Header Ads

పెదకాకాని ‘అమ్మ’.. వీరరాఘవమ్మ!గుంటూరు జిల్లా పెదకాకాని పంచాయితీ కార్యాలయం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఓ వ్యక్తి మాత్రం హాజరవుతారు. మధ్యాహ్న భోజనమూ ఆఫీసులోనే. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఇబ్బంది కలిగినా సమాచారం వచ్చిందే తడవుగా స్వయంగా రంగంలోకి దిగుతారు. కార్యాలయంలో పనులన్నీ పూర్తి అయ్యాకనే ఇంటి గుమ్మం తొక్కేది. అర్ధరాత్రి అయినా, ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆ ఇంటి తలుపులు తెరుచుకునే ఉంటాయి. ఆ దేవాలయంలోకి వెళితే ఆపన్న హస్తం అందుతుందన్న భరోసా ఇచ్చిన ఓ శక్తి.

Veera_Raghavamma
Veera Raghavamma
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పంచాయితీ పెదకాకాని. 30,000 జనాభా ఉన్న ఈ పంచాయితీలో ప్రతి కుటుంబం మనసులో ఆమె ఓ మదర్‌ థెరిసా. అమ్మగా, అమ్మమ్మగా అక్కడివారు ప్రేమగా పిలుచుకుంటారు. అంతలా ప్రజలతో పెనవేసుకున్న బంధం ఆమెది. ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న ఓ సర్పంచ్‌ స్టోరీ ఇది. రాజకీయం తెలీని ఓ నిండైన వ్యక్తిత్వం. ఆమెకు తెలిసిందల్లా ప్రజలకు సేవ చేయడమే. అచీవర్స్‌ స్టోరీస్‌ సగర్వంగా అందిస్తున్న పెదకాకాని సర్పంచ్‌ ఆళ్ల వీరరాఘవమ్మ స్ఫూర్తిదాయక కథనం..

వీరరాఘవమ్మ.. దేశ రాజకీయ చరిత్రలో ఆమె వ్యక్తిత్వం లిఖించతగ్గది. ప్రపంచానికి తెలియని ఓ వెలుగు దివ్వె. ప్రజలే బిడ్డలుగా మనస్ఫూర్తిగా సేవ చేయడంలో ఆనందం వెతుక్కుంటున్న ఓ అసామాన్యురాలు. సంపాదించడం తెలియని అమాయకురాలు. ఆమెకు తెలిసిందల్లా ఇవ్వడమే. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భుజం తడతారు. కన్నీళ్ల విలువ తెలుసు కాబట్టే సాటివారి మనసును అర్థం చేసుకుంటారు. నోరువిప్పి అడక్కపోయినా సాయం చేసే గొప్ప గుణం ఆమెది.

2013లో వీరరాఘవమ్మ సర్పంచ్‌గా గెలిచారు. 4,300పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ పరంగా చూస్తే రెండో స్థానం కైవసం చేసుకుని రాజకీయ ప్రవేశం చేశారు. రెండు దశాబ్దాల క్రితం వీరరాఘవమ్మ జీవిత భాగస్వామి దశరథ రామిరెడ్డి సర్పంచ్‌గా పోటీచేసి విజయం సాధించారు. అపర భగీరథుడిగా ఆయనకు పేరుంది. పెదకాకానికి మంచినీళ్లను అందించిన ఘనత ఆయనదే. ఊళ్లో నీటికి కటకట ఉన్న సమయంలో వాటర్‌ ట్యాంకు కట్టించారు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా ట్యాంకు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల మనసులను గెల్చుకున్నారు. ఈ కుటుంబం మీద గ్రామ ప్రజలు చూపే ప్రేమ, ఆప్యాయతనుబట్టి వారి స్థానం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

వీరరాఘవమ్మ వయసు 78 ఏళ్లు. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లడం ఆమె దినచర్య. కార్యాలయంలో ఉన్నంతసేపూ ఆమె గది తలుపులు తెరిచే ఉంటాయి. ఎవరైనా నేరుగా వెళ్లి కలుసుకోవచ్చు. తనదగ్గరకు ఎవరొచ్చినా పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఏదైనా ఫిర్యాదు అందితే స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. పనిపూర్తి అయ్యే వరకు సిబ్బంది వెంటే ఉంటారు. చేయాల్సిన పనులు డైరీలో రాసుకుంటారు. ఏవైనా సంతకాలు పెట్టాల్సి ఉందా అని స్వయంగా తన సిబ్బందిని అడుగుతారు. ఆరోజుకి అన్ని పనులు పూర్తి అయ్యాయి, కలిసేవారు ఎవరూ లేరు అని నిర్ధారించుకున్నాకే ఇంటికి వెళతారు.

ఊళ్లోనే ఇల్లుంది. వచ్చేప్పుడు లంచ్‌ బాక్సు తెచ్చుకోవడం దేనికి, ఇంటికి మధ్యాహ్న భోజనానికి వెళ్లొచ్చు కదా అని అడిగితే.. ఇంటికి వెళితే గంట సమయం పడుతుంది. అదే ఇక్కడే భోజనం చేస్తే 10 నిముషాల్లో పూర్తి అవుతుంది. నాకోసం వచ్చిన వాళ్లు ఇబ్బంది పడొద్దు’ అని వినమ్రంగా చెప్తారు. చిన్ననాటి నుంచి పనిచేసుకోవడం అలవాటు కాబట్టే రోజూ ఆఫీసుకి, ఊళ్లోకి వెళ్తానని అంటారు.

పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా మనస్ఫూర్తిగా ప్రజలతో మమేకమవడం వీరరాఘవమ్మ ప్రత్యేకత. ‘కష్టాల్లో ఉన్నవాళ్లను చూస్తే జాలేస్తుంది. వారికి బతకడానికి అవకాశం కల్పించడం మా కుటుంబానికి అలవాటైంది. సాయం చేయడం మా అత్తగారు పేరమ్మ నుంచి వంశపారపర్యంగా వస్తోంది. ఆమె స్ఫూర్తితో దశరథ రామిరెడ్డిగారి చేయి ఎప్పుడూ పైనే ఉండేది. ప్రజల కోసం ఉన్న ఆస్తి అంతా ధారాధత్తం చేశారు. సాయపడడంలో మేము ఏనాడూ వెనుకడుగు వేయలేదు. ఇప్పుడు ఆ ఆపన్న హస్తాన్ని మా పిల్లలు వారసత్వంగా కొనసాగిస్తున్నారు’ అని చెప్పారు.

ఆస్తి అంతా కరుగుతున్నా ఏనాడూ భర్తని వారించని గొప్ప గుణం వీరరాఘవమ్మది. ‘ఆస్తి తగ్గుతున్న విషయం మనసులో ఉండేది. ఉన్నదాంతో లాక్కొచ్చారు. ఏ లోటు లేకుండా జరుగుతోంది కదా అని భావించేదాన్ని. ఇంటికి వచ్చినవారికి భోజన ఏర్పాట్లు చేసేదాన్ని. ఉన్నది ఏదో తినేవాళ్లం. అయినా చాలా సంతోషంగా గడిపాం. డబ్బులు సంపాదించాలన్న ఆలోచనే లేదు. మనమీద నమ్మకంతో ప్రజలు ఈ అధికారాన్ని అప్పజెప్పారు. వారికి చేయాల్సింది చేశాను. ఇంకా చేయాల్సి ఉంది. ఆడవాళ్లు సర్పంచ్‌గా ఉంటే వారి కుటంబంలో ఉన్న మగవాళ్లు కార్యాలయ బాధ్యతలు చూస్తారు. నా విషయంలో అలా కాదు. అన్నీ నేనే చూసుకుంటాను. పనులు ఆగిపోతాయని నేను ఎటూ పోను. ప్రజలకు అందుబాటులోనే ఉంటాను’ అని స్పష్టం చేశారు.

వీరరాఘవమ్మ పెద్దబ్బాయి సాంబిరెడ్డి స్వర్గస్తులైనారు. రెండవ కుమారుడు అయోధ్య రామిరెడ్డి రామ్‌కీ గ్రూప్‌ వ్యవస్థాపకులుగా అందరికీ సుపరిచితం. రామ్‌కీ ఫౌండేషన్‌ ద్వారా పంచాయితీ పరిధిలో, అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో కుమారుడైన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రజల పక్షాన పోరాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. చిన్నవాడు పేరిరెడ్డి ఓ వ్యాపారవేత్త.

ప్రభుత్వ నిధులు వచ్చేవరకు ఎదురు చూడడం ఈ అభినవ సర్పంచ్‌ చరిత్రలోనే లేదు. తన సొంత ఖర్చులతో పనులు పూర్తి చేసేస్తారు. సర్పంచ్‌గా గెలవగానే పంచాయితీ కోసం ఓ ట్రాక్టర్, ఆటో కొనిపెట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమయానికి జీతం రాకుంటే తన జేబులోంచి చెల్లిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టులో కొన్ని పేద కుటుంబాల ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఈ విషయం తెలిసి ఒక్కో కుటుంబానికి రూ.15,000 ఖర్చుచేసి స్లాబ్‌ పూర్తి చేయించారు. తుఫాను వచ్చినప్పుడు గ్రామ ప్రజలకు దుస్తులు, ఆర్థిక సాయం అందించారు.

అమ్మ మనసు కదా తెలియగానే స్పందిస్తారు. రేకుల షెడ్డులో ఓ పేద మహిళ తన ఇద్దరు బిడ్డలతో ఉండేది. పెద్దమ్మాయి అంగవికలురాలు. భర్త లేడు. ఆ కుటుంబ దీనస్థితి గురించి తెలియగానే తన జేబులోంచి రూ.40,000 ఖర్చు చేసి ఇంటి నిర్మాణానికి సాయపడ్డారు. పేదింట పెళ్లి అయితే తాళిబొట్టు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. మృతుల కుటుంబాలకూ ఆర్థిక సాయం చేస్తారు. సొంత ఖర్చుతో పాఠశాలల్లో గదుల నిర్మాణం చేపట్టారు. శ్మశానంతోపాటు రోడ్డు నిర్మించారు. గుడి, మసీదు, చర్చి కట్టించారు. అపర ఖర్మశాల సత్రంలో హాల్, మరుగుదొడ్ల నిర్మాణంలో ఆర్థిక సాయం చేశారు. పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్‌షిప్స్‌ అందజేస్తున్నారు.

చిన్న నాటి నుంచే ఇల్లు, పొలం పనులను స్వయంగా చూసుకునేవారు వీరరాఘవమ్మ. ఉదయం 3.30కి లేచింది మొదలు రాత్రి అయ్యే వరకు అన్నింటా ముందుండేవారు. సంగీతమూ నేర్చుకున్నారు. హిందీ భాషపైనా ఆమెకు పట్టుంది. వీరరాఘవమ్మ జీవితంలో ఆమె అత్త పేరమ్మ పాత్ర అత్యంత కీలకం. క్రమశిక్షణ, చదువు, సంస్కారం పేరమ్మ నుంచే నేర్చుకున్నారు. అలాగే పేరమ్మ తల్లి కనకమ్మ నుంచి ధైర్యం, సాహసం, పేరమ్మ అత్త కృష్ణవేణమ్మ నుంచి దాతృత్వం, సహనం, త్యాగం అలవడింది.

పేరమ్మ, కనకమ్మలు చాలా మంది పిల్లల చదువుకు ఆర్థిక సాయం చేశారు. అదే ఒరవడిని వీరరాఘవమ్మ కొనసాగిస్తున్నారు. ఇంటికి సాయం కోసం ఎవరొచ్చినా ఖాళీ చేతులతో పంపేవారు కాదు. భిక్షగాళ్లు ఎంత మంది వచ్చినా విసుక్కోకుండా దానం చేసేవారు. అనాధలకు ఇంట్లో తెలియకుండా డబ్బులు దానం చేసేవారు. తన పరిస్థితిని చూసి పిల్లలు విసుక్కుంటే ‘ఆకలి, ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయాలి’ అని సర్దిచెప్పేవారు.

ఎంతో మంది వితంతువులు, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, అనాధలకు అన్నీ తానై చూసుకునేవారు వీరరాఘవమ్మ. కుష్టురోగులనూ అమ్మలా చేరదీశారు. చనిపోయిన తర్వాత వారి ఖర్మఖాండలు జరిపించిన మహానుభావురాలు. దేవరపల్లి శేషమ్మ అనే అనాధ పేరమ్మతోపాటే ఇంట్లో ఉండేవారు. వీరి చివరి రోజుల్లో అన్ని సపర్యలు చేశారు వీరరాఘవమ్మ. ఒకవైపు పెద్దబ్బాయిని పోగొట్టుకున్న సమయంలోనూ శేషమ్మకు సాయంగా ఉండేవారు.

‘దేవుడు నాకు మంచి జీవితం ఇచ్చాడు. ఒక మహిళగా నా భర్తకు, అత్తమామలకు, పిల్లలకు, బంధువులకు, స్నేహితులకు, దాయాదులకు, అనాధలకు సేవ చేశాను. ఇప్పుడు పెదకాకాని, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కుటుంబం, పిల్లలు, అందరూ రెండో స్థానంలో ఉన్నారు. ఊరు మాత్రం నా తొలి ప్రాధాన్యత అయింది. సొంత పిల్లల కంటే ఎక్కువ అయ్యారు. నేను చేస్తున్న పనిలో సంతోషం ఉంది. నా జీవితానికి పరిపూర్ణత కలిగిందనిపిస్తోంది. గ్రామ ప్రజలకు నేనిచ్చే సలహా ఏమంటే విలువలు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. కష్టపడి పనిచేయాలి, సహనం, త్యాగం అలవర్చుకోవాలి’ అని చెబుతారు వీరరాఘవమ్మ.

దశరథ రామిరెడ్డి–వీరరాఘవమ్మ కుటుంబం పెదకాకాని పంచాయితీ పరిధిలో పలు అభివృద్ధి పనులు, స్వచ్ఛంద కార్యక్రమాలకు ఇప్పటి వరకు రూ.3 కోట్లదాకా ఖర్చు చేశారు. రూ.15 లక్షలతో అక్కడి చెరువుకు ఆనుకుని వాకింగ్‌ పార్క్‌కు శ్రీకారం చుట్టారు. అయోధ్య రామిరెడ్డి అండ ఉంది కాబట్టే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని అంటారు వీరరాఘవమ్మ.

‘అమ్మ మృధుస్వభావి. తాను అనుకున్నది సాధించే వరకు నిబ్బరంగా ఉంటారు. ఎవరినీ నొప్పించరు. తనకోసం ఏదీ అడగరు. సర్పంచ్‌గా తన సేవల విస్తృతి పెరిగింది. అమ్మ ఆలోచనలన్నీ కార్యరూపంలోకి తెచ్చేందుకు పేరమ్మ, కనకమ్మ, కృష్ణవేణమ్మ, శేషమ్మలకు గుర్తుగా మహిళా సాధికారత లక్ష్యంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నాం’ అని అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

No comments