అతను ఒకప్పుడు అమెజాన్ లో డెలివరీ బాయ్.. ఇప్పుడు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నాడు. ఎలాగోతెలుసా..?
మనస్సుంటే మార్గముంటుంది.. కష్టపడాలి.. పనిచేయాలి.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే తపన ఉంటే చాలు.. అందుకు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. దాన్ని ఫాలో అయితే చాలు.. కష్టాలు ఆటోమేటిక్ గా తొలగిపోతాయి. సంపద కలుగుతుంది. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సరిగ్గా ఈ విషయాన్ని నమ్మాడు కనుకనే అతను డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ ఆ పని వదిలేసి సొంతంగా కంపెనీ ప్రారంభించాడు. తన కంపెనీ సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమించాడు. ఇప్పుడు ఆ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతున్నాడు. ఒకప్పుడు డెలివరీ బాయ్ గా పనిచేసిన అతను ఇప్పుడు నెల నెలా లక్షల రూపాయలను సంపాదిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...
అది రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతం. అక్కడ నివాసం ఉండే రఘువీర్ సింగ్ పెద్దగా చదువుకోలేదు. దీంతోపాటు కుటుంబ పోషణ భారం కూడా అతనిపై పడింది. దీంతో అతను అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా చేరాడు. రూ.9వేల నెల జీతానికి పని చేసేవాడు. అయితే బైక్ లేకపోవడం వల్ల అతను సైకిల్ పై వెళ్లి ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేసేవాడు. ఈ క్రమంలో అతను మధ్యాహ్న సమయంలో ఒక్కోసారి భోజనం చేయకుండా కేవలం టీ తాగి కడుపు నింపుకునేవాడు. అయితే అతను డెలివరీలు చేసే గ్యాప్‌లోనే టీ తాగేవాడు. దీంతో ఒక్కోసారి అతనికి టీ బండి కనబడక చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. అయితే అదే అతని కొత్త కంపెనీకి ఐడియానిచ్చింది.
మంచి టీ కావాలంటే ఎవరైనా ఎంతో దూరం వెళ్తారు. కానీ అదే టీని ఈ-కామర్స్ వస్తువులను డెలివరీ చేసినట్టు ఇంటికే డెలివరీ చేస్తే ఎలా ఉంటుంది ? సరిగ్గా ఇదే ఆలోచించాడు రఘువీర్ సింగ్. అంతే చేస్తున్న డెలివరీ బాయ్ పని మానేశాడు. తక్కువ ఖర్చుతో ఓ బైక్‌ను కొన్నాడు. ఓ చిన్న కంపెనీ పెట్టాడు. స్థానికంగా టీ విక్రయించే వారికి వద్దకు వెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాట్సాప్ ద్వారా టీ ఆర్డర్లను తీసుకునేవాడు. 15 నిమిషాల్లో అడిగిన వారికి అడిగినట్టు టీలను డోర్ డెలివరీ చేయడం మొదలు పెట్టాడు. అంతే.. ఆ ప్రయోగం సక్సెస్ అయింది. ఇక రఘువీర్ వెనక్కి తిరిగి చూడలేదు.
అలా రఘువీర్ పెట్టిన కంపెనీ క్రమ క్రమంగా వృద్ధిలోకి రాసాగింది. దీంతో అతను తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఇప్పుడతని వద్ద నాలుగు బైక్ లున్నాయి. వాటి ద్వారా జైపూర్‌లో రోజుకు 500 నుంచి 700 టీలను డెలివరీ ఇస్తున్నాడు. దీంతో అతనికి నెలకు రూ.1 లక్ష వరకు ఆదాయం వస్తోంది. అయితే ఇకపై తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేస్తానని రఘువీర్ అంటున్నాడు. ఏది ఏమైనా అతని ఆలోచనకు, అతను పడుతున్న కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Post a Comment