Header Ads

నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?

ఒక కాన్పు చేసి వచ్చిన నేను చెమటలు తుడుచుకుంటూ గదిలోకి వచ్చి కూర్చున్నాను. కాన్పు చేసేటప్పుడు పేషెంటుకే కాదు, మాకూ(డాక్లర్లకు) చెమటలు పడతాయి. సాధారణ ప్రసవమైతే మరీనూ. అలా అరగంట కూర్చున్నానో లేదో మా నర్సు పిలిచింది "మేడమ్, ఇప్పుడు డెలివరీ అయిన అమ్మాయి దాహం అంటోంది" అని చెప్పింది. "మంచి నీళ్లు ఇవ్వమని చెప్పు" అన్నాను. "లేదు మేడమ్ ఆమెతో వచ్చినవారు నీరు ఇవ్వొద్దంటున్నారు" అంది. వెంటనే నేను అక్కడికి పరుగుపరుగున వెళ్లి ఆమెకు దగ్గరుండి నీళ్లు తాగించాను.
మా ప్రాంతంలో బాలింతరాళ్లకి మంచినీళ్లు ఎక్కువ ఇవ్వకూడదనీ, ఇస్తే నెమ్ము చేరుతుందనీ, వాతం వస్తుందని.. ఇలా చాలా మూఢ నమ్మకాలున్నాయి. చిన్నచిన్న గ్లాసుల్లో కొలిచినట్లు రోజుకు పావు లీటరుకు మించకుండా తాగిస్తుంటారు.దీంతో శరీరానికి నీరు చాలినంత అందక కొందరు పేషెంట్లు డీహైడ్రేషన్ ,యూరినరీ ఇన్ఫెక్షన్, ఇతర సమస్యల బారిన పడుతుంటారు.అందుకే, ఈ విషయంలో నేను కాస్త కచ్చితంగా ఉంటాను. అదీకాక దాదాపు మూడు తరాల క్రితం మా ఇంట్లో జరిగిన అలాంటి ఒక ఘటన కూడా నన్ను భయపెడుతూ ఉంటుంది.

నీళ్లు ఇవ్వకపోతే ఫిట్స్ కూడా రావచ్చు:

పాశ్చాత్య దేశాలలో సాధారణ కాన్పు అయిన వెంటనే చక్కటి భోజనం పెడతారని తెలుసు. మన ప్రాంతాల్లో నార్మల్ డెలివరీ అయిన వెంటనే భోజనం పెట్టొచ్చని చెప్పినా ఎవరూ వినిపించుకోరు. మూడు రోజులయ్యాక గానీ తిండి పెట్టరు

అసలు మామూలుగా ఉన్న వాళ్లకంటే బాలింతరాళ్లకే బలమైన, పరిశుభ్రమైన సమతులాహారం, మంచి నీళ్లు ఎక్కువ అవసరం. కాన్పు అయిన మహిళ తన శరీరంలోని రక్తం, నీరు కోల్పోయి ఉంటుంది. అదీకాక బిడ్డకి పాలివ్వాలంటే ఆమెకు సరైన ఆహారం, మంచినీళ్లూ చాలా అవసరం. పాలిచ్చే ముందు ప్రతి తల్లి రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి.
మనవాళ్లు మూఢ నమ్మకాలలో బాలింతరాళ్లను ఊహించలేని పథ్యాలు పెడతారు. అవి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వుంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కారప్పొడులూ, వేపుడు కూరలూ, వెల్లుల్లీ ఎక్కువగా తినిపించి, మజ్జిగ, పెరుగు ఇవ్వడం మానేస్తారు. దాంతో విపరీతంగా దాహం వేస్తుంది. కానీ, అరిచి, గీపెట్టినా చుక్క నీళ్లివ్వరు.

ఆ పరిస్థితిలో డీహైడ్రేషన్‌కి గురై వారికి మూత్రం సరిగా రాదు. దాంతో యూరినరీ ఇన్ఫెక్షన్లు, జననాంగాల ఇన్ఫెక్షన్లతోపాటు, అది ఇంకా తీవ్రమైన దుష్పరిణామాలకి కూడా కారణమవ్వవచ్చు.ఒక్కోసారి డీహైడ్రేషన్ తీవ్రం కావడం వల్ల మెదడులో రక్తం గూడు కట్టి ఫిట్స్ కూడా రావచ్చు.

వీటిని దృష్టిలో పెట్టుకునే సిజేరియన్ అయితే ఆరు గంటల తర్వాత, సాధారణ కాన్పు అయితే గంట తర్వాత నేను మంచినీళ్లు, ఇతర ద్రవ పదార్థాలను దగ్గరుండి మరీ తాగిస్తుంటాను.

No comments