కొత్తవాహనం కొనాలనుకునే వారికి కేంద్రమే రాయితి ఇవ్వనుంది. !
కార్ లేదా టూవీలర్ కొనుగోలు చేద్దామని చూస్తున్నారా..? అయితే కొన్ని రోజుల వరకు ఆగండి. తరువాత పెట్రోల్, డీజిల్ కాకుండా ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనాన్ని కొనుగోలు చేయండి. దీంతో మీకు భారీ స్థాయిలో డిస్కౌంట్ లభిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇది మేం చెబుతోంది కాదు, కేంద్ర ప్రభుత్వమే తాజాగా ఒక ప్రకటన చేసింది. అందులోని సారాంశమే ఇది. దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న వాహనాల సంఖ్యకు తోడు ఇంధన ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. దీంతోపాటు వాయు కాలుష్యం కూడా ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే ఇన్ని ఇబ్బందులకు చెక్ పెట్టాలంటే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగం ఒక్కటే మార్గమని కేంద్రం ఆలోచించింది. అందుకు అనుగుణంగానే త్వరలో కొత్త వాహన విధానాన్ని కేంద్రం అమలులోకి తేనుంది.
కేంద్రం త్వరలో అమలులోకి తేనున్న నూతన వాహన విధానం వల్ల ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేసే వారికి, ఆ వాహన తయారీ కంపెనీలకు భారీ రాయితీలను కేంద్రం ఇవ్వనుంది. రూ.15 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారు కొంటే రూ.2.50 లక్షలు, ఎలక్ట్రిక్ టూ వీలర్ కొంటే రూ.30వేలు, పెట్రోల్, డీజిల్ కారును ఎక్స్ఛేంజ్ చేసి ఎలక్ట్రిక్ కారు కొంటే రూ.1.50 లక్షల వరకు రాయితీని కేంద్రం వినియోగదారులకు ఇవ్వనుంది. అలాగే ఈ తరహా వాహనాలను తయారు చేసే కంపెనీలకు కూడా ప్రోత్సాహకాలను ఇవ్వనుంది. ఇందుకు గాను మొత్తం రూ.9,400 కోట్ల ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేసింది.
అయితే కేంద్రం త్వరలో అమలులోకి తీసుకు రానున్న ఈ నూతన వాహన విధానానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ డ్రాఫ్ట్‌కు ఆమోదం తెలిపితే అప్పుడు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొని ఎంచక్కా పెద్ద ఎత్తున డిస్కౌంట్లను పొందవచ్చు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్కసారి గనక వినియోగంలోకి వస్తే వాటి కోసం చార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 1000 వరకు చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ముందుగా మెట్రో నగరాల్లో ఈ పాయింట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలను వాడేవారు మార్గమధ్యలో చార్జింగ్ అయిపోతుందన్న బెంగ లేకుండా సదరు పాయింట్లలో చార్జింగ్ పెట్టుకోవచ్చు. మరి ఈ తరహా వాహనాలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది కదా..!
Post a Comment