Header Ads

ఎట్టకేలకు చెడ్డి గ్యాంగ్ దొంగలు దొరికారు. ఎలా చిక్కారో తెలుసా , హ్యాట్స్ ఆఫ్ పోలీస్

వరుస దొంగతనాలతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ కు ఎట్టకేలకు హైదరాబాద్ రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. ప్రజలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలను సవాల్ గా తీసుకున్న పోలీసులు...నెల రోజులపాటు గాలించి... ఉత్తరాది రాష్ట్రాల పోలీసులు సాయంతో చివరకు గుజరాత్ లో ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మరో మూడు ముఠాలు సిటీలో ఉన్నాయని సమాచారం రావటంతో వారికోసం విస్తృత తనిఖీలు చేపట్టారు.
చెడ్డీ గ్యాంగ్ పేరు వినపడితే చాలు సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న జనం హడలిపోయేవారు. చెడ్డీ గ్యాంగ్ భయానికి చాలా ప్రాంతాల్లో రాత్రి సమయంలో నిద్రకూడా మానేసి కాపలా కాసిన సందర్భాలున్నాయి. ఏ సమయంలో ఎటు నుంచి దొంగతనం జరుగుతుందో తెలియక జనం బెంబేలేత్తేవారు...రెండు రాష్ట్రాల్లో చెడ్డీగ్యాంగ్ చేసిన హల్ చల్ తో హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పోలీసులతో పాటు, రెండు రాష్ట్రాల పోలీసులు నిఘా పెంచారు. తెలుగు రాష్ట్రాలను ముప్పతిప్పలు పెట్టిన చెడ్డీ గ్యాంగ్ కోసం ఉత్తరాది రాష్ట్రాలలో తనిఖీలు చేపట్టిన రాచకొండ పోలీసులు నెలరోజుల పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో తీవ్రంగా గాలించి...చివరకు గుజరాత్ లో ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని ఓ గ్రామంలో స్థానికుల సహకారంతో ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.వీరిచ్చిన సమాచారంతో సిటీలో తిష్ట వేసిన మరో మూడు టీమ్స్ కోసం గాలింపు చేపట్టారు.

గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గర్బాద్ మండలం సహద గ్రామానికి చెందిన ఈ ముఠాలకు సంబంధించి కరుడుగట్టిన ముగ్గురు సభ్యులను అరెస్టు చేశారు. దీంతో 28 కేసుల మిస్టరీ వీడింది. గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. మీర్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధి బీఎన్‌రెడ్డినగర్‌లోని శ్రీ సాయి బాలాజీ అపార్ట్‌మెంట్‌లో గత ఏడాది నవంబర్‌లో తాళం వేసి ఉన్న ఓ ఫ్లాట్‌లో చెడ్డీ గ్యాంగ్ చోరీ చేసింది. పట్టుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మెన్‌పై వారు రాళ్లతో దాడిచేసి పారిపోయారు. ఈ దొంగలను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు దాదాపు ఆరు నెలలకు పైగా సుదీర్ఘంగా ఆపరేషన్ దాహోద్ పేరుతో గాలించి పూర్తి సమాచారం సేకరించారు.

వారి కోసం గుజరాత్‌కు వెళ్లారు. దినేశ్ అనే ముఠా సభ్యుడిని పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గర్బాద్ మండలం సహద గ్రామంలో వేట కొనసాగించినా దొంగల ఆచూకీ దొరకలేదు. వారికోసం ఎల్బీనగర్ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌తోపాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు నిరంతరం నిఘాపెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. దొంగతనం చేసేందుకు వీరు నేర్చుకున్న విద్యలు తెలిస్తే ఆశ్యర్య పోవలసిందే...అమాయకంగా కనిపించటం...ఎంత కొట్టినా నోరు విప్పకుండా మూగవాడిలా నమ్మించటంలో చెడ్డీగ్యాంగ్ దిట్ట...ఇతర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడే ఈముఠా సొంత ఊళ్లో మాత్రం మంచి వారిగా నటిస్తారు. ఒక వేళ పోలీసులు పట్టుకునేందుకు వెళ్లినా స్థానికులకు వీరి మీద ఏమాత్రం అనుమానం ఉండక పోవటంతో ఈ గ్యాంగ్ ను పట్టుకోవటం పోలీసులకు సవాల్ గా మారింది.

ఖాకీ సినిమాని తలపించిన పోలీసులు :


ఇటీవల విడుదలైన ఖాకీ సినిమా లాగా పోలీసులు చాల కష్టపడి ,నెల రోజుల గాలింపు అనంతరం గుజరాత్ లో మకాం వేసిన రాచకొండ పోలీసులు దహోడ్ ప్రాంతానికి చెందిన కిషన్, బధియా, భారత్ సింగ్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నాయకుడు రాంజీ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. పట్టుబడిన ముగ్గురి ద్వారా సిటీలో మరో నాలుగు ముఠాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

దొంగతనాలకు వాడేది కేవలం ఒక వస్తువు మాత్రమే :


చెడ్డి గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు చోరి చేసే విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సిటీకి వచ్చే చెడ్డీ గ్యాంగ్ ఒక్కొక్క ముఠా ఒక్కో స్టేషన్ లో దిగిపోతారు. స్పాట్ ఎంచుకొని రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి వరకు పక్కనే ఉండే అటవీ ప్రాంతంలో తలదాచుకొని చీకట్లో చోరీకి పాల్పడతారు. చోరికి వీరు వాడే ఆయుధం ఒక్క ఇనుపరాడ్డు మాత్రమే. ఎవరైనా అడ్డువస్తే రాళ్లతో దాడి చేసి పారిపోతారు. దోపిడీ సమయంలో ముఠాలో ఎవరైనా చీలిపోయినా ఫలానా స్టేషన్ లో కలుసుకోవాలనే పథకం రూపొందించుకుంటారు. పోలీసులకు పట్టుబడిన ముఠాపై హైదరాబాద్ లో మొత్తం 28 కేసులు ఉండగా..ఆంధ్రప్రదేశ్ లో మరో 15 కేసులు నమోదయ్యాయి.. నిందితుల నుంచి 100 గ్రాముల బంగారం, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు...మరికొన్ని చోరీ వస్తువులను రీకవరీ చేసే పనిలో ఉన్నారు.

‘చోరీలు చేసేందుకు రైలు మార్గం ద్వారా వచ్చే వీరు 4 ప్రాంతాలను ఎంచుకొని ఒక్కో స్టేషన్‌లో దిగిపోతారు. ఆయా స్టేషన్లలో ఇద్దరు ఉంటే మరో ఇద్దరు వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి వచ్చేవారు. శివారు ప్రాంతాల్లో ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవారు. పగటి వేళ అడవి లాంటి ప్రాంతంలో ఉండి రాత్రి కాగానే ప్యాంట్, షర్ట్‌ విప్పేసి చెడ్డీ వేసుకొని నడుంకు షర్ట్‌ చుట్టుకొని చెప్పులు చేతపట్టుకొని చోరీకి బయలుదేరతారు. శరీరానికి నూనెను రాసుకుంటారు.

గోడలు ఎక్కి దూకే సందర్భంలో ప్యాంట్‌ వేసుకొని ఉంటే కిందపడే అవకాశముంటుందని చెడ్డీలు ధరిస్తారు. తాళాలు పగులగొట్టడంలో అనుభవమున్న ఇద్దరు ఆ పనిచూస్తారు. చోరీలు చేశాక ఒక ప్రాంతంలో కలుసుకుంటారు. చందానగర్‌ ప్రాంతంలో జరిగిన చోరీని దినేశ్‌ గ్యాంగ్‌ చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీపావళికి 2 నెలల ముందు, సంక్రాంతికి హైదరాబాద్‌ వచ్చి చోరీలు చేస్తుంటామని విచారణలో తెలిపారు.

No comments