Header Ads

బిగ్ బజార్ లో చెప్పిన నమస్తే , ఆ అమ్మాయి జీవితాన్నే మార్చేసింది.

తెల్లారితే స్కూల్ హడావుడి ఉంటుందని సండే సాయంత్రమే సతీసమేతంగా సరుకుల కోసం బిగ్ బజార్ లో వేటకు బయలు దేరాడు అరుణ్ తన భార్యతో కలిసి.. భార్య అవసరమైన సామన్లను ఒక్కొక్కటిగా ట్రాలీలో వేస్తుంటే.. తన సంకన ఉన్న కూతురు సిరితో ఆడుకుంటూ మిసెస్ ను ఫాలో అవుతున్నాడు అరుణ్. సోప్ లుండే ప్లేస్ కు వెళ్లారు భార్యాభర్తలిద్దరూ... సార్ నమస్కారం అంటూ ఓ అమ్మాయి అరుణ్ ను విష్ చేసింది. అరుణ్ ఆ పిలుపు విని కూడా విననట్టుండిపోయాడు.., మరోసారి ఆ అమ్మాయి అరుణ్ కు ఎదురుగా వచ్చి విష్ చేసింది..అయినా అరుణ్ ముఖం తిప్పుకొని ఈ సబ్బైతే ఎలా ఉంటుందంటావ్ అంటూ భార్య వైపు తిరిగాడు ఆ అమ్మాయి నుండి తప్పించుకోడానికి..ఇక ఆ అమ్మాయి కూడా అక్కడి నుండి వెళ్లిపోయింది.బిల్ చెల్లించిన తర్వాత ఇంటికొచ్చిన అరుణ్ తో ఎంటండీ..? ఆ అమ్మాయి ఎవరు? అని అడిగింది భార్య, ఎవరో ఏమో నాకూ తెలియదు అంటూ అరుణ్ సమాధానం. మరీ మీరు అంతగా టెంక్షన్ పడ్డారెందుకు ఆ అమ్మాయిని చూసి...? ఓ అదా. పోయిన సారి అలాగే ఆ బిగ్ బజార్ లో నమస్కారం సార్ అని పలకరించింది ఓ అమ్మాయి ..హా నమస్కారం చెప్పమ్మా అన్నందుకు నా డీటైల్స్ మొత్తం రాసుకుంది..ఇక అప్పటి నుండి ఆ ఆఫర్, ఈ ఆఫర్ అంటూ నాఫోన్ కు రెస్ట్ లేకుండా మెసేజ్ లు వస్తూనే ఉన్నాయ్ ...అందుకే ఈ సారి అలా కావొద్దని అలా తప్పించుకున్నా అంటూ ముగించాడు అరుణ్.

తెల్లారి మార్నింగ్..అరుణ్ స్కూల్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు...పద్దూ నా లంచ్ బాక్స్ రెడీనా? అంటూ భార్యను అడుగుతున్నాడు. టెన్ మినిట్స్ అంటూ సమాధానం.అప్పటి వరకు సిరితో ఆడుకుందామని అత్తగారి దగ్గర ఆల్బమ్ చూస్తున్న సిరి దగ్గరికి వెళ్లాడు.. డాడీ ఎక్కడా ..?అని అత్తగారు అడుగుతుంటే...ఆ పాప ఫోటోలో ఉన్న అరుణ్ ను గుర్తుపట్టి చూపిస్తుంది. మా బంగారమే అంటూ సిరికి ఓ ముద్దిచ్చి ఆల్బమ్ వైపు చూశాడు అరుణ్.. ఆ అల్బమ్ ను అలానే చూస్తుండిపోయాడు..


వెంటనే బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు..ఎవండీ బాక్స్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది పద్దూ..వద్దన్నట్టు చేయూపి వెళ్ళిపోయాడు అరుణ్.... ఇంటిదగ్గర స్టార్ట్ చేసిన అరుణ్ పల్సర్ బిగ్ బజార్ దగ్గర ఆగింది. సేమ్ నిన్న సోప్ స్టాండ్ ప్లేస్ కు వెళ్లాడు..అక్కడ ఓ అమ్మాయి తో నిన్న ఇక్కడ ఓ అమ్మాయి ఉండాలి కదా..? ఎక్కడా..? అని అడిగాడు. సౌందర్య నా..? ఆ అమ్మాయి నిన్న మీరు వచ్చి వెళ్లిన తర్వాత ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది సార్...అంటూ సమాధానం చెప్పింది మరో అమ్మాయి.... డైరెక్ట్ మేనేజర్ దగ్గరకు వెళ్లాడు అరుణ్ . సార్ మీ హెల్పర్ సౌందర్య డిటైల్స్ కావాలి.? వై..తనేమైనా చేసిందా? అన్నాడు మేనేజర్. లేదు లేదు కావాలి. నిన్ననే ఎడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది.ఈ రోజు నుండి రానని ఫోన్ చేసింది ఉదయమే .... సార్ ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి.

హాలో..! నేను అరుణ్ ను మాట్లాడుతున్నాను..సౌందర్య ఉందా..? లేదండీ నేను వాళ్ల నాన్న మాట్లాడుతున్నాను, నిన్నటి నుండి ఏమీ తినట్లేదు.అలాగే కూర్చొని ఉంది. అయినా ఇంతకి మీరెవరు..? మీ ఇంటికి వచ్చి మాట్లాడుతా...పీపీపీపీపీపీప్..ప్...ప్...ప్ సౌందర్య ఇంటి ముందు అరుణ్ బైక్ ఆగింది. అరుణ్ ను చూసిన సౌందర్య షాక్ అయ్యింది.. సార్ నమస్కారం అంటూ అంతే వినమ్రంగా ప్రణామం చేసింది. సారీ సౌందర్య, నేను గుర్తుపట్టలేక పోయా..? సారీ.. సారీ.. అంటూ అరుణ్ సారీ ల దండకం చదువుతున్నాడు.


పది సంవత్సరాల క్రితం ZP హై స్కూల్...:


అరుణ్ అప్పుడే ఆ స్కూల్ లో మాథ్స్ టీచర్ గా పోస్ట్ లో చేరాడు. అరుణ్ సబ్జెక్ట్ మాథ్స్ యే అయినా అన్ని సబ్జెక్ట్స్ లో జెమ్... ఉస్మానియా యూనివర్సిటీలోనే B.Ed,P.G చేశాడు. గ్రూప్-1 కోచింగ్ కు కూడా వెళ్లాడు కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ మీద ఫుల్ గ్రిప్ ఉంటుంది. అతడి పాఠాలంటే పిల్లలకు చాలా ఇష్టం అప్పటి వరకు 9 ఎక్కాల వరకు రానీ టెన్త్ క్లాస్ పిల్లలు త్రికోణమితి సిద్దాంతాలను సైతం అవలీలగా చెప్పేస్తున్నారు..అంతా అరుణ్ పుణ్యం. మాథ్స్ ఒక్కటే కాదు...డౌటున్న ప్రతి సబ్జెక్ట్ ను... అసలు టీచర్ కన్నా కూడా అర్థవంతంగా ఎన్నోసార్లు వివరించాడు.
ఆ స్కూల్ పిల్లలంతా అరుణ్ సార్ ఫ్యాన్స్.. ముఖ్యంగా సౌందర్య, టెన్త్ క్లాస్ లో ఆ అమ్మాయి చాలా చురుకు..ఈ సారి నువ్వు ఎలాగైనా మండల్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలమ్మా... గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఛీ అనే వాళ్ళంతా రేపు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇక్కడ అడ్మీషన్స్ కోసం క్యూ కట్టాలమ్మా... అంటూ ఆమెలో పదే పదే స్పూర్తినింపేవాడు అరుణ్. నీలో చాలా టాలెంట్ ఉందమ్మా...?నువ్వు తప్పక సాధిస్తావ్... ఆ తర్వాత నీతో గ్రూప్-1 కొట్టిస్తా... నా లక్ష్యాన్ని నీ ద్వారా నెరవేర్చుకుంటా.. అంటూ మరింతగా ప్రోత్సాహించాడు అరుణ్.

ఎగ్జామ్ జరిగాయ్...ఎలా రాశావ్ సౌందర్యా..? చాలా బాగారాశాను సార్... మరో రెండు నెలల్లో రిజల్ట్స్ వస్తాయ్... అప్పటి వరకు వెయిట్ చేద్దాం అన్నాడు. అంతలోనే అరుణ్ కు అక్కడి నుండి వేరే ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ కావడం, తర్వాత పెళ్లి కావడం చకాచకా అయిపోయాయ్... అనుకున్నట్టే సౌందర్య 578 మార్కులతో మండల్ ఫస్ట్ రావడం..ఆ యేడాది ఆ స్కూల్ 100 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది.
కానీ తర్వాత అరుణ్ చాలా బిజీ అయిపోయాడు..ఉన్న టైం అంతా స్కూల్ కి ఇంటికి అప్ అండ్ డౌన్ చేయడంతోనే సరిపోయేదీ.... ఇక సౌందర్య ఇంటర్ కోసం ఓ కాలేజ్ లో జాయిన్ అయ్యింది.. వాళ్ల అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటర్ తర్వాత చదువుకు గుడ్ బై చెప్పింది. అప్పుడే తెలిసినోళ్ల సహాయంతో బిగ్ బజార్లో హెల్పర్ గా జాయిన్ అయ్యింది. కానీ ప్రతిరోజూ గ్రూప్-1 కొట్టాలనే అరుణ్ సార్ మాటలు మాత్రం ఇంకా ఆమె చెవులలో అలాగే మార్మోగుతుండేవి.


ప్రస్తుతం:


ఎంటమ్మా...? ఎందుకు జాబ్ మానేశావ్.. నేను విష్ చేస్తే మీరు ముఖం తిప్పుకున్నారు అంటే... నన్ను ఎప్పుడూ మంచి స్థానంలో ఉండాలని కోరుకునే మీరు నన్ను ఆ హెల్పర్ గా చూసి కావాలనే అలా చేశారనుకున్నాను. కాదు అని అసలు విషయం చెప్పి తనతో తీసుకెళ్లి మళ్లీ అదే బిగ్ బజార్ లో అదే హెల్పర్ పోస్ట్ లో జాయిన్ చేయించాడు అరుణ్ . ఆ రోజు స్కూల్ కు వెళ్లకుండా ఇంటికి వెళ్లి భార్యతో అసలు విషయం చెప్పాడు. తెల్లారి స్కూల్ నుండి రిటర్న్ అవుతూ బిగ్ బజార్ దగ్గర సౌందర్య ను పిక్ అప్ చేసుకొని తన ఇంటికి తీసుకొచ్చాడు అరుణ్... రెండు గంటలు ట్యూషన్ చెప్పాక మళ్లీ ఆమె ఇంట్లో దించి వచ్చాడు..ఇలా సుమారు అయిదు సంవత్సారాల పాటు సాగింది వారి ప్రస్థానం..... ఈ గ్యాప్ లోనే సౌందర్య ఓపెన్ డిగ్రీ చేసి పాస్ అయ్యింది. నెక్ట్స్ టార్గెట్ గ్రూప్-1 అంటూ సౌందర్యలో కసిని పెంచాడు అరుణ్... తర్వాత ప్రిపరేషన్ టైం కూడా పెరిగింది ...చివరి ఆరు నెలలు సౌందర్య ఇంటికి పోవడం కూడా మానేసింది, జాబ్ కూడా....! .తాను కోచింగ్ వెళ్లినప్పుడు ప్రిపేర్ చేసుకున్న సొంత నోట్స్ పై.. రోజూ పేపర్ లో వచ్చిన న్యూస్ పై రెండు యాంగిల్స్ లో చర్చలు చేసేవారు గురు శిష్యురాల్లు. కాబోయే గ్రూప్ 1 ఆఫీసర్ గారు కాస్త ఈ టీ తాగి చదువుకోండి అంటూ వేడివేడి చాయ్ గురుశిష్యులకు అందించేది పద్దూ.

నేడు మద్యాహ్నం మూడు గంటలకే గ్రూప్-1 ఫలితాలు అంటూ పేపర్లో చూసినప్పటి నుండి అరుణ్ కు టెంక్షన్ ఆగట్లేదు.. స్కూల్ కు వెళ్లాడు కానీ ధ్యాసంతా రిజల్ట్ పైనే.....రెండు గంటలకు నెట్ సెంటర్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. ఫలితాలు రిలీజ్ చేశారు అనగానే జేబులో రాసుకొచ్చుకున్న నెంబర్ ను చెక్ చేయించాడు.. సెలెక్టెడ్ అని ఉంది, మరోసారి,మరోసారి,మరోసారి ఇలా ఎన్ని సార్లు చూసిన సెలెక్టెడ్..సెలెక్టెడ్...సెలెక్టెడ్.. అంతే అక్కడ కిక్ కొట్టిన ఇంటి దగ్గర ఆగింది. తాను తెచ్చిన మైసూర్ పాక్ ను సౌందర్యకు తినిపించి యాహూ నువ్వు సాధించావ్ తల్లీ అంటూ అక్కడే అరిచాడు వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కు కెప్టెన్ లాగా. సౌందర్య బుగ్గ మీద పద్దూ ముద్దు... అరుణ్ పాదాల మీద సౌందర్య దండం... సిరినోట తడబడుతూ వచ్చిన గూపువన్ చౌందల్య.

No comments