Header Ads

ఈ రోజు నుంచి మీరు లంచం ఇస్తే ఇక డైరెక్ట్ గా జైలుకే , కొత్త చట్టం నేటి నుండి అమలు

లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే అనే విషయం మన అందరికి తెలిసిందే . ఇలాంటి కేసుల్లో నిందితులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించడానికి ఉద్దేశించిన కొత్త చట్టానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. రాజకీయ నాయకులు, అధికారులు, బ్యాంకర్లు తదితరులకు ‘అవినీతి నిరోధక చట్టం (సవరణ)-1988’ కొంతమేర రక్షణ కల్పిస్తుంది. విశ్రాంత ప్రభుత్వోద్యోగులకూ ఇది వర్తిస్తుంది.
అక్రమ మార్గాల్లో వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు లంచాలు ఇవ్వజూపేవారికి శరాఘాతం లాంటి చట్టం అమలులోకి వచ్చింది. సంబంధిత సంస్థల ముందస్తు అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, రాజకీయ నేతలు, బ్యాంకర్లను సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు విచారించడం అసాధ్యం. జూలై 26 నుంచే ఈ చట్టంలోని నిబంధనలు అమలులోకి వచ్చినట్టు కేంద్రం పేర్కొన్నది. ఒక ప్రభుత్వాధికారి తన విధుల్లో భాగంగా చేసిన సిఫారసులు/ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నేరానికి పాల్పడ్డాడని ఫిర్యాదులు వచ్చినప్పుడు ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు అధికారులు/పోలీసులు దానిపై ఎటువంటి విచారణ చేపట్టలేరు అని ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి.

సవరణ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులకు లంచం/ మితిమీరిన ప్రయోజనాలు ఇవ్వజూపినా, ఇస్తానని హామీ ఇచ్చిన వ్యక్తులకు ఏడేండ్ల వరకు జైలు శిక్ష/ జరిమానా గానీ, రెండూ విధించే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు ఉన్న ఏ చట్టాల్లోనూ లంచం ఇవ్వజూపే వ్యక్తులకు శిక్షలు లేవు. కొత్త చట్టంలో వీరికి శిక్షలు విధించే విధంగా నిబంధనలను చేర్చారు. ఒత్తిడి మేరకు లంచం ఇచ్చిన వ్యక్తులు వారంలో సంబంధిత అధికారులు, దర్యాప్తు సంస్థలకు తెలుపాలి. కాగా లంచం తీసుకునే వారికి ఇప్పటివరకు గరిష్ఠంగా మూడేండ్ల జైలు శిక్ష ఉండగా.. దానిని గరిష్ఠంగా ఏడేండ్లకు పెంచారు. వాణిజ్య సంస్థలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

మూడేండ్ల జైలు శిక్ష దీనికి అదనంగా ఉండగా జరిమానా కూడా విధించవచ్చు. ప్రజా ప్రతినిధులకు ఆయాచిత లబ్ధి కలిగించేలా ఏదైనా వాణిజ్య సంస్థ లంచమిచ్చినా, ఇవ్వడానికి ముందుకొచ్చినా శిక్ష తప్పదు. అవినీతి సంబంధిత కేసులను రెండేళ్లలోగా పరిష్కరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో కొన్ని సవరణలు చేయగా, జులై 24న లోక్‌సభ, అంతకుముందే రాజ్యసభ ఆమోదించాయి. అనంతరం దీనిని జులై 26 న రాష్ట్రపతి కోవింద్ ఆమోదం కోసం పంపింది. దీనికి మంగళవారం నాడు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ చట్టంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ. నిజాయితీపరులకు ఈ చట్టంలో సవరణల వల్ల మేలు జరుగుతుందని అన్నారు.

ఇది ఇలా ఉంటే , అవినీతి నిరోధక చట్టానికి సవరణ తర్వాత అప్పుడే మన రాష్ట్రంలో మొదటి కేసు నమోదైంది. కేసు వివరాల్లోకి వెళితే ఎస్‌ఈ ఎస్‌.ప్రవీణ్‌చంద్ర, తెలంగాణ పట్టణ ఆర్థిక వనరుల అభివృద్ధి సంస్థలో ఎస్‌ఈగా పనిచేస్తున్న ఆయన నల్లగొండ జిల్లా ప్రజారోగ్య విభాగం ఈఈగా కూడా బాధ్యతలు నిర్వహించేవాడు. కాంతారెడ్డి అనే సివిల్‌ కాంట్రాక్టర్‌కు రూ.1.32 కోట్ల బిల్లు మంజూరు చేయడానికి లంచం డిమాండ్‌ చేశాడు. తన కార్యాలయంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. అవినీతి నిరోధక చట్టం-2018 సెక్షన్‌ 7(ఏ) కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌ కింద కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి లంచం ఇచ్చిన వ్యక్తిపైన కూడా కేసు నమోదు చేయాలి. కానీ ప్రస్తుత కేసులో బాధితుడు ముందుగానే ఏసీబీని ఆశ్రయించడంతో అతనికి మినహాయింపు లభించింది. పట్టణ ఆర్థిక వనరుల అభివృద్ధి సంస్థలో ఎవరైనా లంచం అడిగితే టోల్‌ ఫ్రీ నంబరు 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.

అయితే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వారిని అనుమతులు లేకుండానే ఏసీబీ అదుపులోకి తీసుకోవచ్చు. ఏసీబీ ట్రాప్ విషయంలో మాత్రమే లంచం ఇచ్చిన వారిపై చర్యలుండవు. కానీ ఎన్ని సందర్భాల్లో ఇది సాధ్యమని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు.

ఈ చట్ట సవరణతో ఎలాంటి విపరీత పరిణామాలుంటాయో కొన్నిరోజులు గడిస్తే కానీ బయటపడదు.

No comments