ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను రాజులా చేయాలి. అంటే ఎక్కువగా తినాలి. మధ్యాహ్నం భోజనం యువరాజులా చేయాలి. అంటే మామూలుగా, మధ్యస్తంగా చేయాలి. రాత్రి పూట భోజనం పేదవాడిలా చేయాలి. అంటే… చాలా చాలా తక్కువగా తినాలి..! ఇదీ… భోజనం విషయంలో మన పెద్దలు చెప్పే మాట. పెద్దలు ఏది చెప్పినా అది చద్దన్నం మూటేగా. దాంతో మనకు లాభాలే గానీ నష్టాలు లేవు. సైంటిఫిక్‌గా చూసినా వారు చెప్పే విషయాలు కరెక్టే. ఇక భోజనం విషయంలో వారు పైన చెప్పిన మాట కూడా కరెక్టే..! ఎందుకంటే పలువురు వైద్యులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు.
ఉదయం పెద్ద ఎత్తున ఆహారం తీసుకోవాలట. అదే మధ్యాహ్నం కొంచెం తగ్గించి తినాలి. ఇక రాత్రి పూట చాలా తక్కువగా తినాలి. అలా తింటేనే ఆరోగ్యం కలుగుతుందట. కానీ కొందరు ఉదయం పూర్తిగా బ్రేక్‌ఫాస్ట్ మానేసి, ఏకంగా మధ్యాహ్నం హడావిడిగా లంచ్ చేస్తున్నారు. ఇక రాత్రి పూట ఖాళీగా ఉంటారు కాబట్టి అదే పనిగా లాగించేస్తున్నారు. దీని వల్ల ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. కనుక ఉదయం బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా చేయాల్సిందేనని వారు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచిన గంట లోపు టిఫిన్ చేస్తే దాంతో శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. మెదడు ఉత్తేజమవుతుంది. ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి. అలా చేయకపోతే ఇక రోజంతా ఒత్తిడితో, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతారట. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదట. దీంతోపాటు మెటబాలిజం రేటు బాగా తగ్గి లావుగా తయారవుతారట. ఇది క్రమేపీ గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులకు దారి తీస్తుందట. కనుక ఉదయాన కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలని వైద్యులు అంటున్నారు.
అయితే బ్రేక్‌ఫాస్ట్ రోజూ ఒకేలాంటిది కాకుండా, నిత్యం ప్రోటీన్లు, హెల్దీ ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్ కలిగిన ఆహారం తీసుకోవాలని అంటున్నారు. దీని వల్ల శరీరానికి పౌష్టికాహారం లభిస్తుందట. ముఖ్యంగా చిన్నారులకు ఇలా పెట్టడం వల్ల వారు చదువుల్లో రాణిస్తారట. మెమోరీ కూడా షార్ప్ అవుతుందట. ఓట్స్, తృణధాన్యాలు, కోడిగుడ్లు వంటి ఆహారం తింటే మంచిదని న్యూట్రిషనిస్టులు సలహా ఇస్తున్నారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయడం వీలుకాకపోతే ఒక గ్లాస్ పాలు, కొన్ని నట్స్ తిన్నా చాలని అంటున్నారు. దాంతో శరీరానికి శక్తి, పోషకాలు దండిగా లభిస్తాయని అంటున్నారు. కనుక… ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేయవద్దని వైద్యులు చెబుతున్నారు..!
Post a Comment