ట్, అంతా డ్రామాలా ఉంది . అంతమంది హడావుడిగా ఖండించడాన్ని ఏమనుకోవాలి ? ఇలాంటి వాటికి భయపడమని, కేంద్రానికీ ఇదే హెచ్చరిక. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి నేపథ్యంలో ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద గురువారం రాత్రి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దాడి జరిగిన ప్రదేశం కేంద్రం పరిధిలో వుంది . దాడి జరిగిన తరువాత బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి నేరుగా హైదరాబాద్ వెళ్లారన్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రథమ చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లి, తరువాత ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడాన్ని ఏమనుకోవాలి . దాడి జరిగిన వెంటనే నేరుగా డీజీపీకి గవర్నర్ ఫోన్ చేసి అడగటం ఏమిటని ముఖ్యమంత్రి నిలదీశారు. అలా అధికారికి ఫోన్ చేయడం సరికాదన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత జనసేన నేత పవన్‌కళ్యాణ్  కూడా మాట్లాడటం, తెలంగాణ   ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వడం ఏమిటన్నారు.
ఆంధ్ర రాష్ట్రంపై అంత మమకారం ఉంటే తిత్లీ తుపాను సమయంలో ఎందుకు స్పందించలేదన్నారు. ఈ రాష్ట్రంపై ఎందుకంత ద్వేషమంటూ ప్రశ్నించారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన సంఘటనపైనా సందేహాలు ఉన్నాయన్నారు. విమానాశ్రయం సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉందని, క్రిమినల్ కేసులో గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా, విమానం ఎక్కించి పంపడాన్ని ఏమనుకోవాలన్నారు. ఇదంతా డ్రామాలా ఉందన్నారు. జీవీఎల్, సురేష్‌ప్రభు మాట్లాడటం ఏమిటన్నారు. జగన్‌కు వీరాభిమాని అయిన వ్యక్తి ఈ డ్రామా ఆడారంటే ఏమి చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. నిందితుడి నాన్న, అమ్మ వైఎస్ అభిమానులని, తాను జగన్ వీరాభిమానినని అతనే చెబుతున్నాడన్నారు.

ఎప్పుడైనా ఘటన జరిగిన వెంటనే జాతీయ రహదారిపై కూర్చుని అల్లర్లు చేస్తారా? అని నిలదీశారు. దాడి చేసింది మీవాడని, ఘటన జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రదేశంలో అని ఆయన వివరించారు. కానీ ధర్నా ఎక్కడ చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ జరగని నాటకానికి ఇంతమంది ఎందుకు రియాక్టు అవుతున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా, బాధ్యత కలిగిన నేతగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆలస్యంగా స్పందిచడం, దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని మీదగ్గరే ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిందితుడు తమకు ఇల్లు ఇవ్వలేదని చెబితే, అతని తల్లితండ్రులు ప్రభుత్వం తమకు ఇల్లు ఇచ్చిందని చెబుతున్నారన్నారు. ఎవరైనా శాంతిభద్రతలను దెబ్బతీయాలనుకుంటే జాగ్రత్త అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నానని, మీ డ్రామాలు ఇక్కడ కుదరవని స్పష్టం చేశారు. తమపై చేసే కుట్రలకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇవి తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం ఆడే నాటకాలన్నారు. ఈ రాష్ట్రంలో అస్థిరత్వాన్ని సృష్టించే పని చేపట్టారన్నారు. ఏపీ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని, అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో హామీలు అడిగితే కుట్రలు చేస్తున్నారన్నారు.


ఐటీ దాడులు చేస్తున్నారని, కలెక్టర్ల సదస్సు రోజు కూడా దాడులు చేశారని ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పవన్, జగన్ మాట్లాడరని, ఇప్పుడు కేసీఆర్ తోడయ్యారన్నారు. ఎందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షించబోమని, ఇది కేంద్రం అసమర్థత, భద్రతా వైఫల్యమన్నారు. ఇది క్రిమినల్ కేసు అని, ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు వెళ్లకుండా చట్టాన్ని గౌరవించలేదన్నారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది జగన్‌ను ఎందుకు ఆసుపత్రికి తరలించలేదని ప్రశ్నించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. చట్టం మన ఇష్టప్రకారం చుట్టం అవుతుందని మోదీ నేర్పించారని, అది వీళ్లు అనుసరిస్తున్నారన్నారు.

తెలుగుదేశం పార్టీ, తెలుగుజాతి ఇలాంటి సంక్షోభాలను ఎన్నింటినో ఎదుర్కొందన్నారు. మీరు చేస్తున్న దాడులు ఏపీ ప్రజలపై చేస్తున్న దాడులన్నారు. ఇలాంటి నీచాతినీచమైన పనులు చేస్తున్నవారిని ఏమనాలన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, పరిహాసానికి కూడా వీలులేదన్నారు. పులివెందులలో విధ్వంసం ప్రారంభించారని, రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీనటుడు శివాజీ చెప్పినట్లు జరుగుతోందని, ఇది బీజేపీ స్క్రిప్టు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించి ఒక దశలో రాష్టప్రతి పాలన విధించడం ద్వారా టీడీపీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని శివాజీ చెబుతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై రోజుకో రిపోర్టు ఢిల్లీకి పంపిచడం గవర్నర్‌కు ఆనందమన్నారు. గవర్నర్ వ్యవస్థ ఏమిటి? కుతంత్రాలు ఏమిటన్నారు. గవర్నర్ పరిధి ఏమిటని ప్రశ్నించారు. గవర్నర్‌కు ఏమికావాలన్నా తనను అడగాలని, కానీ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థపై చర్చ జరగాలన్నారు. అగ్రిగోల్డ్ మీకే ఇస్తామని, దాడులతో భయపడనని హెచ్చరించారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమన్నారు. తాను బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ విషయం తెలిసిన వెంటనే మూడు గంటల పాటు కలెక్టర్ల సమావేశానికి హాజరుకాకుండా అన్ని అంశాలపై చర్చించానన్నారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందన్నారు. ధర్నాలు చేయటంపై ప్రజలకు క్షమాపణ చెప్పండని, తమ కార్యకర్తే తమ నేతపై దాడి చేశారని చెప్పండని చంద్రబాబు సూచించారు.

No comments