Header Ads

మా నాన్న మోసగాడు అంటూ తన తండ్రిమీద ప్రేమని వ్యక్త పరిచిన ఒక కూతురి కధ

కొద్దిగా ఓపిక చేసుకొని పూర్తిగా చదవండి. ఇది , మంచి కుటుంబ విలువలు తెలియచేసేటి మరియు హృదయానికి హత్తుకొనే ఒక భావోద్రేక ప్రేరేపిత, చిన్న కథానిక. నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఆ భావోద్రేకానికి లోనవుతారని పంపిస్తున్నాను.
మా నాన్న ఎంతటి మోసగాడు అంటే ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటాడు..
భోజనం చేసేటప్పుడు ఆకలిగా లేదంటాడు.. ఇందాకే తిన్నానూ అంటూ నా కడుపు నిండా తినిపిస్తాడు. ఉద్యోగం చెయ్యక పోయినా - చేస్తున్నానని అంటాడు.. ఆఫీసుకి వెలుతున్నట్లుగా ఫార్మల్ డ్రెస్ వేసుకొని, బయటకి వెళ్ళగానే - మురికి బట్టలు వేసుకొని, బయట ప్రతీ చిన్న చిన్న మురికి పనులూ రాత్రీ పగలూ అని తెలీకుండా చేస్తుంటాడు. నాకు మాత్రం మరకలు లేని, మడత పడనీ బట్టలే వేసుకోవడానికి ఇస్తుంటాడు. తనకి స్థోమత లేకున్నా నన్ను మంచి స్కూల్లో చేర్పించాడు.. స్కూల్ ఫీజులు ఎప్పుడూ చివాట్లు తింటూనే ఆలస్యంగా కట్టేస్తుంటాడు..

ప్రతిరోజూ నాన్న ఒడిలో నిద్ర పోవాలని అనుకుంటాను.. ప్రొద్దున నుండీ ఒళ్ళంతా పులిసిపోయి ఉన్నా, నొప్పిగా ఉన్నా, తన శరీరాన్ని పరుపులా పరిచి, తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. మధ్యలో కరెంట్ పోతే, ఎక్కడ నాకు ఇబ్బందిగా ఉంటుందో అని విసనకర్రతో వీస్తూనే ఉంటాడు..

పుట్టుకతో వచ్చిన నా గుండె లోపాన్ని- ఆపరేషన్ ద్వారా సరిచేయించటానికి బోలెడంత డబ్బు కావాలి. దానికి చాలా డబ్బులు కావాలని డాక్టర్ అంటుండగా విన్నాను. కానీ నాన్న మాత్రం నాతో - మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనీ, వాటితో నీకు బాగు చేయిస్తా, నీకు ఏమీ కాదనీ.. అంటుంటాడు.. అప్పుడూ అబద్దమే చెబుతాడు.. నాకు తెలుసు - నాన్న దగ్గర డబ్బులు లేవనీ.. కానీ, నాకు ఆపరేషన్ చేయించాడు. చేయించేదాకా తెలీదు.. ఎలా డబ్బులు తెచ్చి, చేయించాడో. ఎన్నిసార్లు అడిగినా చిన్న చిరునవ్వే.. " నీకెందుకురా.. నీవు బాగుంటే చాలురా.." అని ముద్దెడుతాడు. నేను బ్రతికాను.. ఆ తరవాత తెలిసింది - నా ఆపరేషన్ కోసం తన కిడ్నీ ఒకటి అమ్మేసి, వచ్చిన డబ్బులతో నా ఆపరేషన్ చేయించాడనీ.. చాలా డబ్బులున్నాయని చెప్పి, ఇలా చెయ్యడం మోసం కాదా ??

మా నాన్నకి నేనంటే ప్రేమ కాదు.. పిచ్చి. ఎప్పుడూ తనకోసం బ్రతకలేదు.. నాకోసమే, నా సంతోషం లోనే బ్రతికాడు. ఎవరేదైనా తినడానికి ఇస్తే, సగం దాచుకొని, అది నాకోసం తెస్తాడు. సంతోషాలన్నీ పూర్తిగా నాకే ఇచ్చేశాడు.. బాధలూ, కష్టాలన్నీ తనే మోస్తున్నాడు. తినడం లో సగం పంచిన నాకూ ఆ కష్టాల్లో సగం పంచొచ్చు కదా.. కానీ అవన్నీ నాకే కావాలంటాడు. ఎంత మోసగాడు కదూ..

ఇన్ని అబద్ధాలాడి నన్ను మోసం చేస్తాడా? ఒక్కటిమాత్రమే నిజం ఎప్పుడూ చెబుతాడు.. నేను నవ్వితే మా అమ్మలా ఉంటానంట. నేను నవ్వితే తనకి ఎంతో సంతోషముగా ఉంటుందంట. నా నవ్వులో - దేవుడి వద్దకి వెళ్ళిన అమ్మ ఆ నవ్వులో తనని పలకరించినట్లు అనిపిస్తుందంట. అందుకే నేను తనకి నవ్వుతూ కనిపిస్తుంటాను.

No comments