Header Ads

థియేటర్లలో అధిక ధరలకు చెక్ పెట్టిన ప్రభుత్వం , ఆగస్టు 1 నుండి అమల్లోకి కొత్త నిబంధనలు

ఆగస్టు 1వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సినిమా హాల్స్, మల్టీప్లెక్సుల్లో మంచినీటి బాటిళ్లు, కూల్డ్రింక్స్, ఇతర తినుబండారాలు కేవలం ఎం.ఆర్.పి ధర ప్రకారం విక్రయాలు జరపవల్సి ఉంటుంది. ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేసినా, తూనికల కొలతల శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధింపుతో పాటు జైలు శిక్ష తప్పదని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ శ్రీ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. విడిగా విక్రయించే తినుబండారాలు/పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్ రూపంలో కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం తూనికల కొలతల శాఖ అధికారులు.




సినిమా హాల్స్, మల్టీప్లెక్స్లలో తినుబండారాలు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా గత కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి లీగల్ మెట్రాలజీ శాఖకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో థియేటర్లలో అధిక ధరల విక్రయానికి అడ్డుకట్ట వేయడానికి తూనికల కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాలలోని థియేటర్ యాజమాన్యాలకు అవగాహన కల్పించింది. అగస్ట్ 1వ తేదీ నుండి కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, సమావేశంలో అధికారులను కంట్రోలర్ గారు ఆదేశించారు.

థియేటర్లలో అధిక ధరల విక్రయాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త నిబంధనల అమలుపై కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదివారం నాడు గాంధీనగర్ లోని తూనికల కొలతల శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల తూనికల కొలతల అసిస్టెంట్ కంట్రోలర్లు, ఇన్ స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశం అనంతరం కంట్రోలర్ అకున్ సబర్వాల్ గారు మీడియాతో మాట్లాడుతూ " వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఏ వ్యాపారం కానీ, ఏ సేవ కానీ, ఏ వినోదం కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాలి. ఈ విషయంలో ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆగస్ట్ 1వ తేదీ నుండి ఇవి అమలు :



  1. థియేటర్లు, మల్టీప్లెక్స్లలో ఎం.ఆర్.పి ధర ప్రకారం విక్రయాలు జరపాలి.

  2. తినుబండారాలు, మంచినీటి బాటిల్లు, కూల్ డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి.

  3. విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటెయినర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్డీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్ ఉండాలి.

సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఇవి అమలు :



  1. నుండి స్టిక్కర్ స్థానంలో ఎం.ఆర్.పి , పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి.

  2. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి.

  3. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి.

  4. ఒకే బ్రాండ్ తినుబండారాలు కాకుండా వినియోగదారుడికి వివిధ బ్రాండులు అందుబాటులో ఉంచాలి.

  5. తూనికల కొలతల శాఖ చట్టం ప్రకారం ప్యాకేజ్డ్ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్డీ, కస్టమర్ కేర్ వివరాలు ఉండాలి.

తూనికల కొలతల శాఖ కొత్త నిబంధనల అమలుపై ఆగస్టు 2, 3 తేదీలలో గ్రేటర్ హైదరాబాద్, ఎచ్ఎండీఏ పరిధిలోని థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం. ఆ తరువాత 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం. ఒకే ధర విధానాన్ని అమలు చేయాలి. బహిరంగ మార్కెట్లో ఏదైతే ఎం.ఆర్.పి ఉందో అదే ధరకు థియేటర్లలో కూడా విక్రయించాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తే :



  1. మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు,

  2. రెండోసారి రూ. 50 వేలు,

  3. మూడోసారి రూ. 1 లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష

ఈ విధించే అవకాశం ఉంటుందని కంట్రోలర్ అకున్ సబర్వాల్ గారు హెచ్చరించారు.

వినియోగదారుల ఫిర్యాదులు చేయాలి అంటే :


వినియోగదారుల ఫిర్యాదులు  కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సప్ నంబర్ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి.

నేరుగా తామే వెళ్లి ఫిర్యాదుచేయాలి అనుకుంటే గనుక హైదరాబాద్ లోని "తెలంగాణ ప్రభుత్వం తూనికల కొలతల శాఖ కార్యాలయం ". గాంధీనగర్, హైదరాబాద్ - 500090 కి వెళ్లి కూడా ఫిర్యాదు చేయచ్చు

No comments