Header Ads

జగన్ పైన దాడి చేసిన వ్యక్తి ఎవరు,ఎందుకు పొడిచాడు ? పూర్తి సమాచారం.!

వైజాగ్ విమానాశ్రయం లో వైకాపా పార్టీ అధినేత జగన్ పైన దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే,జగన్ పైన దాడి చేసిన నిందితుడి పేరు శ్రీనివాసరావు . దాడి తర్వాత నిందితుని స్వస్థలం అయిన తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కలకలం రేగింది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక పెదపేటలోని శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, ఆ గ్రామవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు, మీడియా ప్రతినిధులు భారీగా తమ ఊరుకు రావడంతో వారంతా కలవరానికి గురయ్యారు.‘‘నా తమ్ముడు శ్రీనివాసరావు మనుషులను చంపేంత చెడ్డవాడు కాదు.

ఎప్పుడూ ఎవరితోనూ గొడవలకు వెళ్లేవాడు కాదు. పైగా వాడికి వైఎస్‌ జగన్‌ అన్నా, వైసీపీ అన్నా ప్రాణం. నిత్యం బందోబస్తులో ఉండే జగన్‌పై దాడి చేయడం అంత సులభమైన విషయం కాదు. మరి ఇదంతా ఎలా, ఎందుకు వాడు చేశాడో అర్థం కావడంలేదు’’ అని వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు జనిపెల్ల సుబ్బరాజు వాపోయారు.ఇటీవలిదాకా శ్రీనివాసరావు ఊళ్లోనే ఉన్నాడని, పని దొరకడంతో 8 నెలల క్రితమే విశాఖ వెళ్లాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు. తమ దగ్గర ఉన్నంతకాలం శ్రీనివాసరావు బాగానే ఉన్నాడని, అతని మానసిక స్థితి కూడా బాగానే ఉందని అన్నయ్య సుబ్బరాజు తెలిపారు.



తమ ప్రాంతం (ముమ్మిడివరం)లో జగన్‌ పాదయాత్ర చేసిన సమయంలో శ్రీనివాసరావు విశాఖలోనే ఉన్నాడని తెలిపారు. వైసీపీ కార్యక్రమం ఏది జరిగినా గ్రామంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి హడావుడి చేసేవాడని తల్లిదండ్రులు చెప్పారు. ‘గురువారం లంకలో ఉపాధిపనులకు వెళ్లాం.

ఇంటికి వచ్చేసరికి మా చిన్నోడు జగన్‌ను చంపేందుకు కత్తితో దాడి చేశాడని తెలిసింది. వాడి గురించి వింటుంటే భయం వేస్తోంది. జగన్‌ పుట్టినరోజు వస్తే భారీ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి వేడుకలు జరిపేవాడు. మా వాడు చాలా మంచోడు. ఎప్పుడూ ఏ గొడవలకూ వెళ్లేవాడు కాదు. మా కుటుంబానికి జగన్‌ అన్న లాంటివాడు. అలాంటి నేతను ఎందుకు మా కుమారుడు చంపాలని చూశాడో తెలియడం లేదు’’ అని తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు వాపోయారు. కూలీపనులు చేసుకొనే తాతారావు, సావిత్రిల ఐదో కుమారుడు శ్రీనివాసరావు. పదో తరగతి వరకు ఠాణేలంకలో చదువుకున్నాడు. కుటుంబంలోని వారంతా మొదటినుంచీ కాంగ్రెస్‌ అభిమానులే. శ్రీనివాస్‌ మాత్రం జగన్‌ వీరాభిమానిగానే కొనసాగుతున్నాడు.

కోడిపందేలంటే పిచ్చి, జగన్‌ అంటే ప్రాణం, శ్రీనివాసరావు గురించి అతని గ్రామంలో ఎవరిని కదిలించినా చెప్పే విషయం ఇదే. కోళ్ల పందేలు మీద పెంచుకొన్న ఆ పిచ్చి వల్లే చదువుకు దూరమయ్యాడని గ్రామస్థులు తెలిపారు.

శ్రీనివాసరావు ఇది వరకు చేసిన నేరాలు గురించి సమాచారం :

శ్రీనివాసరావుకు కొంత నేరచరిత్ర ఉన్నట్టు సమాచారం. కాగిత వెంకటేశ్‌ అనే యువకునిపై 2017లో దాడికి పాల్పడ్డ కేసులో ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. గ్రామంలో వివాహేతర సంబంధాల విషయంలో పలుమార్లు గ్రామపెద్దలు శ్రీనివాసరావును మందిలించినట్టు తెలుస్తోంది.

No comments