డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం తాగకపోయినా పాయింట్లు? అలా రావడానికి కారణం ఇదేనట!
బ్రీత్ అనలైజర్ పరీక్షలో డొల్లతనం బయటపడింది. మద్యం తాగని ఓ వ్యక్తి తాగినట్టు పాయింట్లు నమోదవడం వివాదాస్పదమైంది. బాధితుడు సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. శాలిబండకు చెందిన సయ్యద్ జహంగీర్ ఖాద్రి(35) పాలు, నెయ్యి విక్రయించే వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. కోఠిలో ఓ దుకాణంలో నెయ్యి ఇచ్చేందుకు శాలిబండ నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఆ సమయంలో కాచిగూడ చౌరస్తా వద్ద పోలీసులు డ్రంకెన డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఖాద్రిని ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించారు. 43 పాయింట్లు నమోదు కావడంతో మద్యం తాగి వాహనం నడుపుతున్నావంటూ ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
తనకు మద్యం తాగే అలవాటు లేదని… తాగకుండా తాగినట్టు ఎలా పాయింట్లు నమోదయ్యాయంటూ వాగ్వాదానికి దిగాడు. గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రానికెళ్లి కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత న్యాయస్థానానికెళ్లి ఫైన్ కట్టి వాహనం తీసుకెళ్లమని అతడిని అక్కడి నుంచి పంపించేశారు.మద్యం తాగకపోయినా వాహనం సీజ్ చేశారంటూ అదేరోజు రాత్రి సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఖాద్రిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి మద్యం తాగలేదని రాసిచ్చారు. ఆ చీటీ తీసుకొని సుల్తాన్ బజార్ పోలీసుల వద్దకు వెళ్లగా ట్రాఫిక్ పోలీసుల వద్దకు వెళ్లమని చెప్పి చేతులెత్తేశారు.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వివరణ ఇలా ఉంది.. ఖాద్రీని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా 43 శాతం బీఏసీ చూపించడంతో వాహనం సీజ్ చేశాం. మద్యం తాగలేదని పోలీసులతో వాదించాడు. ఉస్మానియా ఆస్పత్రికెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. వైద్యులు అతడి ముఖం చూసి మద్యం తాగలేదని రాసిచ్చారు. అది మాకు సంబంధం లేదు. ఖాద్రి ఆల్కహాల్ తాగాడని నిర్ధారణ కావాలంటే రక్త నమూనాలను ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తే అసలు విషయం తెలుస్తుంది. బ్రీత్ అనలైజర్ సరిగానే పనిచేస్తోంది.సాధారణంగా ట్రాఫిక్ సిబ్బంది బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్ష నిర్వహిస్తే బీఏసీ 35 శాతం దాటితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. వైద్యులు కళ్లు, గొంతు, వాసన, నడకను పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. ఈ పరీక్షల్లో 40 శాతం లోపు బీఏసీ ఉన్నవారిని గుర్తించడం కష్టమని అంటున్నారు. 40 శాతం దాటితే గుర్తించే అవకాశాలుంటాయి. అయితే జహీర్ విషయంలో 43 శాతం వాస్తవమే అయినప్పటికీ ఆసుపత్రికి వెళ్లేసమయానికి తీవ్రత తగ్గే అవకాశముందని అంటున్నారు. ఏవైనా టాబ్లెట్స్ వాడినా తీవ్రత తగ్గుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ కేసు బ్రీత్ ఎనలైజర్ టెస్టులపైనే వివాదం.
Post a Comment