ఒకప్పుడు అతను ఆక్స్‌ఫర్డ్‌లో ప్రొఫెసర్.. ఇప్పుడు ఢిల్లీలో బిచ్చమెత్తుకుంటున్నాడు..!
ఓడళ్లు బళ్లు.. బళ్లు ఓడలు అవడం అంటే ఇదే.. ఒకప్పుడు బాగా బతికిన వారు కూడా అనుకోని ఆర్థిక సమస్యల కారణంగా రోడ్డున పడతారు. ఆ వ్యక్తి జీవితం కూడా అంతే అయింది. కన్న కొడుకుల కోసం లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జాబ్ వదిలి ఇండియాకు వచ్చి వారిని చదివించి ప్రయోజకులను చేస్తే చివరకు.. ఆ కొడుకుల ఆదరణకు అతను నోచుకోలేదు. దీంతో ఇప్పుడతను యాచకుడిగా మారి రోడ్లపై నివాసం ఉంటూ అత్యంత దుర్భర పరిస్థితిలో జీవనం సాగిస్తున్నాడు.
అతని పేరు రాజాసింగ్ పూల్. వయస్సు 74 ఏళ్లు. ఆక్స్ ఫోర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశాడు. తన కుమారులకు మంచి విద్యను అందించి వారిని ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో డబ్బులు బాగా సంపాదించవచ్చని చెప్పి 1960లలో లండన్ లోని ఆక్స్ ఫోర్డ్ వర్సిటీలోని ప్రొఫెసర్ ఉద్యోగం వదిలేసి తమ్ముడితో కలిసి ఇండియా వచ్చాడు. అనంతరం తమ్ముడితో కలిసి ముంబైలో మోటార్ పార్ట్ ల వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ రాజాసింగ్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. కొన్నేళ్లకు తమ్ముడు చనిపోయాడు. దీంతోపాటు వ్యాపారం కూడా బాగా దెబ్బతింది. అయినప్పటికీ తన కుమారులకు ఉన్నత విద్యను అందించడం కోసం తన ఆస్తులను తనఖా పెట్టాడు. మరో వైపు ఉద్యోగం చేస్తూ ఓ కుమారుడిని లండన్, మరో కుమారుడిని అమెరికా పంపించాడు.
అలా రాజాసింగ్ రోడ్డున పడినా ఢిల్లీలోని యూకే కాన్సులేట్ సెంటర్ దగ్గర అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇవ్వటంతోపాటు వీసా దరఖాస్తు చేసుకోవటానికి వచ్చే వారికి సాయం చేస్తూ వారు ఇచ్చే సొమ్ముతో తన కడుపు నింపుకునేవాడు. ఈ క్రమంలోనే యూకే వీసా కోసం కాన్సులేట్ కు వచ్చిన అవినాష్ అనే వ్యక్తి.. రాజాసింగ్ ఇంగ్లీష్ పరిజ్ణానం, వీసా దరఖాస్తులో అని పనితనం చూసి షాక్ అయ్యాడు. దీంతో రాజాసింగ్ గురించిన విషయాలను అడగ్గా అతను తన వివరాలను అవినాష్‌కు చెప్పాడు. దీంతో అవినాష్ అతను చెప్పిన విషయాలను విని చలించిపోయాడు. ఈ క్రమంలో రాజాసింగ్ ఫొటోలు, వివరాలతో ఫేస్ బుక్ లో అవినాష్ ఓ పోస్ట్ పెట్టాడు. ఏప్రిల్ 21వ తేదీ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. మూడు రోజుల్లోనే ఏకంగా 5వేలకు పైగా షేర్లతో ఆ పోస్ట్ ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు చేరింది. దీంతో వారు వెంటనే స్పందించి రాజాసింగ్ పూల్ ను ఢిల్లీలోని ఓల్డేజ్ హోంకి తరలించారు. అతని పోస్ట్ చూసిన ఎంతో మంది పూర్వ విద్యార్థులు, మానవతా వాదులు సాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఏది ఏమైనా అలాంటి తండ్రిని అలా నడిరోడ్డున వదిలేసిన ఆ కొడుకులను అస్సలు క్షమించరాదు..!
Post a Comment